హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలి
చెన్నూర్ : వసతి గృహాల్లో విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి అరిగెల మహేశ్ అన్నారు. సంక్షేమ హాస్టల్ సమస్యలపై చేపట్టిన సైకిల్ యాత్ర ఆదివారం చెన్నూర్‌కు చేరుకుంది. పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా జనరల్ హాస్టల్ విద్యార్థులకు రూ. 2000, కళాశాల విద్యార్థులకు రూ. 2500తో పాటు కాస్మొటిక్స్‌కు రూ. 400 పెంచాలన్నారు.
మధ్యాహ్న భోజనానికి ప్రతి విద్యార్థికి రూ. 40 వరకు ఖర్చు చేయాలని పేర్కొన్నారు. ప్రతి నెల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు మోహన్, అనిల్, నాయకులు పవన్‌కల్యాణ్, మహేశ్, సంధ్య పాల్గొన్నారు.