
సాక్షి, కోల్‌కతా : రాబోయే లోక్‌సభ ఎన్నికలకు, మహాభారతానికి మధ్య పోలికలు ఉన్నాయని బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఎన్నికలు మంచి - చెడు, ధర్మం - అన్యాయం మధ్య జరిగే యుద్ధం అంటూ పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాజీ కేంద్ర మంత్రి మాట్లాడారు.
దేశ భద్రత, శ్రేయస్సు, అందరి సాధికారత కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ యుద్ధంలో విజయం సాధిస్తారని పునరుద్ఘాటించారు. మోదీ పాండవుల మాదిరిగానే న్యాయం, నైతికత, ధర్మం కోసం పాటుపడుతుంటే ..ప్రతిపక్ష పార్టీల నేతలను ఉద్దేశిస్తూ కౌరవులు దేశ ప్రపంచ కీర్తిని మసకబారడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ప్రగతి పథంలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగించి ప్రధాని మోదీ దేశ దైవత్వాన్ని, గౌరవాన్ని కాపాడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీఎంసీలపై విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలు ఎప్పటికీ ప్రజాస్వామ్య వైభవాన్ని హైజాక్ చేయలేవని తెలిపారు.
మైనార్టీలు బీజేపీ వెంటే ఉన్నారని, అభివృద్ధి విషయంలో ప్రధాని మోడీ తమ పట్ల వివక్ష చూపనప్పుడు, బీజేపీకి ఎందుకు ఓటు వేయకూడదో ఒక్కసారి ఆలోచించాలని మాజీ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment