విజయవాడ, సాక్షి: కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు కోసం కసరత్తులు ముగిశాయా? లేదంటే ఇంకా చర్చించాల్సి ఉందా? అసలు కూటమి పార్టీలు ఏ శాఖల కోసం పట్టుబట్టాయి? కీలక శాఖలను టీడీపీనే దక్కించుకోబోతోందా? త్యాగాల జనసేన శాఖల విషయంలో పంతం నెగ్గించుకుంటుందా? ఫలానా వాళ్లకు ఫలానా మంత్రిత్వ శాఖ అని లీకులు ఇస్తోంది ఎవరు?..
ఏపీలో కొత్త మంత్రులకు ఏయే శాఖలు కేటాయిస్తారనేదానిపై ఈ సాయంత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సచివాలయంలో సీఎంగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించాక.. ఈ ప్రకటన ఉండనున్నట్లు అధికారిక సమాచారం. మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తి చేశారని చెబుతున్నప్పటికీ.. మరోసారి పునఃసమీక్షిస్తారా? అనే చర్చా మొదలైంది.
గురువారం ఆయన తిరుపతి, ఎన్టీఆర్ జిల్లాల పర్యటనలు ముగించుకున్నాక అమరావతికి తిరిగి రానున్నారు. సాయంత్రం సచివాలయం వెళ్లి సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల ఫైల్స్‌పైనా సంతకాలు చేస్తారని ఇప్పటికే సమాచారం అందింది. అయితే.. ఆ తర్వాతే ఎవరికి ఏ శాఖలు కేటాయించిందీ ప్రకటించనున్నారట. ఈ క్రమంలో గత రెండు రోజులుగా శాఖల కేటాయింపులపై లీకులు అందుతున్నాయి.
ఇటు టీడీపీ శ్రేణులు.. అటు జనసేన.. ఇంకోవైపు ఎల్లో మీడియా సంస్థలు.. మంత్రిత్వ శాఖలపై గత రెండురోజులుగా వరుసబెట్టి కథనాలు ఇస్తున్నాయి. అందులో మొదటిది పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రి అవుతారని. అయితే నిన్న మంత్రిగానే పవన్ కల్యాణ్ ప్రమాణం చేసినప్పటికీ.. అధికారికంగా డిప్యూటీ సీఎం అని ఎక్కడా ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఆయన సోదరుడు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ఉప ముఖ్యమంత్రి అనే లీక్ ఇచ్చేశారు.
ఇక.. జనసేనకు మూడూ కీలక శాఖలే ఉంటాయని టీడీపీ అనుకూల ప్రధాన మీడియా కథనం ఇచ్చింది. అందులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు పేర్కొంది. అయితే.. పవన్ హోం శాఖ కోసం కూడా పట్టుబడుతున్నారంటూ జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాయి. మరోవైపు నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్టు లీకులు అందుతున్నాయి.
ఇక టీడీపీ శ్రేణులేమో.. ఐటీ శాఖ మరోసారి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ బాబుకే వెళ్లొచ్చని చెబుతున్నాయి. గతంలో.. 2014 టైంలో ఎమ్మెల్సీగా నారా లోకేష్ ఈ శాఖను చేపట్టారు. అయితే టీడీపీలోనే మరో వర్గం లోకేష్‌కు ఈసారి ఇంకా ప్రాధాన్యం ఎక్కువ ఉన్న మంత్రిత్వ శాఖ దక్కుతుందని చెప్పుకుంటోంది. సీఎం చంద్రబాబు బాధ్యతను స్వీకరించిన తర్వాత రాత్రికి అధికారిక ప్రకటన. ఇలా ఏ వర్గానికి ఆ వర్గం ఫలానా మంత్రిత్వ శాఖ దక్కుతుందనే ప్రచారంలో ఉంటే.. మరో మిత్రపక్షం బీజేపీ మాత్రం ఒక్క మంత్రి పదవి పోస్ట్ మీద ఎలాంటి వ్యాఖ్యా చేయకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment