ఫీజులు లక్షలు.. దొంగ లెక్కలు | Private Junior Colleges that violate norms on Fees | Sakshi
Sakshi News home page

ఫీజులు లక్షలు.. దొంగ లెక్కలు

Published Sat, Feb 15 2020 3:50 AM | Last Updated on Sat, Feb 15 2020 3:50 AM

Private Junior Colleges that violate norms on Fees - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: రూ.లక్షల్లో ఫీజులు.. రికార్డుల్లో చూపిస్తున్నది మాత్రం రూ.వేలల్లో... కనీస సదుపాయాలూ కరువే.. బట్టీ పద్ధతుల్లో చదువులు.. ఆటలు, పాటలు అసలే లేవు. ఉదయం నుంచి రాత్రి వరకు కూర్చున్న చోటు నుంచి కదిలే అవకాశం ఉండదు. విద్యార్థుల్లో విపరీతమైన మానసిక ఒత్తిడి. ఇవీ రాష్ట్రంలోని పలు ప్రైవేటు కాలేజీల్లో నెలకొన్న దుర్భర పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు పది చొప్పున ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించింది. ఆయా కళాశాలల్లోని పరిస్థితులను చూసి తనిఖీ బృందాలు విస్తుపోయాయి. కాలేజీల యాజమాన్యాలు రికార్డుల్లో చూపిస్తున్న సమాచారానికి... తనిఖీ బృందాలు గుర్తించిన వాస్తవ పరిస్థితులకు మధ్య ఎక్కడా పొంతనే లేకపోవడం గమనార్హం. 

ప్రైవేట్‌ కాలేజీల తనిఖీల్లో తేలిందేమిటి? 
- పలు జూనియర్‌ కాలేజీలు ఇంటర్మీడియెట్‌కు ఏడాదికి రూ.90 వేల నుంచి రూ.లక్ష దాకా వసూలు చేస్తున్నాయి. కానీ, రూ.40 వేల నుంచి రూ.50 వేలు మాత్రమే వసూలు చేస్తున్నట్లుగా రికార్డుల్లో నమోదు చేస్తున్నాయి. 
- పలు కాలేజీలు సరైన గుర్తింపు పత్రాలు లేకుండానే యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. 
- కొన్ని కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా మరుగుదొడ్లు కూడా లేవు. కృష్ణా జిల్లాలోని ఒక కాలేజీలో 400 మంది విద్యార్థినులుండగా, 3 మరుగుదొడ్లు మాత్రమే ఉండడం గమనార్హం.  
- ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందజేయడం లేదు. కాలేజీలు సబ్జెక్టుల వారీగా సొంతంగా ముద్రించిన వర్క్‌బుక్స్‌ మాత్రమే ఉన్నాయి. వాటికి ఒక్కొక్కరి నుంచి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. 
- పబ్లిక్‌ పరీక్షల పేరిట, ఎంసెట్, జేఈఈ, ఇతర పరీక్షల ఫీజుల పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అదనంగా వేలాది రూపాయలు దండుకుంటున్నారు. 
- ఒక్కో తరగతిలో నిబంధనలకు విరుద్ధంగా 90 మందిని కూర్చోబెడుతున్నారు. 
- బడా కార్పొరేట్‌ కాలేజీల్లో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. 
- పలు కాలేజీల్లో 7 నుంచి 10 సెక్షన్ల దాకా నిర్వహిస్తున్నారు. వారానికోసారి పరీక్షలు నిర్వహిస్తున్నారు మెరిట్‌లో ఉన్న వారిని ఒకటో సెక్షన్‌లో ఉంచుతున్నారు. మరో వారం నిర్వహించే పరీక్షలో తక్కువ మార్కులు వస్తే కింది సెక్షన్లకు మార్చేస్తున్నారు. దీంతో విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారు. 
- కొన్ని కాలేజీల్లో తరగతి గదులు నిర్ణీత సైజుల్లో లేవు. సరైన గాలి, వెలుతురు లేని ఇరుకు గదుల్లోనే విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. శుభ్రమైన మంచి నీరు కూడా అందించడం లేదు. 
అధ్యాపకులకు నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల దాకా వేతనం ఇస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. వాస్తవానికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు మాత్రమే ఇస్తున్నారు. 
- విద్యార్థులను ఇష్టానుసారంగా చేర్చుకుంటున్నారు. ఇంటర్మీడియెట్‌ బోర్డు అనుమతించిన సంఖ్యకు, అక్కడున్న విద్యార్థుల సంఖ్యకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement