రాజకీయాలలో ఓర్పు,నేర్పు అవసరం. వ్యూహం కూడా ముఖ్యమే. ఏపీలో జరుగుతున్న కూటమి రాజకీయాలను పరిశీలిస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు అభాసుపాలు అవుతున్నారు. అది ఆయనకు అర్దం కావడం లేదేమో కాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బాగానే అవగతమవుతోంది. రాజకీయాలలో కలిసి ఉంటూనే బోల్తా కొట్టించడం ఒక ప్లాన్ గా ఉంటుంది.ఈపాటికే పవన్ కళ్యాణ్ కు ఆ విషయం బోధపడవలసి ఉంది.కాని అలా జరగడం లేదు. దానికి కారణం..
.. ఆయనకు అనూహ్యమైన రీతిలో ఉప ముఖ్యమంత్రి పదవి దక్కడం ,దానిని ఆయన ఎంజాయ్ చేస్తూ ఉండడం ఒకటైతే.. భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలన్న కాంక్షతో తొందరపడుతున్న వైనం మరో కారణంగా కనిపిస్తుంది. రాజకీయాలలో ఎల్లకాలం అబద్దాలు ఆడితే అది ఆశించిన ఫలితం ఇవ్వకపోవచ్చు!. ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శైలి అలవరచుకుని నిత్యం అబద్దాలు చెప్పడం ద్వారా ప్రజలలో పలుకుబడి పెంచుకోవాలని పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. జనంలో అవసరం ఉన్నా,లేకపోయినా తిరుగుతూ తానేదో సూపర్ సీఎంనని అనుకుంటే అది అంత తెలివైన పని కాదని ఇప్పుడు తెలియకపోవచ్చు. ఆ క్రమంలో పవన్ ఇటీవల పలు ఘట్టాలలో చేసిన ప్రకటనలు ఆయన ప్రతిష్టను దెబ్బతీశాయనే చెప్పాలి.
రాజమండ్రి వద్ద గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ చేసిన ప్రసంగం చాలా అభ్యంతరకరంగా ఉంది. యువకులకు మంచి మాటలు చెప్పవలసిన బాధ్యతలో ఉన్న పవన్.. అల్లరి ,చిల్లర పనులు చేయండని సలహా ఇవ్వడం పై విమర్శలు తలెత్తాయి.యువకులకు ఉద్యోగాలు రావడానికి ఇంకా సమయం పడుతుంది కనుక ,ఇలాంటి సినిమా ఉత్సవాలలో పాల్గొనాలని, సినిమాలు చూస్తూ చొక్కాలు చించుకోవాలని, స్టంట్ లు నేర్చుకోవాలని, మోటారు సైకిళ్ల సైలెన్సర్ లు తొలగించి విపరీతమైన ధ్వని సృష్టిస్తూ గోల చేయాలని చెప్పడం చూస్తే పవన్ కు అసలు మెచ్యూరిటీ ఉందా అన్న సందేహం కలుగుతుంది.
ఒక వైపు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువత,పేద వర్గాలు మంచి విద్య అభ్యసించాలని, చదువే సంపద అని హితబోధ చేస్తూ వచ్చారు. కానీ, పవన్ మాత్రం అల్లరి చేయండని చెబుతున్నారన్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.గేమ్ చేంజర్ సినిమా కార్యక్రమానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించడం విషాదం. ఇందుకు ఎవరైనా బాధ పడతారు. ఇందులో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా తప్పు చేసినట్లు చెప్పరు. కాని హైదరాబాద్ సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఉదంతంలో ఆయనకు బంధువు, మరో నటుడు అయిన అల్లు అర్జున్ పట్ల వ్యవహరించిన తీరు .. చేసిన వ్యాఖ్యలు మెడకు చుట్టుకున్నాయి. అల్లు అర్జున్ కు తొక్కిసలాటతో సంబంధం లేకపోయినా తెలంగాణ పోలీసులు కేసు పట్టారని సినిమా ప్రముఖులంతా భావించి ఆయనను పరామర్శించారు. చివరికి ఆయన పార్టనర్ చంద్రబాబు కూడా ఫోన్ చేసి పలకరించారు. కానీ, ఫోన్ పలకరింపు కూడా చేయలేదు పవన్?!.పైగా..
రేవంత్ కు మద్దతుగా ప్రసంగించారు.అల్లు అర్జున్ మానవత్వంతో వ్యవహరించలేదని అనుచిత వ్యాఖ్య చేశారు.తొక్కిసలాట లో మరణించిన రేవతి కుటుంబానికి సుమారు రెండు కోట్ల మేర వివిధ రూపాలలో సాయం అందింది. అయినా రేవంత్ ను ప్రసన్నం చేసుకోవడానికి అనేట్లు పవన్ కామెంట్లు చేశారు.పోనీ అదే సమయంలో బెనిఫిట్ షో లు, టిక్కెట్ల దరలు పెంచుకోవడానికి , తొక్కిసలాటకు ఏమి సంబంధం అని పవన్ ప్రశ్నించలేదు.సినిమా టిక్కెట్ల రేట్లతో ప్రభుత్వానికి ఏమి సంబంధం అని గతంలో జగన్ ప్రభుత్వంపై పెద్దపెట్టున అరచిన పవన్ కల్యాణ్.. తెలంగాణలో మాత్రం ధైర్యం చేయలేకపోయారు. రాజమండ్రి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు, మెగా కుటుంబ వీరాభిమానులు మరణిస్తే జనసేన తరపున చెరో ఐదు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.ఇది మానవత్వమేనా? అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. పవన్ కళ్యాణ్ కాని, రామ్ చరణ్ తేజ కాని, గేమ్ చేంజర్ సినిమా బృందం కాని ఎవరూ బాధిత కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదన్న ప్రశ్నకు జవాబు దొరకదు.
అర్జున్ విషయంలో ఒక నీతి, తన వరకు వచ్చేసరికి మరో రీతా అనే విమర్శ వచ్చింది.పైగా జగన్ టైమ్ లో రోడ్డు బాగు చేయలేదు కనుక ప్రమాదం జరిగిందని దిక్కుమాలిన ఆరోపణ చేశారు.తీరా చూస్తే ఆయన అబద్దం ఆడారని తేలిపోయింది. ప్రమాదం జరిగిన చోట రోడ్డుపై ఎక్కడా ఒక్కగొయ్యి కూడా లేదు.అయినా ప్రమాదం జరిగింది. తమ అభిమానులు మరణించిన విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం పవన్ ఈ ప్రయత్నం చేశారని అనుకోవాలి.మరణించిన యువకుల కుటుంబ సభ్యులు రోదిస్తూ మెగా కుటుంబం పట్ల వారికి ఎంత అభిమానమో వివరించారు. ఈ సినిమా పిచ్చి తోనే వారు మరణించారని వాపోయారు. దాని గురించి పవన్ నోరెత్తడం లేదు. రోడ్డు బాగోలేదని చెబుతున్నారు. నిజానికి ఆ ఏడీబీ రోడ్డు దశాబ్దాల తరబడి రకరకాల సమస్యలను ఎదుర్కుంటోంది. దాంతో రోడ్డు పాడవుతోంది. అయినా తాము రాగానే అన్నీ చేసేస్తామని చెప్పిన కూటమి పెద్దలు ఈ ఏడు నెలలు ఏమి చేసినట్లు అన్న ప్రశ్న కూడా వస్తుంది.
తాజాగా కూటమి ఎమ్మెల్యే ఒకరు తనకు కమిషన్ ఇవ్వకుండా మెటల్ గ్రావెల్ తొలనివ్వడం లేదని ఆరోపణ వచ్చింది.ఇలా ఏది పడితే అది మాట్లాడితే పవన్ కు ఏమి ఉపయోగం?. అది టీడీపీకే ప్రయోజనం అవుతుంది. పవన్‌కు సీఎం అవ్వాలనే కోరిక ఉన్నా, ఆయన తీరు ఆ స్థాయిలో లేదని , లోకేష్ సీఎం అయితేనే బెటర్ అని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తాయి.
నిజానికి అబద్దాలు చెప్పడం పవన్‌కు కొత్త కాదు.ఆయన ఈ విషయంలో చంద్రబాబు వద్ద ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.కాని అబద్దాలు ఆడడంలో చాకచక్యం కూడా అవసరమే అని అంటారు. అందులో చంద్రబాబు సిద్దహస్తులనే అభిప్రాయం ఉంది. ఆ విషయం తెలియక చంద్రబాబు చెప్పినట్లే చెబుతూ, ఆయన చేసినట్లే చేస్తూ పవన్ పరువు పోగొట్టుకుంటున్నారు. గతంలో పవన్ ఏపీఅంతటా 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ తప్పుడు ఆరోపణ చేసి.. దానికి వలంటీర్లను బాధ్యులు చేసి అప్రతిష్ట మూట కట్టుకున్నారు.చంద్రబాబుతో పాటు అనేక వాగ్దానాలను చేసి ప్రజలను మోసం చేసిన వ్యక్తిగా ఇప్పుడు ప్రజలు భావించే పరిస్తితి తెచ్చుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించాయంటూ ,హోం మంత్రి బాధ్యతలు చేపడతానంటూ వ్యాఖ్యానించి , ఆ తర్వాత జారిపోయి,దానిని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు సూచించినట్లు సోషల్ మీడియాపై దాడి చేశారు. ఆ విషయం జనానికి అర్ధం అయింది.
పవన్ తాను ఎక్కడకు వెళితే అక్కడే పుట్టానని చెప్పడం,చదువుపై ఒక్కోసారి ఒకరకంగా మాట్లాడడం వంటివాటిని ఆయన అభిమానులు కూడా సరిపెట్టుకున్నారు.కాని అధికారం వచ్చిన తర్వాత కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నారు. అది చంద్రబాబు మెప్పుదల కోసమో లేక, తాను సూపర్ సీఎం అని పరోక్షంగా ప్రజలు అనుకోవాలన్న లక్ష్యంతోనో ఇలా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు
👉 తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు ఒక అసత్య ఆరోపణ చేశారు. వెంటనే పవన్ సనాతని అవతారం ఎత్తి అంతకన్నా గట్టిగా ప్రచారం చేసి బోల్తా పడ్డారు.
👉తన పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన రేప్ బాధితులను ,జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ-ఆయన అనుచరులు చేసిన దౌర్జన్యాలకు గురైన బాధితులను పరామర్శించకుండా.. కడపలో జరిగిన ఒక చిన్న ఘటనపై ఆవేశంగా స్పందిస్తూ అక్కడకు వెళ్లిన తీరుతో అపహాస్యం పాలయ్యారు.
👉 వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ కంపెనీ భూముల వద్దకు అవసరం లేకపోయినా సందర్శించి ఏదో చేయాలని అనుకున్నారు. కాని అధికారులు అక్కడ ఏమీ లేదని చెప్పడంతో తుస్సుమన్నారు.
👉కాకినాడ వద్ద సముద్రంలోకి వెళ్లి తనకు అధికారం లేకపోయినా ‘‘సీజ్ ద షిప్’’ అంటూ ఆదేశించి ఈయనేం ఉప ముఖ్యమంత్రి? అని అధికారులు తల పట్టుకునేలా చేసుకున్నారు.
ఇవన్నీ చూస్తే తాను లోకేష్ కన్నా సమర్ధుడనని, అన్ని వ్యవహారాలలో తను జోక్యం చేసుకోగలనని చెప్పుకోవడానికి తంటాలు పడుతున్నట్లుగా ఉంది. బీజేపీతో కలిసి భవిష్యత్తులో వేరు కుంపటి పెట్టవచ్చని పవన్ పై ఇప్పటికే టీడీపీ అనుకూల మీడియా కథనాలు రాయడం ఆరంభించింది. పవన్ వేస్తున్న తప్పటడుగులతో జనసేన కార్యకర్తలు నెత్తి,నోరు కొట్టుకుంటుంటే.. టీడీపీ నేతలు, శ్రేణులు మాత్రం లోలోపల సంతోషిస్తున్నాయి. ఇలాంటి పిచ్చి చేష్టలు, ప్రకటనల ద్వారా పవన్ కల్యాణ్ భ్రష్టు పడితే అది తమకే మరింత ఉపయోగమన్నది వారి ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. పైకి ఏదో పవన్ కు బాగా మర్యాద ఇస్తున్నట్లు కనిపిస్తూ.. మరోవైపు ఆయా సందర్భాలలో పవన్ సెల్ఫ్ గోల్ వేసుకునేలా టిడిపి నాయకత్వం ,ముఖ్యంగా లోకేష్ అనుచర వర్గం ప్రయత్నిస్తున్నట్లు కొందరి భావనగా ఉంది. ఎందుకంటే లోకేష్ సీఎం కాకుండా పవన్ అడ్డుపడుతున్నారన్న అభిప్రాయం ఏర్పడడమే!.
ఈ టరమ్ మాత్రమే కాకుండా ఆ పై పదేళ్లు కూడా చంద్రబాబు సీఎంగా ఉండాలని చెప్పి సంతోషపెడుతున్నానని పవన్ భావిస్తుండవచ్చు.కాని ఇది లోకేష్ కు మంట పుట్టించే అంశమే అవుతుంది. వైఎస్సార్‌సీపీ చేసే విమర్శల వల్ల జరిగే నష్టం కన్నా.. టీడీపీ నేతలు అమలు చేసే వ్యూహాల వల్లే పవన్ కు అధికనష్టం కలుగుతోంది. ఏది ఏమైనా పవన్ కల్యాణ్ పూర్తిగా టీడీపీకి, చంద్రబాబుకు సరెండర్ అయినట్లు కాకుండా.. తనకంటూ ఒక మంచి టీమ్ ను ఏర్పాటు చేసుకుంటే మంచిది. సరైన రీతిలో రాజకీయం చేయకపోతే నష్టపోయేది పవనే అవుతారు. ఏపీలో గత ఏడు నెలల పరిస్థితులు చూస్తే.. ఏదో రకంగా వచ్చిన రాజకీయవకాశాన్ని పవన్ తనకు తాను చేజార్చుకుంటున్నారన్న భావన ఏర్పడుతోంది.
::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment