సాక్షి, హైదరాబాద్
ఉపాధ్యాయ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువును డిసెంబర్ 15 వరకు పొడిగించినట్లు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ కేటగిరీలకు చెందిన 8,792 పోస్టుల కోసం అభ్యర్థులు మరో 15 రోజుల పాటు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. వాస్తవానికి అక్టోబర్ 30న ప్రారంభమైన దరఖాస్తుల గడువు గురువారంతో ముగిసింది. అయితే 31 జిల్లాల ప్రకారం కాకుండా 10 జిల్లాల ప్రకారమే పోస్టులను భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా 10 జిల్లాల ప్రకారం పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. మరోవైపు విద్యాశాఖ కూడా 31 జిల్లాల ప్రకారం ఇచ్చిన 8,792 పోస్టులను, వాటి రోస్టర్ పాయింట్లను 10 జిల్లాల ప్రకారం ఇవ్వాల్సి ఉంది. ఇందుకు కొంత సమయం పట్టనుంది.
మరోవైపు 31 జిల్లాల వారీగా ఇచ్చిన నోటిఫికేషన్ కిందే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో దరఖాస్తుల గడువును అందుకు అనుగుణంగానే టీఎస్‌పీఎస్సీ పొడిగించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో అభ్యర్థుల స్థానికతను పాత జిల్లాల ప్రకారమే చూడాల్సి ఉంది. అయితే ఇందుకు ఎడిట్ ఆప్షన్‌ను ఇవ్వాల్సి ఉంది. అందుకు ప్రభుత్వం నుంచి పది జిల్లాల ప్రకారం పోస్టుల భర్తీకి ఆమోదం, ఉత్తర్వులు వచ్చాకే పది జిల్లాల స్థానికతను ఎంచుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment