వీరిలో 47.63 కోట్ల మంది మహిళలు
2019తో పోలిస్తే 7.43% ఓటర్ల పెరుగుదల
సార్వత్రిక ఎన్నికల గణాంకాలను విడుదల చేసిన ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి దేశంలో 97.97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడున్న 91.19 కోట్ల మందితో పోలిస్తే ఇది 7.43% ఎక్కువని పేర్కొంది. 2019లో 61.4 కోట్ల ఓట్లు పోలవగా 2024లో 64.64 కోట్ల ఓట్లు పోలయ్యాయని ఇందులో 64.21 కోట్లు ఈవీఎంలలో నమోదైనట్లు వివరించింది.
ఇందులో 32.93 కోట్ల పురుషులు, 31.27 కోట్ల మహిళలు, 13 వేల మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా, సార్వత్రిక ఎన్నికల్లో 42.81 లక్షల పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. అస్సాంలోని ధుబ్రి నియోజకవర్గంలో అత్యధికంగా 92.3% ఓట్లు పోల్ కాగా... అత్యల్పంగా శ్రీనగర్‌లో 38.7% పోలింగ్ నమోదైంది. అయితే 2019లో శ్రీనగర్‌లో ఇది 14.4% మాత్రమేనని ఈసీ గుర్తు చేసింది.
దేశవ్యాప్తంగా 2024లో నోటాకు 63.71 లక్షల ఓట్లు పడ్డాయని కూడా వివరించింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో జరిగిన ప్రపంచంలోని అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ విస్తృత గణాంకాలను సీఈసీ గురువారం విడుదల చేసింది.
ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 2024లో 10.52 లక్షల పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. 2019 కంటే ఇది 14,816 ఎక్కువ. 2019లో 540 చోట్ల రీపోలింగ్ జరగ్గా ఈ ఏడాది కేవలం 40 పోలింగ్ స్టేషన్లలోనే రీపోలింగ్ అయ్యింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 1.62 లక్షల పోలింగ్ స్టేషన్లు ఉండగా...2019తో పోలిస్తే 2024లో బిహార్‌లో అత్యధికంగా 4,739 పోలింగ్ స్టేషన్లు పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment