
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో నెలకొన్న ప్రధాన సమస్యలపై సత్వరమే స్పందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వసతిగృహాల వారీగా తక్షణ అవసరాలపై నివేదికలు కోరింది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల మొదటి వారం నుంచి సంక్షేమ వసతిగృహాలు పునఃప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో విద్యార్థులు వచ్చేనాటికి ప్రధాన సమస్యలు పరిష్కరించాలని, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టడం, చిన్నపాటి నిర్మాణాలు పూర్తి చేయడం వంటి వాటికి ప్రాధాన్యతనిస్తోంది.
ప్రాధాన్యతా క్రమంలో ప్రతిపాదనలు...
సంక్షేమ వసతిగృహాల్లో సమస్యలపై జిల్లా స్థాయిలో ప్రతిపాదనలు సమర్పించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖలు సూచించాయి. ఈ మేరకు జిల్లా సంక్షేమ అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి.ప్రత్యేక ఫార్మాట్‌ను తయారు చేసిన అధికారులు...ఆమేరకు వివరాలు పంపాలని, వసతిగృహాల్లో విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో ప్రణాళికలు తయారు చేయాలని స్పష్టం చేశాయి.
జిల్లాల వారీ ప్రతిపాదనలు ఈనెల 20వ తేదీలోగా రాష్ట్ర కార్యాలయానికి సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. వసతి గృహాల్లో ప్రధానంగా విద్యుత్, నీటిసరఫరా, డ్రైనేజీ వ్యవస్థకు చెందిన సమస్యలున్నాయి. వీటితోపాటు దీర్ఘకాలికంగా పెయింటింగ్ వేయకపోవడంతో భవనాలు పాతవాటిలా కనిపిస్తున్నాయి. తాజా ప్రతిపాదనల్లో వీటికి సైతం ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది.
శాశ్వత భవనాల్లోని పనులకు రూ.25 కోట్లు అవసరమని అంచనా..
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 1850 వసతిగృహాలున్నాయి. వీటిలో దాదాపు 280 హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ముందుగా శాశ్వత భవనాలకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అక్కడి సమస్యలను ప్రస్తావిస్తూ ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. అదేవిధంగా అద్దె భవనాల్లోని హాస్టళ్లకు మాత్రం యజమానితో సంప్రదింపులు జరిపి రంగులు, విద్యుత్ సమస్యను పరిష్కరించాలని, నీటి సరఫరా, డ్రైనేజీ పనులకు మాత్రం ప్రభుత్వం నుంచి సాయం అందించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు.
శాశ్వత భవనాల్లో పనులకు దాదాపు రూ.25కోట్లు అవసరమవుతుందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.ఈనెల 20లోపు జిల్లా స్థాయి ప్రతిపాదనలు వచ్చిన వెంటనే వాటి ఆధారంగా రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యతా క్రమంలో తక్షణ అవసరాలకు తగినట్లు రాష్ట్ర కార్యాలయ అధికారులు ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తారు. నెలాఖరులోగా దానికి ప్రభుత్వ ఆమోదం లభిస్తే జూన్ రెండో వారం కల్లా పనులు పూర్తి చేయనున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు.