జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడైన కొణిదెల నాగబాబు త్వరలో ఏపీకి మంత్రి కాబోతున్నారు. ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఆ ప్రకటన చేశారు. ఈ పరిణామంపై జనసేన ఫుల్ ఖుషీగా ఉంది. కష్టకాలంలో అండగా ఉన్న అన్నకు పవన్ తగిన బహుమతి ఇవ్వబోతున్నాడని అనుకుంటున్నారు. కానీ, టీడీపీ మాత్రం లోలోపల రగిలిపోతోంది. అందుకు కారణం.. గతంలో టీడీపీని, చినబాబును నాగబాబు ఫుల్‌గా ఆడేసుకోవడం!.
2014లో జనసేన ఆవిర్భావం నుంచి పవన్ వెంటే ఆయన అన్న నాగబాబు నడుస్తున్నారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో ఆయన రాజకీయ మనుగడ కష్టమేనని అంతా అనుకున్నారు. అనూహ్యంగా.. జనసేన ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతూ పార్టీ బలోపేతం కోసం పని చేశారు. 2024 ఎన్నికలకు పవన్ టీడీపీతో పొత్తు ప్రకటించగానే.. జనసేన శ్రేణుల్లో నైరాశ్యం ఆవహించింది. అయితే.. ఆ అసంతృప్తిని కప్పిపెట్టడంలో నాగబాబే ముఖ్యభూమిక పోషించారు. చివరకు ఏదైతేనేం.. ఎమ్మెల్సీ కోటాతో మంత్రి పదవి దక్కించుకోబోతున్నారు. అయితే.. ఈ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది.
నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై టీడీపీలో కొందరు అసంతృప్తితో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా కొణిదెల నాగబాబును విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పదేళ్లుగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని వ్యక్తిని.. ఇలా ఎమ్మెల్సీ కోటాలో మంత్రిని చేయడం ఏంటంటూ పోస్టులు పెడుతున్నారు. నందమూరి బాలకృష్ణలాంటి అర్హత ఉన్నవాళ్లు ఉండగా.. ఏనాడూ ఎన్నికల్లో గెలవని నాగబాబును మంత్రిని చేయడం ఏంటని? ప్రశ్నిస్తున్నారు. అదే టైంలో.. గతంలో నారా లోకేష్‌ను టార్గెట్ చేసుకుని నాగబాబు చేసిన పోస్టులను కొందరు ప్రస్తావిస్తున్నారు.
2019-24 మధ్య వైఎస్సార్‌సీపీతో పాటు టీడీపీని టార్గెట్‌గా పెట్టుకుని నాగబాబు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ‘మై ఛానెల్ నా ఇష్టం’ పేరిట యూట్యూబ్ చానెల్‌లో అడ్డగోలు కామెంట్స్ చేశారు. అందులో చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలకు కౌంటర్‌తో పాటు కొడుకు లోకేష్ నోరు జారి చేసిన ప్రసంగాలను నాగబాబు బాగా హైలైట్ చేశారు. యూట్యూబ్ ఆదాయం కోసమే నాగబాబు ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నాడంటూ ఆయనపై ఆ టైంలో సెటైర్లు కూడా బాగానే పేలాయి. చివరకు.. ఎందుకనో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
సంబంధిత వార్త: ‘లోకేష్ కామెడీ ముందు జబర్దస్త్ ఏపాటిది’
కట్ చేస్తే.. 2024 ఎన్నికల కోసం టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుగా వెళ్లాయి. ఆ టైంలో అనకాపల్లి ఎంపీ పోటీ కోసం నాగబాబు తెర వెనుక ప్రయత్నాలు చేసినప్పటికీ.. పొత్తు అడ్డం వచ్చింది. అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నించినా అదీ కుదరలేదు. ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఒక్కరోజు గడవకముందే.. టీటీడీ బోర్డు చైర్మన్ పదవి మెగా బ్రదర్‌కే అంటూ ఓ ప్రచారం నడిచింది. కానీ, చంద్రబాబు దాన్ని కూడా లాగేసుకున్నారు. ఆపై ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకే దక్కవచ్చనే చర్చా నడిచింది. అది జరగలేదు.
సంబంధిత వార్త: లోకేష్‌కు ఓ.. వేస్కోండి!
ఇప్పుడు కాబోయే మంత్రి నాగబాబుపై పెడుతున్న పోస్టుల వెనుక.. ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ఉన్నాడనే చర్చ మొదలైంది. ప్రతీకార చర్యలో భాగంగానే.. టీడీపీ అనుకూల సోషల్ మీడియా ద్వారా ఈ తతంగం నడిపిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల టైంలో పవన్ కోసం నారా లోకేష్‌ను పక్కనపెట్టారు చంద్రబాబు. తీరా ఎన్నికలయ్యాక లోకేష్‌ను మంత్రిని చేసినప్పటికీ.. జనసేనానితో గ్యాప్ మాత్రం అలాగే కొనసాగుతోంది.
మరోవైపు ఈ పోస్టుల ఆధారంగా.. నాగబాబుకు టీటీడీ చైర్మన్ సహా ఏ పదవీ దక్కకపోవడానికి చినబాబే కారణమై ఉంటాడని జనసేనలోనూ ఓ చర్చ నడుస్తోంది. అందుకే ఎమ్మెల్సీ కోటా మంత్రి అయిన సందర్భాన్ని లోకేష్‌కు అన్వయింపజేస్తూ కౌంటర్‌కు దిగారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంలో భాగమైనప్పటికీ కూడా.. టీడీపీ-జనసేనల మధ్య ఏళ్లుగా నడుస్తున్న సోషల్ మీడియా వార్ రాబోయే రోజుల్లో మరింత ముదిరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment