సాక్షి, అమరావతి: ఏజెన్సీలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గర్భిణుల వసతి గృహాల నిర్వహణపై గురువారం ఈనాడు పత్రికలో ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. వసతి గృహాలకు గర్భిణులు ప్రసవ సమయానికి 7 రోజుల ముందు చేరుకుంటారని.. వారికి రోజుకు రూ.300 ఖర్చుతో ఉచిత ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపింది.
సాలూరు పరిసర ప్రాంతాల్లోని గర్భిణుల కోసం సాలూరులో వసతి గృహం ఏర్పాటు చేశారని, ఇందులో సేవలందించేందుకు ఏఎన్‌ఎంలను నియమించారని పేర్కొంది. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గుమ్మ లక్ష్మీపురంలోనూ ఓ వసతి గృహం ఉందన్నారు. ఈ రెండింటి నిర్వహణ కోసం 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,50,500 నిధులు అందించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.3,75,000 అందించామని తెలిపింది.
రాష్ట్రంలో గర్భిణుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో జనని శిశు సురక్షా కార్యక్రమం కింద గర్భిణులకు ఉచిత వైద్య సేవలు, మందులు, వైద్య పరీక్షలు, రక్త మార్పిడి, ఆహారం, రిఫరల్, రవాణా ఖర్చుల నిమిత్తం అన్ని ప్రభుత్వ వైద్యశాలలకు రూ.29.09 కోట్లు విడుదల చేశామని తెలిపింది. దీంతోపాటు గర్భిణులకు 108 అంబులెన్స్‌లు, వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ద్వారా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment