సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు జూనియర్ కాలేజీ హాస్టళ్ల ఇష్టారాజ్యానికి ఇక చెల్లుచీటీ పడనుంది. హాస్టళ్లలో పాటించాల్సిన నిబంధనలపై ఇంటర్మీడియట్ బోర్డు పంపిన ప్రతిపాదనలను కొన్ని మార్పులతో మంగళవారం ప్రభుత్వం ఆమోదించింది. దీంతో వెంటనే నిబంధనలు అమల్లోకి తెచ్చేందుకు బోర్డు చర్యలు చేపట్టింది. హాస్టళ్లలోని విద్యార్థులను తల్లిదండ్రులు/సంరక్షకులు రోజూ సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు కలిసేలా, అత్యవసరమైతే ఎప్పుడైనా కలిసేందుకు అనుమతిచ్చేలా నిబంధనలు సిద్ధం చేసింది. ప్రతి 50 మందికి 5 బాత్‌రూమ్‌లు, 8 టాయిలెట్లు ఉండేలా.. టిఫిన్ సహా 4 పూటల ఆహారం అందించేలా, విద్యార్థుల సంఖ్య ఆధారంగా హాస్టళ్ల గుర్తింపు ఫీజు చెల్లించేలా నిబంధనలు రూపొందించింది.
ఏడాదికోసారి ఆడిట్
- హాస్టల్‌లో ప్రథమ చికిత్స కిట్, అగ్నిమాపక పరికరాలు, రిక్రియేషన్ రూమ్‌లు, రక్షిత తాగునీటి సదుపాయం లేదా ఆర్‌వో ప్లాంట్లు, సరిపడ వెంటిలేషన్ ఉండాలి.
- ప్రతి విద్యార్థికి 50 చదరపు అడుగులు (ఎస్‌ఎఫ్‌టీ), ప్రతి 25 మందికి 1,000 ఎస్‌ఎఫ్‌టీ ఉండాలి.
- ప్రైవేటుతోపాటు, ప్రభుత్వ హాస్టళ్లలోనూ చిన్న గదుల సదుపాయం లేనందున రూంకు ఇద్దరు నిబంధనను ప్రభుత్వం తొలగించింది.
- కౌన్సెలింగ్, గైడెన్స్ రూం.. విద్యార్థులకు సరిపడ ఆట స్థలం ఉండాలి. ఉతికిన బట్టలు ఆరబెట్టేందుకు ఖాళీ స్థలం ఉండాలి.
- హాస్టల్‌కు సొంత కిచెన్ ఉండాలి. కిచెన్, బాత్‌రూమ్, టాయిలెట్లు శుభ్రంగా ఉంచాలి. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ జారీ చేసిన ఫుడ్ సేఫ్టీ సర్టిఫికెట్ ఉండాలి.
- హాస్టళ్లకు వేరుగా అకౌంట్ నిర్వహించాలి. ఏడాదికోసారి ఆడిటర్‌తో లెక్కలు చేయించి రెన్యువల్ సమయంలో అందజేయాలి.
రోజుకు రెండు సార్లు విద్యార్థుల హాజరు
- విద్యార్థులకు ప్రతి రోజు టిఫిన్ సహా 4 సార్లు ఆహారం అందించాలి. నిఫుణుల నేతృత్వంలో ఆహారం వండాలి. వార్డెన్ కూడా భోజనం నాణ్యత పరిశీలించాలి.
- పోషకాహారం అందించాలి. నెలకోసారి ఆరోగ్య పరీక్షలు చేయించాలి. హాస్టళ్లలో స్టాఫ్ నర్సు ఉండాలి. బాలికల హాస్టల్ అయితే మహిళా నర్సును నియమించాలి.
- ఉదయం 7:30 నుంచి 8:30 గంటల వరకు టిఫిన్, మధాహ్నం 12:30 నుంచి 1:30 గంటల వరకు భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు భోజనం పెట్టాలి.
- హాస్టళ్లలో కచ్చితంగా రిజిస్టర్ సైకాలజిస్ట్/క్వాలిఫైడ్ కెరీర్ కౌన్సెలర్ ఉండాలి. హాస్టళ్లలో నియమించే సిబ్బందికి పోలీసు క్లియరెన్స్ తీసుకోవాలి.
- ప్రతి రోజు రెండుసార్లు విద్యార్థుల హాజరు తీసుకోవాలి. సెలవు కోసం తల్లిదండ్రులు లేఖ రాసి తీసుకెళ్లాలి.
- అడ్మిషన్ రిజిస్టర్, విజటర్ బుక్, మెడికల్ రిజిస్టర్, ఫిర్యాదుల రిజిస్టర్ తప్పనిసరిగా ఉండాల్సిందే.
- హాస్టల్ యాజమాన్యాలు ఇన్‌స్పెక్షన్ ఫీజు (కార్పొరేషన్లలో రూ. 80 వేలు, మున్సిపాలిటీలో రూ. 60 వేలు, గ్రామ పంచాయతీలో రూ. 50 వేలు) చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసకోవాలి.
- హాస్టల్ నిర్వహణ ఫీజును కార్పొరేషన్లలో రూ. లక్ష, మున్సిపాలిటీ పరిధిలో రూ. 80 వేలు, గ్రామ పంచాయతీల్లో రూ.60 వేల చెల్లించాలి.
- ఇవి కాకుండా 50 మంది విద్యార్థులకు రూ. 4 లక్షలు, 50 నుంచి 200 మంది వరకు రూ. 8 లక్షలు, 201 నుంచి 500 వరకు రూ. 12 లక్షలు, 500 మందికంటే ఎక్కువుంటే రూ. 16 లక్షలు డిపాజిట్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment