మార్పులతో గురుకుల నోటిఫికేషన్
7,306 పోస్టులు.. 18 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: గురుకుల ఉపాధ్యా యులు, ఇతర పోస్టుల భర్తీకి తొమ్మిది కొత్త నోటిఫికేషన్లు (రీ నోటిఫికేషన్స్) గురువారం జారీ అయ్యాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) మొత్తంగా 7,306 పోస్టులతో ఈ నోటిఫికేషన్లను జారీ చేసింది. అభ్యర్థులు ఈనెల 18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని.. పూర్తి వివరాలను త్వరలో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది.
గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులకు బీఎడ్‌తోపాటు పీజీలో 60 శాతం మార్కులు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులకు బీఎడ్‌తోపాటు డిగ్రీలో 60 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. దాంతో ఈ విషయంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని మార్పులు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఎన్‌సీటీఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సంక్షేమ శాఖలు రూపొందించిన నిబంధనలతో తాజా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.
తాజా నిబంధనలు ఇలా..
తాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఉపాధ్యాయ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులు బీఎడ్‌తోపాటు పీజీ, డిగ్రీలో 45 శాతం మార్కులు సాధించి ఉంటే చాలు. ఇతరులు బీఎడ్‌తో పాటు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎక్స్ సర్వీస్‌మెన్‌కు రిజర్వేషన్ ఉంటుంది. ఇక డీఎడ్–డిగ్రీ పూర్తి చేసిన వారికి టీజీటీ పోస్టుల్లో అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. బీకాం వారికి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వారికి కూడా పోస్టుల్లో అర్హత కల్పించినట్లు సమాచారం. టీజీటీ పోస్టులకు అభ్యర్థులు బీఎడ్‌తో పాటు టెట్‌లోనూ అర్హత సాధించి ఉండాలి. అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు పూర్తిస్థాయి నోటిఫికేషన్ వచ్చాకే వెల్లడికానున్నాయి.