
లక్నో: యోగి అదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఉత్తర్‌ప్రదేశ్‌లో రౌడీషీట్లరు, గ్యాంగ్‌స్టర్లు హడలిపోతున్నారు. నిర్దాక్షిణ్యంగా ఆయన నేరస్థులపై ఉక్కుపాదం మోపడమే ఇందుకు కారణం. గ్యాంగ్‌స్టర్ కం పొలిటీషియన్ అయిన అతిక్ అహ్మద్ కూడా ఇటీవలే ఓ కిడ్నాప్ కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు యోగి. ఒకప్పుడు యూపీలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి బలవంతపు వసూళ్లకు పాల్పడిన మాఫియా, గ్యాంగ్‌స్టర్లు ఇప్పుడు ప్యాంట్లు తడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వారు చేసిన నేరాలకు కోర్టుల్లో దోషులుగా తేలుతున్నారని చెప్పుకొచ్చారు.
గతంలో శాంతిభద్రతలంటే గౌరవం లేకుండా చిన్నచూపు చూసిన వారు ఇప్పుడు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెడుతున్నారని యోగి వ్యాఖ్యానించారు. శనివారం ఓ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈమేరకు మాట్లాడారు.
'ఇన్వెస్టర్లు, వారి పెట్టుబడికి ఇవాళ యూపీ ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను ఎవరూ ధిక్కరించలేరు. ప్రజలను భయపెట్టిన మాఫియానే ఇప్పుడు భయంతో వణికిపోతుంది. కోర్టులో శిక్షలు పడటం చూసి వారి ప్యాంట్లు తడిసిపోతున్నాయ్.' అని యోగి అన్నారు.
ఆరేళ్ల క్రితం యూపీ అంటే అరాచకాలు, అల్లర్లకు గుర్తింపు ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని యోగి చెప్పుకొచ్చారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో శ్రీరామ నవమి రోజు అల్లర్లు చెలరేగినా.. యూపీలో మాత్రం ప్రాశాంతంగా వేడుకలు జరిగాయని గుర్తుచేశారు.
చదవండి: దేశంలో ఎన్ని పులులు ఉన్నాయంటే..? లెక్క చెప్పిన ప్రధాని మోదీ..
Comments
Please login to add a commentAdd a comment