ఏది నిజం?: అసలే డ్రామోజీ.. చేతిలో ‘ఛీ’నాడు | Eenadu Ramoji Rao Fake Allegations Over Govt Hospitals | Sakshi
Sakshi News home page

ఏది నిజం?: అసలే డ్రామోజీ.. చేతిలో ‘ఛీ’నాడు

Published Sat, Jun 17 2023 6:53 AM | Last Updated on Sat, Jun 17 2023 4:04 PM

Eenadu Ramoji Rao Fake Allegations Over Govt Hospitals - Sakshi

మచిలీపట్నం బోధనాస్పత్రి

సాక్షి, అమరావతి: సూర్యుడిపై ఉమ్మేస్తే తన ముఖంపైనే పడుతుందన్న ఇంగితాన్ని కూడా ‘ఛీనాడు’ పట్టించుకోవడం మానేసింది! ఆ ముఖం తడుస్తున్నా సరే.. తుడుచుకునేందుకు కూడా అది సిద్ధపడటం లేదు!! నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు.. నా ఇచ్ఛయేగాక నాకేటి వెరపు అన్నట్లుగా వలువలు వదిలేసి కోలాటమాడుతోంది! డ్రామోజీ సమర్పిస్తున్న దగుల్బాజీ కథనాల్లో తాజాగా రాష్ట్ర ఆరోగ్య రంగం కూడా చేరింది!! వైద్య ఆరోగ్యశాఖలో దాదాపు 49,000 పోస్టులను భర్తీ చేయకుండా ఖాళీగా వదిలేసిందంటే ప్రజారోగ్యంపై చంద్రబాబు సర్కారు ఎంత బరి తెగించి వ్యవహరించిందో ఈనాడుకు కనపడలేదా?

ఆరోగ్యశ్రీని నీరుగార్చి దాదాపు రూ.700 కోట్ల మేర బకాయిలు పెట్టిన చంద్రబాబు నిర్వాకాలపై రామోజీ కలం కదలలేదు ఎందుకు? ఒకే ఏడాది ఐదు కొత్త మెడికల్‌ కాలేజీలు.. మూడేళ్లలో మొత్తం 17 వైద్య కళాశాలలు ఆవిష్కృతమవుతుండటం.. వైద్య ఆరోగ్యశాఖలో 49,000 పోస్టుల భర్తీ.. రూ.17,000 కోట్ల వ్యయంతో ఆరోగ్య రంగానికి జవసత్వాలు కల్పిస్తున్న పరిస్థితి ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో సైతం గతంలో ఎప్పుడూ లేదు. రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి భరోసా ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వమూ ఆంధ్రప్రదేశ్‌ మినహా మరొకటి లేదు! కోవిడ్‌ మహమ్మారినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి ఉచితంగా లక్షల మందికి చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే. తాజాగా ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ద్వారా పల్లె ముంగిటకే డాక్టర్లను పంపుతున్న రాష్ట్రం కూడా మనదే.

ఉన్నఫళంగా రాత్రికి రాత్రే రావటానికి మెడికల్‌ కాలేజీలేమీ రోడ్డు పక్కన కిళ్లీ షాపులు కాదు! ఓ కొత్త వైద్య కళాశాల ఏర్పాటు కావాలంటే కచ్చితంగా కొన్ని నిబంధనలు అనుసరించాలి. కనీసం 330 పడకల సదుపాయంతో ఆసుపత్రులు రెండేళ్ల పాటు సేవలందించాలి. పక్క రాష్ట్రానికి కొత్త మెడికల్‌ కాలేజీలు వచ్చాయంటూ రామోజీ గుండెలు బాదుకుంటున్నారు. మరి అక్కడ పదేళ్లుగా ఒకే ప్రభుత్వం అధికారంలో ఉందన్న విషయం గుర్తులేదా? అది కూడా అక్కడి ప్రభుత్వం మొదటి ఐదేళ్లు ఎంతో కృషి చేయడంతో రెండో విడతలో ఇప్పుడు 17 కొత్త మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. మన రాష్ట్రంలో ఆరోగ్య రంగం నిస్తేజంగా మారటానికి గత సర్కారు నిర్వాకాలే కారణమన్న సంగతి తెలిసీ రామోజీ బురద చల్లే యత్నం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఒకేసారి వేల సంఖ్యలో పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వాస్పత్రుల్లో నాడు–నేడు ద్వారా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. మూడేళ్లలో 17 కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో ఐదు కొత్త మెడికల్‌ కాలేజీల్లో ఈ ఏడాదే ప్రవేశాలు కల్పించనున్నారు. ఇవన్నీ సహించలేక ఈనాడు అయోమయం కథనాలను తన పాఠకులకు వడ్డించింది! 

తెలంగాణలో  ఎలా అంటే?
తెలంగాణ ప్రభుత్వం 2014–19 మధ్య నాలుగు కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడంతోపాటు భవిష్యత్తులో మరిన్ని కళాశాలల ఏర్పాటుకు వీలుగా 25 సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ పడకల సంఖ్యను పెంచింది. 2018లోగా ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసింది. అప్పట్లో తీసుకున్న చర్యలు 17 కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు వచ్చేందుకు దోహదపడ్డాయి. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న నారా చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేయడంతోపాటు కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటు దిశగా కనీసం ప్రయత్నించలేదు. కనీసం తెలంగాణను చూసైనా ఆస్పత్రుల్లో పడకలు పెంచిన పాపాన పోలేదు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగి కూడా రాష్ట్ర ప్రయోజనాలను నీరుగార్చారు. నాడు బీజేపీకే చెందిన కామినేని శ్రీనివాసరావు రాష్ట్ర వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ వైద్య రంగాన్ని పట్టించుకోకుండా ప్రైవేట్‌ వైద్య కళాశాలలను ప్రోత్సహిస్తూ వైద్య విద్యను వ్యాపారంగా మార్చేశారు.

సమర్థతతో సాధించిన   సీఎం జగన్‌
అధికారంలోకి వచ్చాక ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని 2019 ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మేరకు మాట నెరవేరుస్తూ 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తొలుత ఐదు జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడం ద్వారా రాజమహేంద్రవరం, ఏలూరు, విజయనగరం, నంద్యాల, మచిలీపట్నం వైద్య కళాశాలలకు అనుమతులను రాబట్టారు. దీంతో ఈ ఏడాది 750 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తున్నాయి. వచ్చే ఏడాది పాడేరు, పులివెందుల, ఆదోనిలో కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు వీలుగా అక్కడి ఆస్పత్రుల్లో పడకలు పెంచేలా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో 2024–25లో మరో మూడు కొత్త వైద్య కళాశాలలు, ఆ తర్వాత ఏడాది మిగిలిన 9 వైద్య కళాశాలలను అందుబాటులోకి తెచ్చేలా సన్నద్ధమయ్యారు. తద్వారా మూడేళ్లలో 17 కొత్త మెడికల్‌ కాలేజీలు మన రాష్ట్రంలోనూ ఏర్పాటు కానున్నాయి. 

వైద్య రంగం అభివృద్ధికి సాక్ష్యాలివిగో
వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేయడం ద్వారా ప్రజారోగ్యానికి సీఎం జగన్‌ రక్షణగా నిలిచారు. గత నాలుగేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పథకాల కోసం ప్రభుత్వం రూ.8,302.47 కోట్లు వెచ్చించింది. ఆరోగ్యశ్రీ ద్వారా 36,19,741 మంది, ఆసరా ద్వారా 16,20,584 మంది లబ్ధి పొందారు. రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలని్నంటినీ పథకం పరిధిలోకి తేవడంతో 1.4 కోట్లకు పైగా కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది. 2014–19 మధ్య ఆరోగ్యశ్రీలో కేవలం 1,059 ప్రొసీజర్లు మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు ఏకంగా 3,255కి పెరిగాయి. ఆరోగ్య ఆసరా ద్వారా శస్త్ర చికిత్స అనంతరం రోగి కోలుకునే సమయంలో గరిష్టంగా రూ.ఐదు వేల వరకు ప్రభుత్వం సాయం అందిస్తోంది.  

►సీఎం జగన్‌ అధికారంలోకి రాగానే మండలానికి ఒకటి చొప్పున 104, 108 వాహనాలను సమకూర్చారు. 768 అంబులెన్స్‌లతో 2020లో సేవలను విస్తరించారు. తాజాగా మరో 146 అంబులెన్స్‌లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం రోజుకు సగటున 3,300 మంది అంబులెన్స్‌ సేవలను వినియోగించుకుంటున్నారు. 104 ఎంఎంయూలను తొలుత మండలానికి ఒకటి చొప్పున 676 వాహనాలను సమకూర్చారు. ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలులోకి రావడంతో 104 ఎంఎంయూలు మరో 256 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. 
►గతేడాది ఏప్రిల్‌ నుంచి 500 కొత్త వాహనాలతో ‘డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ సేవలను విస్తరించారు. రోజుకు సగటున 631 మంది బాలింతలను క్షేమంగా ఇళ్లకు చేరుస్తున్నారు.  
►గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్‌ వి«ధానాన్ని ప్రవేశపెట్టారు. పీహెచ్‌సీ వైద్యులు నెలకు రెండుసార్లు 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌(ఎంఎంయూ)తో పాటు గ్రామాలను సందర్శించి అక్కడే వైద్య సేవలు
అందిస్తున్నారు. 

పీజీ సీట్లు పెరిగాయ్‌..
కొత్త మెడికల్‌ కాలేజీలకు అనుమతులు సాధించడంతోపాటు ప్రస్తుతం ఉన్న 11 వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు పెరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్‌ ప్రొఫెసర్లను సమకూర్చేందుకు ఖాళీల భర్తీతో పాటు కొత్తగా పోస్టులను సృష్టించి నియామకాలు చేపట్టింది. ఇతర మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు. దీంతో 2019 వరకూ 937 మాత్రమే పీజీ సీట్లు ఉండగా గత  నాలుగేళ్లలో ఏకంగా 768 సీట్లను రాబట్టగలిగారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు 1705కి పెరిగాయి. పీజీ సీట్లను మరింత పెంచడం ద్వారా రాష్ట్రంలో స్పెషలిస్ట్‌ వైద్యులను అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతోంది.

వైద్యరంగంలో ఆదర్శంగా ఏపీ
చంద్రబాబు అసమర్థతతో వైద్య రంగంలో రాష్ట్రం వెనుకబాటుకు గురైంది. ఆయన అధికారంలో ఉండగా ఆరోగ్య రంగాన్ని నీరుగార్చారు. ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి జగన్‌ తీసుకుంటున్న చర్యలతో వైద్య రంగంలో ఏపీ రోల్‌ మోడల్‌గా ఆవిష్కృతం అవుతోంది. తెలంగాణలో తొమ్మిదేళ్లలో 17 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు ఏర్పాటయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం తొలి ఐదేళ్లలో కనీసం ఒక్కటంటే ఒక్క వైద్య కళాశాల తీసుకురాలేకపోయిన విషయాన్ని ఈనాడు ఎందుకు విస్మరించింది? ఏపీలో ఒకేసారి 5 కొత్త మెడికల్‌ కాలేజీలు ఈ ఏడాదే అందుబాటులోకి వస్తున్నాయి. మిగిలినవి రెండేళ్లలో ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా సీఎం జగన్‌ చర్యలు చేపట్టారు. ఇప్పుడు విమర్శలు చేస్తున్న రామోజీరావుకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వైద్య రంగానికి ఏం చేశారో రాసే ధైర్యముందా?   

 – విడదల రజని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

చదవండి: Fact Check: అర్హులకు పరిహారం జమచేస్తే నిందలా?.. ‘ఈనాడు’ వంకర రాతలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement