అభివృద్ధికి ఒప్పిస్తే ఏడుపెందుకు?! | Tdp Party Fake Allegations On Cinema Tickets Issue Kommineni Srinivasa Rao | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి ఒప్పిస్తే ఏడుపెందుకు?!

Published Wed, Feb 16 2022 12:42 AM | Last Updated on Wed, Feb 16 2022 4:06 AM

Tdp Party Fake Allegations On Cinema Tickets Issue Kommineni Srinivasa Rao - Sakshi

సినీ ప్రముఖులంతా జగన్‌ను అభినందించి, సమస్య పరిష్కారం అయిందని సంతోషం వ్యక్తం చేస్తుంటే... తెలుగుదేశం అనుకూల మీడియా మాత్రం అదెలా కుదురుతుందని రోదిస్తోంది! జగన్‌ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అన్నిటికీ ఏడుస్తుంటే ఎవరు పట్టించుకుంటారు? నిజానికి గత చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో సరైన చొరవ తీసుకుని ఉంటే ఈపాటికే ఎంతో కొంత చిత్ర పరిశ్రమ ఏపీకి వచ్చి ఉండేది. చంద్రబాబుకు సినీ ప్రముఖులతో బాగా సంబంధాలు ఉన్నాయి. వాటిని ఆయన ఏపీ కోసం కాకుండా తన రాజకీయ ప్రయోజనాలకే పరిమితం చేశారు. అందుకు భిన్నంగా జగన్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించి, ఏపీలో కూడా సినీ పరిశ్రమ అభివృద్ధికి సినీ పెద్దల్ని ఒప్పించారు.

ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందే రోజులు వస్తున్నట్లే ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయిన సందర్భంగా జరిగిన చర్చలను గమనిస్తే అలాంటి ఆశా భావం కలుగుతోంది. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవి చూపిన చొరవ, ఆయనకు ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రాధాన్యం అభినందనీయం అని చెప్పాలి. ఇతర సినీ ప్రముఖులు మహేశ్‌బాబు, ప్రభాస్, రాజ మౌళి, పోసాని కృష్ణమురళి, ఆర్‌.నారాయణమూర్తి, అలీ తదితరులు కలిసి జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రశంసించారు. ‘ఇది సంతోషకరమైన రోజు’ అని కూడా వారు వ్యాఖ్యానించారు. 

కొద్దినెలలుగా సినీ పరిశ్రమలోని కొంతమందికీ, ఏపీ ప్రభుత్వానికీ మధ్య వివాదం జరుగుతోంది. సినిమా టికెట్ల ధరలను సామాన్య ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ రేట్లు తమకు గిట్టుబాటు కావని సినీ ప్రముఖులు వాదిస్తూ వచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన ఒక జీవోపై నటులు నాని, పవన్‌ కల్యాణ్‌ వంటివారు విమర్శనాత్మకంగా స్పందించారు. వారు ప్రభుత్వానికి విషయం తెలియజేసేవిధంగా కాకుండా, ప్రభుత్వాన్ని తీవ్రంగా నిందించే విధంగా మాట్లాడారు. దాంతో ఈ సమస్య మరింత జటిలమైంది. కిరాణా షాపుతో థియేటర్లను పోల్చారు నాని! పవన్‌ కల్యాణ్‌ అయితే తనను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ధరలు నిర్ణయించిందన్నట్లు భావించి, అవసరమైతే తాను ఉచితంగా సినిమాలను ప్రదర్శిస్తానని అన్నారు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే– పవన్‌ సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ నటుడు అయిన చిరంజీవి... ముఖ్య మంత్రి జగన్‌తో సత్సంబంధాలను నెరపుతూ, సినీ పరిశ్రమ సమస్య లను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటే, పవన్‌ మాత్రం రాజకీయం గానే వ్యవహరిస్తుండటం! దానివల్ల పరిశ్రమకు ఏ మాత్రం ప్రయోజనం లేని పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో సినిమా హీరోల రెమ్యునరేషన్‌ల అంశం కూడా తెరపైకి వచ్చింది. కొందరు హీరోలు నలభై నుంచి వంద కోట్ల వరకు తీసుకుంటున్నారని, వారు తమ ప్రతిఫలాన్ని తగ్గించుకోకుండా టిక్కెట్ల ధర పేరుతో ప్రజలపై భారం మోపడం ఏమిటన్న ప్రశ్న కూడా తలెత్తింది. అందువల్లే ఏపీ ప్రభుత్వానికి ఈ విషయంలో సానుకూలత ఏర్పడింది. దీనిని గమ నించే సినీ పెద్దలు కూడా ప్రభుత్వంతో తగాదా రూపంలో కాకుండా రాజీ ధోరణిలో వ్యవహరించారని చెప్పవచ్చు. 

ఈ సందర్భంలోనే ఏపీలో పరిశ్రమ అభివృద్ధిపై జగన్‌ దృష్టి కేంద్రీకరించారు. విశాఖపట్నం సినీ పరిశ్రమకు అనువైన ప్రదేశమనీ, అక్కడకు అంతా రావాలనీ ఆయన ఆహ్వానించారు. ఇళ్ల స్థలాలు ఇస్తామనీ, స్టూడియోల నిర్మాణానికి భూమి ఇస్తామనీ కూడా ఆయన ఆఫర్‌ ఇచ్చారు. అలాగే ఇరవై శాతం షూటింగులు ఏపీలో తీయాలని కూడా సీఎం కోరారు. కచ్చితంగా ఇది అవసరం కూడా! ఎక్కువ జనాభా, ఎక్కువ థియేటర్లు, ఎక్కువ ఆదాయం వచ్చే ప్రాంతాన్ని సినీ పరిశ్రమ విస్మరించడం సరికాదు. నిజానికి గత చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో సరైన చొరవ తీసుకుని ఉంటే ఈపాటికే ఎంతో కొంత చిత్ర పరిశ్రమ ఏపీకి వచ్చి ఉండేది. చంద్రబాబుకు సినీ ప్రముఖులతో బాగా సంబంధాలు ఉన్నాయి. వాటిని ఆయన ఏపీ కోసం కాకుండా తన రాజకీయ ప్రయోజనాలకే పరిమితం చేశారు. అందుకు భిన్నంగా జగన్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించి, ఏపీలో కూడా సినీ పరిశ్రమ అభివృద్ధికి సినీ పెద్దల్ని ఒప్పించారు.

ఏపీలో అనేక ప్రాంతాలలో టూరిస్టు ప్రదేశాలు ఉన్నాయి. సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. అయినా సాంకేతిక నిపుణులు, ఇతర సహాయ సిబ్బంది అంతా హైదరాబాద్‌లోనే ఉండటంతో వారు ఆశించిన మేర షూటింగ్‌లను ఏపీలో చేయడం లేదు. సినీ పరిశ్రమ హైదరాబాద్‌లోనే కేంద్రీకృతం కావడంతో ఏపీలోని కళాకారులకు కూడా అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. అదే ఏపీలోనే పరిశ్ర మకు అవసరమైన మౌలిక వసతులు సమకూర్చుకుంటే అలాంటి సమస్యలకు ఆస్కారం ఉండదు. పైగా ఆంధ్రా సంస్కృతిని, సాహి త్యాన్ని, ప్రాంత ఉనికిని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. 

టికెట్ల ధరలు, ఆన్‌లైన్‌ విధానం వంటి విషయాలలో ప్రభుత్వా నికీ, సినీ పెద్దలకూ ఒక అవగాహన కుదరడం కూడా మంచి పరి ణామమే. ఆన్‌లైన్‌ విధానానికి పలువురు సినీ ప్రముఖులు మద్దతు ఇచ్చారు. అలాగే పెద్ద సినిమాలతో పాటు, చిన్న సినిమాలకు కూడా నష్టం జరగకుండా చూడాలని ఆర్‌. నారాయణ మూర్తి కోరారు. చిన్న సినిమాలకు «థియేటర్లు దొరకడం లేదని పోసాని చెప్పారు. థియేటర్లు అన్నీ నలుగురైదుగురి చేతిలోనే ఉండటంతో ఈ సమస్య వస్తోంది. దీనికి ప్రభుత్వపరంగా ఎలాంటి పరిష్కారం లభిస్తుందో చెప్పలేం. సినీ పరిశ్రమ ప్రముఖులే థియేటర్లను కంట్రోల్‌ చేస్తున్న వారితో చర్చలు జరిపి ఒక ఒప్పందానికి రావడం మంచిదనిపిస్తుంది. మరో ముఖ్యాంశం ఏమిటంటే వంద కోట్లు మించి బడ్జెట్‌ ఉన్న సినిమాలను ప్రత్యేకంగా పరిగణించి, వాటికి టిక్కెట్ల ధరలను విడిగా నిర్ణయించ డానికి ప్రభుత్వం ఓకే చేయడం. సానుకూల స్పందన ఇది. 

కాగా సినీ ప్రముఖులంతా జగన్‌ను అభినందించి, సమస్య పరిష్కారం అయిందని సంతోషం వ్యక్తం చేస్తే, తెలుగుదేశం అను కూల మీడియా మాత్రం అదెలా కుదురుతుందని రోదిస్తోంది. జగన్‌ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అన్నిటికీ ఏడుస్తుంటే ఎవరు పట్టించుకుంటారు? నిర్ణయాలలో ఏవైనా లోపాలు ఉంటే వార్తలు ఇవ్వడం తప్పు కాదు. కానీ పనిగట్టుకుని వ్యతిరేకించడం ద్వారా వారికే నష్టం జరుగుతుందని చెప్పక తప్పదు. ఇక స్టార్‌ నటుడు చిరం జీవికి ముఖ్యమంత్రి జగన్‌తో సత్సంబంధాలు ఉండటం, ఆయన తరచుగా జగన్‌ను కలవడం కూడా టీడీపీ వర్గాలకూ, టీడీపీ మీడియాకూ జీర్ణం కావడం లేదు. దాంతో చిరంజీవి సహా జగన్‌ను కలిసిన వారందరిపై బురద జల్లే ప్రయత్నంలో పడ్డారు. అందులో చంద్రబాబు కూడా చేరారు. ‘చిరంజీవి ముఖ్యమంత్రి వద్ద ప్రాథేయ పడతారా!’ అని ప్రశ్నించారు. సినీ నటులను జగన్‌ అవమానించారని దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టారు. 

ఇదంతా చిల్లర రాజకీయంగా కనిపిస్తోంది. చిరంజీవి వల్ల జగన్‌కు రాజకీయ ప్రయోజనం కలుగుతుందేమోనన్నది వారి బాధ కావచ్చు. చిరంజీవి ఏదో పదవి ఆశించి జగన్‌ను కలుస్తున్నారని ప్రచారం చేశారు. కానీ ఆయన కొట్టిపారేసి, తాను ఎలాంటి పదవీ ఆశించడం లేదని స్పష్టం చేశారు. చిరంజీవి ఒక పెద్ద మనిషి తరహాలో వ్యవహరించిన తీరు ప్రశంసనీయం. మరి ఆయన సోద రుడు పవన్‌ కల్యాణ్‌ మాత్రం అనేక అంశాలలో చపలచిత్తంగా ఉంటు న్నారు. ఆయన ఎంతసేపూ రాజకీయంగా ఆలోచిస్తున్నారు తప్ప,  ఏది సరైన మార్గం అనేది ఎంపిక చేసుకోలేకపోతున్నారు. సినిమాకూ, రాజకీయాలకూ ముడిపెట్టి విమర్శలు చేస్తున్నారే గానీ, సినీ పరిశ్రమ మంచికి యత్నించినట్లు కనిపించదు.

ఏది ఏమైనా సినీ పరిశ్రమతో ప్రభుత్వానికి వివాదం ఏర్పడటం కూడా మంచిది కాదు. అందుకే ప్రభుత్వం కూడా సామరస్య ధోరణిలో సినీ పరిశ్రమ సమస్యలను పరిశీలించి పరిష్కరించడం, అదే సమయంలో ఈ పరిశ్రమ ఏపీలో కూడా వచ్చేలా చర్యలు చేపట్టడం, తద్వారా ఏపీకి ఎంతో కొంత ప్రయోజనం చేకూరేలా చూసేందుకు ప్రయత్నించడం శుభ పరిణామం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కోరుకున్నట్లు చిత్ర పరి శ్రమలో కొంత భాగం ఏపీకి తరలివస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లే అవుతుంది. అది తేలికైన విషయం కాకపోయినప్పటికీ, ముఖ్యమంత్రి జగన్‌ చేస్తున్న యత్నాలకు అంతా మద్దతు ఇవ్వాలి. మహేశ్‌బాబు ‘ఇది మంచి రోజు’ అన్నట్లుగానే ఏపీ ప్రజలకు సైతం మంచి జరిగేలా పరిశ్రమ కూడా నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిద్దాం.

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు      

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement