ఇక గురుకుల జూనియర్‌ కాలేజీలు | Gurukula Schools In Telangana Will Become Junior Colleges | Sakshi
Sakshi News home page

ఇక గురుకుల జూనియర్‌ కాలేజీలు

Published Thu, Mar 12 2020 2:20 AM | Last Updated on Thu, Mar 12 2020 2:21 AM

Gurukula Schools In Telangana Will Become Junior Colleges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేజీ టు పీజీ మిషన్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ గురుకుల పాఠశాలలు కొత్త రూపును సంతరించుకోనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్తగా ప్రారంభించిన గురుకుల పాఠశాలలు ఇప్పటివరకు పదో తరగతికే పరిమితం కాగా.. వాటిల్లో కొత్తగా జూనియర్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు ఆయా సొసైటీలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించగా సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో విడతల వారీగా మంజూరైన గురుకుల పాఠశాలలను ప్రాధాన్యత ఇంటర్మీడియట్‌ వరకు అప్‌గ్రేడ్‌ చేస్తారు. ఈ మేరకు సంక్షేమ గురుకుల సొసైటీలు కసరత్తు చేస్తున్నాయి.

ఒక్కో తరగతి పెరుగుతూ.. 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్‌ గురుకుల సొసైటీల పరిధిలో 959 విద్యా సంస్థలున్నాయి. ఇందులో 54 గురుకుల డిగ్రీ కాలేజీలు కాగా.. మిగతావి పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 54 గురుకుల డిగ్రీ కాలేజీలతో పాటు 585 గురుకుల పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. 2015–16 విద్యా సంవత్సరం నుంచి విడతల వారీగా గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ప్రారంభ దశలో గురుకుల పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ... వీటిలో 5 ,6, 7 తరగతులకు మాత్రమే ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలా తొలి ఏడాది మూడు తరగతులతో ప్రారంభమైన గురుకుల పాఠశాలల్లో ప్రతి సంవత్సరం ఒక తరగతి పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో పదో తగతికి చేరిన గురుకుల పాఠశాలల్లో ఇప్పుడు ఇంటర్మీడియట్‌ కోర్సులను ప్రారంభించనున్నారు. 

71 మైనార్టీ జూనియర్‌ కాలేజీలు 
వచ్చే విద్యా సంవత్సరంలో మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో కొత్తగా 71 గురుకుల పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి. ఈ పాఠశాలల్లో ప్రస్తుతం పదో తరగతి బ్యాచ్‌ వార్షిక పరీక్షలకు సిద్ధమవుతోంది. అదేవిధంగా 2021–22 విద్యా సంవత్సరంలో బీసీ గురుకుల సొసైటీ పరిధిలో 119, మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలో 80, గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో 50 జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. వీటితో పాటుగా సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలో మరో వంద జూనియర్‌ కాలేజీల ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మొత్తంగా గురుకుల విద్యా సంస్థల్లో పాఠశాలలన్నింటా జూనియర్‌ కాలేజీలుగా ఏర్పాటు కానున్నాయి. 

నాలుగు కోర్సులతో ఇంటర్‌ 
గురుకుల జూనియర్‌ కాలేజీల్లో నాలుగు కోర్సులకు ప్రభుత్వం అనుమతిస్తోంది. ఎంపీసీ, బీపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సులుంటాయి. ఒక్కో కోర్సులో 60 సీట్లుంటాయి. గురుకుల జూనియర్‌ కాలేజీల్లో చేరే విద్యార్థులకు ఇంటర్మీడియట్‌ కోర్సుతో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఎంసెట్, నీట్, క్లాట్, జేఈఈ తదితర పోటీ పరీక్షలకు ఫస్టియర్‌ నుంచే అదనపు తరగతులు నిర్వహిస్తారు. 

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన గురుకుల పాఠశాలలు
సొసైటీ       పాఠశాలలు 

ఎస్సీ         104 
ఎస్టీ           51 
బీసీ           238 
మైనారిటీ    192  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement