వసతి గృహాల్లో ‘బ్రాండ్‌’ బాజా! | Branded goods for hostel students | Sakshi
Sakshi News home page

వసతి గృహాల్లో ‘బ్రాండ్‌’ బాజా!

Published Mon, Mar 12 2018 2:26 AM | Last Updated on Sat, Sep 15 2018 3:01 PM

Branded goods for hostel students - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు కార్పొరేట్‌ హాస్టల్‌ స్థాయి సేవలందుకోబోతున్నారు. ఇప్పటివరకు అరకొర వసతులతో ఇబ్బందులు పడ్డ వసతి గృహాల్లోని విద్యార్థులకు ఇకపై బ్రాండెడ్‌ వస్తువులివ్వాలని ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. ప్రస్తుత వార్షిక సంవత్సరం ప్రారంభం నుంచి వసతి గృహాల్లో భోజన మెనూలో ప్రభుత్వం భారీ మార్పులు తీసుకొచ్చింది. చార్జీలు పెంచడంతో 3 పూటలా సంపూర్ణ పౌష్టికాహారం అందుతోంది. నెలలో 4 సార్లు చికెన్, రెండుసార్లు మటన్‌ భోజనంతోపాటు ప్రతి రోజూ కోడిగుడ్డును అందిస్తున్నారు. ఇదే తరహాలో రోజువారీ వినియోగించే వస్తువులను బ్రాండెడ్‌ కంపెనీల నుంచి కొనుగోలు చేయాలని ఎస్సీ శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. 

రూ.69.52 కోట్ల ఖర్చు 
రాష్ట్రంలో 687 సంక్షేమ వసతి గృహాలున్నాయి. ఇందులో 568 ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లు, 119 పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లున్నాయి. ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లలో 58,160 మంది, పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లలో 22,623 మంది విద్యార్థులున్నారు. పదో తరగతి వరకు ప్రభుత్వమే యూనిఫాం ఇస్తోంది. కాలేజీ విద్యార్థులకు డ్రెస్‌ కోడ్‌ లేదు. దీంతో వారే వ్యక్తిగతంగా డ్రెస్‌లు కొనుగోలు చేసుకుంటున్నారు. వీరికి కాస్మొటిక్‌ చార్జీల కింద బ్రాండెడ్‌ సబ్బులు, సౌందర్య సాధనాలు ఇస్తోంది. మిగిలిన వాటిని కూడా బ్రాండెడ్‌ వస్తువులే ఇవ్వనుంది. కాలేజీ విద్యార్థులకు లాన్సర్‌ స్పోర్ట్స్‌ షూస్, స్కూల్‌ పిల్లలకు బాటా స్కూల్‌ షూస్‌ పంపిణీ చేయనుంది. ప్రతి వసతి గృహంలో బ్లూస్టార్‌ ఆర్వో ప్లాంట్‌ (నీటి శుద్ధి యంత్రం) ఏర్పాటు చేయనుంది. స్కూల్‌ బ్యాగులు, బంకర్‌ బెడ్లు ప్రముఖ కంపెనీలకే ఆర్డర్‌ ఇచ్చి తయారు చేయించనుంది. స్లీప్‌వెల్‌ బ్రాండ్‌కు చెందిన మాట్రిసెస్, పిల్లోస్‌ను పిల్లలకు ఇవ్వనున్నారు. నిఘా కట్టుదిట్టం చేసేందు కు ఒక్కో హాస్టల్‌లో ఆరు సీసీ కెమెరాలు, ఒక డీవీఆర్‌ యంత్రాలను అమరుస్తారు. వీటన్నిం టి కోసం ఎస్సీ అభివృద్ధి శాఖ రూ.69.52 కోట్లు ఖర్చు చేస్తోంది.

జిల్లా కమిటీలకు కొనుగోలు బాధ్యతలు 
ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోని సంక్షేమ వసతి గృహాల్లో కొత్తగా ఇవ్వనున్న బ్రాండెడ్‌ వస్తువుల కొనుగోలు బాధ్యతలను కలెక్టర్‌ చైర్మన్‌గా ఉన్న కొనుగోలు కమిటీలకు అప్పగించింది. రాష్ట్రస్థాయిలో కేటగిరీలు, ధరలు నిర్ణయించి.. ఆ మేరకు వస్తువులను కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. కేవలం కొనుగోలే కాకుండా ప్రతి వస్తువుకు గ్యారంటీ ఉండాలనే నిబంధన విధించింది. ఈ ప్రక్రియలో భాగంగా రెండ్రోజుల క్రితం ఖమ్మం జిల్లా కమిటీ వస్తువులు కొనుగోలు చేసింది. మిగతా జిల్లాల్లోనూ కొనుగోలు ప్రక్రియ వీలైనంత వేగంగా పూర్తి చేస్తామని, అనంతరం విద్యార్థులకు పంపిణీ చేస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు కరుణాకర్‌ ‘సాక్షి’కి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement