త్వరలో 12,000 టీచర్ పోస్టులు
వచ్చే నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న దాదాపు 12 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభిం చింది. వచ్చే నెలాఖరులో లేదా మార్చి మొదటి వారంలో పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పాఠశాలల్లో పోస్టుల భర్తీ బాధ్యతలను టీఎస్‌పీఎస్సీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గురుకుల పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీపై టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది.
మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వచ్చే జూన్‌లో పాఠశాలలు తెరిచే నాటికి భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పలుమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలాఖరులో లేదా మార్చిలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో వెల్లడించారు. ప్రస్తుతం ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో టెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అన్న విషయంలో ప్రభుత్వం పలు రకాలుగా ఆలోచనలు చేస్తోంది.
పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లోనూ టెట్ అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చిన అక్కడి ప్రభుత్వం 2014లోనే టెట్ లేకుండా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలోనూ టెట్ లేకుండానే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే ఆలోచనల్లో ఉన్నట్లు తెలిసింది. టెట్‌పై స్పష్టత రాగానే పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపైనా కసరత్తు ప్రారంభించే అవకాశం ఉంది.