సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి గట్టి షాక్ తగిలింది. దళిత నాయకురాలు, న్యాయవాది, ఎంపీ సావిత్రి బాయి ఫూలే బీజేపీకి రాజీనామా చేశారు. సమాజంలో బీజేపీ విభజనలు సృష్టిస్తోందని ఆమె ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్‌లోని బహ్రెయిచ్ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమె బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమాజాన్ని విభజించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, దేశ బడ్జెట్‌ను విగ్రహాలను నెలకొల్పడానికే ఖర్చుచేస్తోందని విమర్శించారు. గత కొంత కాలంగా బీజేపీ తీరుపై బహిరంగంగానే విమర్శిస్తున్న ఆమె.. అంబేద్కర్ వర్దంతి రోజునే ఆ పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై కూడా ఆరోపణలు చేశారు. హనుమంతుడు దళితుడంటూ యోగి వివాదానికి తెరదీశారని ఆగ్రహించారు. హనుమంతుడు కూడా మనిషేనని.. ఆయన కోతి కాదని.. దళితుడైనందుకు అవమానాన్ని ఎదుర్కొన్నారని తన అభిప్రాయాన్ని తెలిపారు. హనుమంతుడిని మనువాదులకు బానిసగా మార్చేశారు.. రాముడి కోసం ఆయన ఎంతో చేశారన్నారు. చివరికి హనుమంతుడికి ఓ తోకను తగిలించి ముఖానికి మసిపూసి కోతిగా ఎందుకు చిత్రీకరించారు అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో లబ్ది పొందేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ యోగిపై ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment