కొత్తగా పది మైనారిటీ గురుకుల కాలేజీలు | Ten Minority Grievance Colleges as newly | Sakshi
Sakshi News home page

కొత్తగా పది మైనారిటీ గురుకుల కాలేజీలు

Published Thu, Apr 26 2018 1:14 AM | Last Updated on Thu, Apr 26 2018 1:14 AM

Ten Minority Grievance Colleges as newly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ విద్యాసంవత్సరం కొత్తగా 10 మైనారిటీ గురుకుల జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు మైనారిటీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ సన్నాహాలు ప్రారంభించింది. ఈ సొసైటీ కింద 204 గురుకుల పాఠశాలలు, 2 జూనియర్‌ కాలేజీలు కొనసాగుతున్నాయి. కొత్త గురుకుల పాఠశాలల్లో 5 నుంచి తొమ్మిదో తరగతి వరకు, పాత 12 గురుకులాల్లో పదో తరగతి వరకు విద్యాబోధన కొనసాగుతోంది. పాత జూనియర్‌ కాలేజీలు 2 ఉన్నా యి. దీంతో కొత్తగా 10 జూనియర్‌ కాలేజీల ఏర్పాటు కు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో కాలేజీల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పాత పది గురుకుల పాఠశాలల భవనాల్లోనే కాలేజీల విభాగాలు ఏర్పాటు చేయాలని సొసైటీ నిర్ణయించింది.  

అధ్యాపకుల భర్తీకి కసరత్తు..: కొత్త మైనారిటీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో అధ్యాపకులను భర్తీ చేసేందుకు మైనారిటీ గురుకుల సొసైటీ కసరత్తు చేస్తోంది. పది కాలేజీలకు బోధనావిభాగంలో 80 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. కాలేజీలకు టీఎస్‌పీఎస్‌సీ నుంచి అధ్యాపకులు భర్తీ అయ్యేవరకు ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా రెండు రోజులక్రితం ఆ సొసైటీ కార్యదర్శి ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలతో సమావేశమయ్యారు. ఏజెన్సీల ద్వారా అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 30 వరకు ఒక పోస్టుకు ముగ్గురు చొప్పున దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు. సబ్జెక్టులవారీగా మే 5 నుంచి 10 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి మే 12న ఎంపిక జాబితా వెల్లడించనున్నారు. ఎంపికైన జూనియర్‌ లెక్చరర్లకు మే 13న నియామకపత్రాలు అందించి 15 నుంచి 25 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. జూన్‌ 1 నుంచి విధులకు హాజరయ్యేవిధంగా కార్యాచరణ రూపొందించారు.  

27 తర్వాత అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ 
మైనారిటీ గురుకుల జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ తొలి ఏడాదిలో ప్రవేశాలకు ఈ నెల 27 తర్వాత నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. మైనారిటీ గురుకులాల్లో చదివిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత వర్తింపజేస్తారు. గురుకుల పాఠశాలల మాదిరిగానే 75 శాతం సీట్లు మైనారిటీలకు, 25 శాతం మైనార్టీయేతరులకు కేటాయించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement