
సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు పర్యటనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu). ఎన్నికల కోడ్ అంటూ వైఎస్ జగన్‌ను ఇబ్బంది పెట్టే ప్లాన్ చేస్తున్నారని అన్నారు. మిర్చి యార్డ్ పర్యటనకు ఎన్నికల కోడ్ వర్తించదు. కాబట్టి, ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీని వైఎస్ జగన్‌కు ఇవ్వాల్సిందేనని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్(YS Jagan) గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనపై కుట్ర జరుగుతుంది. ఎన్నికల కోడ్ వంక పెట్టి వైఎస్ జగన్ పర్యటనలో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ, వాళ్లే ఇబ్బంది పడతారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంది. మేము ఆ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదు.. ప్రచారం చేయడం లేదు. కనీసం మిర్చి యార్డులో మైకు కూడా వాడటం లేదు. వైఎస్ జగన్ మిర్చి యార్డ్ పర్యటనకు ఎన్నికల కోడ్ వర్తించదు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ వైఎస్ జగన్‌కు ఇచ్చి తీరాల్సిందే. పోలీస్ అధికారులు ఇది గుర్తుపెట్టుకోవాలి.
కూటమి సర్కార్ పాలనలో మిర్చి ధర సగానికి సగం పడిపోయింది. మిర్చి రైతుల గోడు వినటానికి వైఎస్ జగన్ గుంటూరు(Guntur Mirchi Yard) మిర్చి యార్డుకు వస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైంది. వైఎస్సార్‌సీపీ హయాంలో గిట్టుబాటు ధర లేని పంటలకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసింది’ అని చెప్పుకొచ్చారు.
అనంతరం, పోలీసుల తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అంబటి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ భద్రతలో పోలీసుల తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. జడ్ ప్లస్ కేటగిరీ ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు. గుంటూరు మార్కెట్ యార్డు వద్ద ఒక్క పోలీసు కూడా కనిపించడం లేదు. ఉద్దేశపూర్వకంగా జగన్‌కు భద్రతా సమస్యలు సృష్టించాలనే కుట్ర జరుగుతోంది. ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతుల గోడు బయటకు రాకూడదనే ప్రభుత్వం కుట్ర చేస్తోంది. భద్రత లేకుండా చేసి సమస్యలు సృష్టించాలని చూస్తోంది. ప్రభుత్వం తీరు చాలా అరాచకంగా ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కావాలనే వైఎస్ జగన్‌కు భద్రతను కుదిస్తున్నారు. పాడైపోయిన బుల్లెట్ ఫ్రూఫ్ కార్లు ఇచ్చారు. కనీసం రివ్యూ చేయకుండానే ఉన్న ఫళంగా జగన్ భద్రతను కుదించేశారు. జిల్లాల్లో ఆయన పర్యటనల సమయంలోనూ ఇదే తీరు కనిపిస్తోంది అంటూ వ్యాఖ్యలు చేశారు.

Comments
Please login to add a commentAdd a comment