Minority Gurukul
-
‘గురి’తప్పిన గురుకులాలు!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపటం లేదు. ఈ పాఠశాలల ప్రారంభ సమయంలో ఒక్కో సీటుకోసం కనీసం నలుగురు విద్యార్థులు పోడిపడగా, ఇప్పుడు ఇద్దరు కూడా పోటీలో లేకపోవడం గమనార్హం. ఇటీవల గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు అధికం కావటం, వసతుల లేమి కారణంగా వాటిల్లో చేరేందుకు విద్యార్థులు, చేర్పించేందుకు వారి తల్లిదండ్రులు ఆసక్తి చూప టం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల సొసైటీల పరిధిలోని పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ గతేడాది డిసెంబర్లో విడుదల కాగా, గడువు ముగిసేనాటికి దాదాపు 80 వేల మందే దరఖాస్తు చేసుకున్నారు. సీట్లు 51 వేలు.. దరఖాస్తులు 80 వేలు రాష్ట్రంలో ఐదు గురుకుల సొసైటీలున్నాయి. ఇందులో నాలుగు సొసైటీలు సంక్షేమ శాఖలకు అనుబంధంగా కొనసాగుతుండగా.. జనరల్ సొసైటీ పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉంది. ప్రస్తుతం టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గురు కుల విద్యాసంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్)లు ఐదోతరగతికి ఉమ్మడిగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నాయి. మైనార్టీ గురుకుల సొసైటీ మాత్రం ప్రత్యేకంగా సెట్ నిర్వహించి ప్రవేశాలు చేపడుతోంది. మైనార్టీ సొసైటీలోని పాఠశాలలు మినహా మిగిలిన నాలుగు సొసైటీల్లోని 643 పాఠశాలల్లో ఐదోతరగతిలో 51,924 సీట్లు ఉన్నా యి. వీటిలో ఐదోతరగతి ప్రవేశాలకు గతేడాది డిసెంబర్ 21 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 80 వేలలోపే దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాదితో పోల్చితే ఇవి దాదాపు 40 వేలు తక్కువ. ఈ నెల 23వ తేదీన అర్హత పరీక్ష నిర్వహించేందుకు ఎస్సీ గురుకుల సొసైటీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం నమోదైన దరఖాస్తుల ప్రకారం ఒక్క సీటు కోసం సగటున 1.6 మంది పోటీ పడుతున్నారు. గురుకుల పాఠశాల ప్రవేశం కోసం గతంలో విపరీతమైన డిమాండ్ ఉండేది. ఒక్కో సీటు కోసం సగటున నలుగురు విద్యార్థులు పోటీపడేవారు. గత ఏడాది కాలంగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు భారీగా పెరగటమే డిమాండ్ తగ్గటానికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
మైనార్టీ గురుకుల కాలేజీల్లో 960 సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన మైనార్టీ గురుకుల జూనియర్ కాలేజీల్లో 2018–19కి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం తెలంగాణ రాష్ట్ర మైనార్టీ గురుకులాల విద్యా సంస్థల సొసైటీ (టెమ్రీస్) చర్యలు చేపట్టింది. 12 జూనియర్ కళాశాల్లో ఇంటర్ ఫస్టియర్లో 960 సీట్లను భర్తీ చేయనుంది. 11 గురుకులాల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు ఏర్పాటు చేస్తోంది, నిజామాబాద్లో సీఈసీ, ఎంఈసీ గ్రూపులు మాత్రమే ఏర్పాటు చేస్తోంది. ప్రతి సెక్షన్లో 40 చొప్పున ఎంపీసీలో 440, బైపీసీలో 440 సీట్లు భర్తీ చేయనుంది. సీఈసీలో 40, ఎంఈసీలో 40 సీట్లు భర్తీ చేసేలా ప్రణాళిక రూపొందించింది. 12 మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో బాలికలకు మూడింటిని ప్రత్యేకంగా కేటాయించింది. రంగారెడ్డి జిల్లాలోని హయత్నగర్(బాలుర), ఇబ్రహీంపట్నం(బాలికల), నిజామాబాద్(బాలుర), కామారెడ్డి(బాలుర), నల్లగొండ జీవీగూడెం(బాలుర), నల్లగొండ(బాలికల), వరంగల్ రంగసాయిపేట(బాలుర), మహబూబ్నగర్(బాలుర), వనపర్తి (బాలుర), హైదరాబాద్ బార్కాస్(బాలుర), సంగారెడ్డి(బాలుర), జహీరాబాద్(బాలుర) జూనియర్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం శనివారం నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ నెల 5 నుంచి 15 వరకు ఆన్లైన్లో అడ్మిషన్ కోసం ఎలాంటి రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. 16 నుంచి 20 వరకు పదో తరగతిలో వచ్చిన గ్రేడ్ల ఆధారంగా విద్యార్థుల ఎంపిక, 21న ఎంపికైన వారి జాబితా విడుదల, 22 నుంచి 25 వరకు ఎంపికైన విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభించేలా టెమ్రీస్ చర్యలు చేపట్టింది. మొత్తం సీట్లలో 75% సీట్లు మైనారిటీలకు, 25% మైనార్టీయేతరులకు కేటాయిస్తారు. -
కొత్తగా పది మైనారిటీ గురుకుల కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం కొత్తగా 10 మైనారిటీ గురుకుల జూనియర్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు మైనారిటీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ సన్నాహాలు ప్రారంభించింది. ఈ సొసైటీ కింద 204 గురుకుల పాఠశాలలు, 2 జూనియర్ కాలేజీలు కొనసాగుతున్నాయి. కొత్త గురుకుల పాఠశాలల్లో 5 నుంచి తొమ్మిదో తరగతి వరకు, పాత 12 గురుకులాల్లో పదో తరగతి వరకు విద్యాబోధన కొనసాగుతోంది. పాత జూనియర్ కాలేజీలు 2 ఉన్నా యి. దీంతో కొత్తగా 10 జూనియర్ కాలేజీల ఏర్పాటు కు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో కాలేజీల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పాత పది గురుకుల పాఠశాలల భవనాల్లోనే కాలేజీల విభాగాలు ఏర్పాటు చేయాలని సొసైటీ నిర్ణయించింది. అధ్యాపకుల భర్తీకి కసరత్తు..: కొత్త మైనారిటీ గురుకుల జూనియర్ కాలేజీల్లో అధ్యాపకులను భర్తీ చేసేందుకు మైనారిటీ గురుకుల సొసైటీ కసరత్తు చేస్తోంది. పది కాలేజీలకు బోధనావిభాగంలో 80 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. కాలేజీలకు టీఎస్పీఎస్సీ నుంచి అధ్యాపకులు భర్తీ అయ్యేవరకు ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా రెండు రోజులక్రితం ఆ సొసైటీ కార్యదర్శి ఔట్సోర్సింగ్ ఏజెన్సీలతో సమావేశమయ్యారు. ఏజెన్సీల ద్వారా అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 30 వరకు ఒక పోస్టుకు ముగ్గురు చొప్పున దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు. సబ్జెక్టులవారీగా మే 5 నుంచి 10 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి మే 12న ఎంపిక జాబితా వెల్లడించనున్నారు. ఎంపికైన జూనియర్ లెక్చరర్లకు మే 13న నియామకపత్రాలు అందించి 15 నుంచి 25 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. జూన్ 1 నుంచి విధులకు హాజరయ్యేవిధంగా కార్యాచరణ రూపొందించారు. 27 తర్వాత అడ్మిషన్ నోటిఫికేషన్ మైనారిటీ గురుకుల జూనియర్ కాలేజీలో ఇంటర్ తొలి ఏడాదిలో ప్రవేశాలకు ఈ నెల 27 తర్వాత నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. మైనారిటీ గురుకులాల్లో చదివిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత వర్తింపజేస్తారు. గురుకుల పాఠశాలల మాదిరిగానే 75 శాతం సీట్లు మైనారిటీలకు, 25 శాతం మైనార్టీయేతరులకు కేటాయించనున్నారు. -
జిల్లాకో మైనార్టీ గురుకులం, వసతి గృహం
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒకటి చొప్పున 10 మైనార్టీ గురుకుల పాఠశాలలు, 10 పోస్టు మెట్రిక్ వసతి గృహాలు మంజూరు చేసినట్లు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మైనార్టీ విద్యార్థుల విదేశీ చదువు కోసం ఓవర్సీస్ స్టడీ స్కీం కింద రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉపకార వేతనం అందించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఈ పథకం కింద ఇప్పటికే రూ.25 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఉర్దూను మొదటి భాషగా తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతించిందని గుర్తు చేశారు. మైనార్టీ విద్యార్థులు, నిరుద్యోగుల కోసం కెరీర్ కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముస్లిం కుటుంబాల కోసం మ్యారేజ్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పాతబస్తీలోని చిరు వ్యాపారులకు స్వల్ప కాలిక రుణాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.