Private junior colleges
-
అడ్డగోలు అడ్మిషన్లుచెల్లవ్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంటర్మీడియట్ కాలేజీలపై ఇంటర్ బోర్డు మరింత దృష్టి పెట్టింది. అనుమతుల్లేకుండా అడ్డగోలుగా చేపట్టే అడ్మిషన్లు చెల్లవని స్పష్టంచేసింది. అలాంటి కాలేజీల వివరాలు సేకరించి తమకు పంపాలని జిల్లా ఇంటర్ అధికారులను ఆదేశించింది. ఇలాంటి కాలేజీలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతోంది. దీంతోపాటు ఈ ఏడాది సకాలంలో అనుబంధ గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. ఈలోగా ఎక్కడా ఏ కాలేజీ అడ్మిషన్లు తీసుకోవడానికి వీల్లేదని, కాలేజీకి గుర్తింపు రాకపోతే బోర్డు బాధ్యత వహించదని స్పష్టంచేసింది. ప్రతీ ప్రైవేటు కాలేజీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలను పొందుపరుస్తూ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఏటా బోర్డు నిబంధనలు ఉల్లంఘించే కాలేజీలపై గట్టి నిఘా ఉంచాలని, వాటి వివరాలను తమకు పంపాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. మెరుగైన బోధన ఉండాల్సిందే.. ఎక్కడైతే అనుబంధ గుర్తింపు పొందుతారో, అక్కడే కాలేజీ నిర్వహించాలని, ఒకచోట అనుమతి, వేరొకచోట కాలేజీ ఉంటే పర్మిషన్ రద్దు చేస్తామని ప్రైవేటు ఇంటర్ కాలేజీలను బోర్డు హెచ్చరించింది. ఈ దిశగా వివరాలు సేకరించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ అధికారులను ఆదేశించారు. నాణ్యమైన బోధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఇది ఒక క్యాంపస్‌కే పరిమితం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు. బోధన, బోధనేతర సిబ్బందిని నియమించేటప్పుడు వారి వివరాలను ఈ ఏడాది నుంచి బోర్డు ఆన్లైన్లో నమోదు చేయబోతోంది. విద్యాసంవత్సరం మొదట్లో నియమించిన అధ్యాపకులే చివరి వరకూ ఉండాలనే నిబంధన విధించింది. ఒకవేళ అధ్యాపకుడిని మారిస్తే ఆ విషయాన్ని బోర్డు అధికారులకు తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. దీనివల్ల బోధన ఏ స్థాయిలో జరుగుతుందనేది అంచనా వేయొచ్చని అధికారులు చెబుతున్నారు. బయోమెట్రిక్ తప్పనిసరి ఈ ఏడాది నుంచి సిబ్బంది బయోమెట్రిక్‌ను తప్పనిసరి చేయనున్నారు. ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో బోధించే అధ్యాపకులు విధిగా పీజీ చేసి ఉండాలి. వారి వివరాలు, ఆధార్, బయోమెట్రిక్‌కు అవసరమైన వివరాలను ఆన్లైన్ ద్వారా ఫీడ్ చేస్తారు. విద్యా సంవత్సరం ముగిసే వరకూ వారి బయోమెట్రిక్ కొనసాగేలా చూస్తారు. ప్రతీ కాలేజీలో ప్రత్యేక మొబైల్ నంబర్ అందుబాటులో ఉండాలని, ఇది జిల్లా ఇంటర్ విద్యాధికారికి తెలపాలని సూచించారు. విద్యా సంవత్సరానికి సంబంధించి బోర్డు నిర్ణయించిన తేదీల్లోనే ప్రవేశాలు, తరగతులు జరగాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. -
తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులివ్వండి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్, డిగ్రీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ప్రైవేటు కాలేజీల నిర్వహణ కష్టంగా ఉందని ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరీసతీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడి సంఘం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు స్థాపించిన కాలేజీలపట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. తమ కాలేజీల్లో 9.40 లక్షలమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. 2021–22 సంవత్సరానికి రూ.86.55 కోట్లు ట్రెజరీకి విడుదలైనా ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంటు ఇవ్వలేదని, 2022–23 సంవత్సరానికి రూ.226 కోట్లు ఇంకా విడుదల చేయలేదన్నారు. దీనివల్ల అధ్యాపకులకు వేతనాలు ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక వసతులులేవని వేధించే ప్రభుత్వం, తమకు రావాల్సిన బకాయిలు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. గడచిన ఎనిమిదేళ్లలో కాలేజీలపై వివిధ రకాల ఫీజులను 10 నుంచి 50 శాతం పెంచారని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను మాత్రం ఆ నిష్పత్తిలో పెంచలేదన్నారు. ఈ నెలాఖరులోగా ప్రభుత్వం తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోతే రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో సంఘం నేతలు ఇంద్రసేనరెడ్డి, ఉస్మాన్, ఎస్ఎన్ రెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీలలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ స్పష్టం చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కాలేజీలకు ఫీజులను నిర్ణయిస్తూ మంగళవారం జీవో 54ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవోలో పేర్కొన్న మేరకు గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని కాలేజీలు నిర్ణీత ఫీజులను మాత్రమే వసూలు చేయాలన్నారు. -
ప్రయివేట్ కాలేజీలకు ఇంటర్ బోర్డు వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లోని కొన్ని మేనేజ్మెంట్ తమ కాలేజీల నుంచి ఇప్పటికే చాలా మంది సిబ్బందిని (టీచింగ్ & నాన్-టీచింగ్) తొలగించినట్లు తెలిసిందని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పేర్కొంది. ఈ మేరకు నాంపల్లిలోని రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి విద్యా భవన్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి పరిస్థితిలో సిబ్బందికి జీతాలు చెల్లించలేక తొలగించినట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. ఇది G.O.Ms.45, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, తేదీ: 22-03-2020 రెగ్యులేషన్ 14కు వ్యతిరేకం అయినందున ఏదైనా ఉల్లంఘనకు పాల్పడితే ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ 1897 ప్రకారం చర్యలు తీసుకోంటామని తెలిపింది.(ఇంటర్ పనిదినాలు...182 రోజులే!) ఇంకా నిర్దేశించిన క్వాలిఫైడ్ టీచింగ్ & నాన్ టీచింగ్ స్టాఫ్ అందుబాటులో లేకపోతే కూడా ఈ విద్యా సంవత్సరం అంటే 2020-21 అఫిలియేషన్ దరఖాస్తులు తిరస్కరించనున్నట్లు తెలిపింది. రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సును అందిస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యలు, ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ 1897 కింద జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. లేకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని, తప్పుగా వ్యవహరించిన యజమాన్యానికి ఈ విద్యా సంవత్సరానికి తాత్కాలిక గుర్తింపు రద్దు చేయనున్నట్లు తెలిపింది. -
1,456 ప్రైవేటు జూనియర్ కాలేజీలకు షాక్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని 1,456 ప్రైవేటు జూనియర్ కాలేజీలకు ఈసారి అనుబంధ గుర్తింపు లభించే పరిస్థితి లేకుండాపోయింది. అగ్నిమాపక శాఖ తమ నిబంధనలను మార్పు చేయడంతో వాటిన్నింటికి ఆ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) ఇచ్చే పరిస్థితి లేదు. ఫైర్ ఎన్వోసీ లేకుండా ఇంటర్మీడియట్ బోర్డు కాలేజీలను నడిపేందుకు అనుబంధ గుర్తింపును జారీ చేసే పరిస్థితి లేదు. దీంతో ఆయా కాలేజీల పరిస్థితి గందరగోళంలో పడింది. దీనిపై ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సాయంత్రం అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామ్‌చంద్రన్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్‌తో ఉన్నత స్థాయి కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. అందులో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. దీంతో సమావేశం అర్ధంతరంగానే ముగిసింది. అయితే రాష్ట్రంలో 1,586 కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కాలేజీలుంటే అందులో కేవలం 130 కాలేజీలు మాత్రమే అగ్నిమాపక శాఖ తాజా నిబంధనల ప్రకారం ఉండటంతో వాటికి మాత్రమే ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపునిచ్చే అవకాశముంది. మిగతా 1,456 కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభించే అవకాశం లేకుండా పోయింది. అసలేం జరిగిందంటే.. రాష్ట్రంలో 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తున్న విద్యా సంస్థల భవనాలకు ఫైర్ ఎన్వోసీ అవసరం లేదని, అంతకంటే ఎక్కువ ఎత్తున్న భవనాలకే ఫైర్ ఎన్వోసీ అవసరమని అగ్నిమాపక శాఖ 2017లో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ గతేడాది హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ కేసులో వాదనల సందర్భంగా అంతకుముందు ఉన్న ఉత్తర్వులను సవరిస్తున్నామని, 6 మీటర్లలోపు ఎత్తు మాత్రమే ఉన్న భవనాలకు ఎన్వోసీ ఇస్తామని, అంతకంటే ఎత్తున్న భవనాలకు ఎన్వోసీ ఇవ్వబోమని ఉత్తర్వులను సవరించింది. ఈ మేరకు 2020 ఫిబ్రవరి 22న సవరణ ఉత్తర్వులను జారీ చేసింది. అదే విషయాన్ని హైకోర్టుకు తెలియజేసింది. అయితే 2020–21 విద్యా సంవత్సరంలో కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఫైర్ ఎన్వోసీ లేకుండాపోయింది. 1,456 కాలేజీలు 6 మీటర్లకంటే ఎక్కువ ఎత్తున్నవే. వాటికి అగ్నిమాపక శాఖ ఫైర్ ఎన్వోసీ జారీ చేయలేదు. దీంతో యాజమాన్యాలు బోర్డు అధికారులకు, విద్యాశాఖ మంత్రికి పలుమార్లు విన్నవించారు. దీంతో మంత్రి మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు చేరే ఆ కాలేజీలకు ఫైర్ ఎన్వోసీ లేకుండా, అనుబంధ గుర్తింపు ఇవ్వకుండా కొనసాగించడం ఎలా అన్న దానిపై చర్చించారు. అయితే తాము ఏమీ చేయలేమని, నిబంధనలను మార్పు చేసి హైకోర్టుకు విషయాన్ని చెప్పినందున ఆ నిబంధనలను ఇప్పుడు సవరించడం కుదరదని, నిబంధనల మేరకు ఉన్నవాటికే ఎన్వోసీ జారీ చేస్తామని అగ్నిమాపక శాఖ పేర్కొంది. కావాలనుకుంటే తమ ఉత్తర్వులను కోర్టులో సవాల్ చేయడం, లేదా కాలేజీలను ఫైర్ ఎన్వోసీ నుంచి మినహాయిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చుకొని ముందుకు సాగవచ్చని సూచించింది. అయితే ఫైర్ ఎన్వోసీ నుంచి మినహాయిస్తూ తాము ఉత్తర్వులు ఇవ్వలేమని, అలా ఇస్తే ఇరుక్కుంటామని విద్యాశాఖ కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్ పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో సమస్యకు పరిష్కారం లభించలేదు. దీనిపై సీఎంతో చర్చిస్తానని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిబంధనలు పాటించని ప్రైవేటు జూనియర్ కాలేజీలపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనలు అతిక్రమించే కాలేజీలపై చర్యలు తప్పవని పేర్కొంది. విద్యా సంస్థల భవనాలు, నిబంధనల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఫైర్ సర్వీ సెస్ డీజీ, హోం సెక్రెటరీ, జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, కళాశాల విద్యాశాఖ, ఇంటర్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. అగ్నిమాపక నిబంధనల ప్రకారం ఎన్ని కాలేజీలు ఉన్నాయి.. ఎన్ని కాలేజీలు లేవు అన్న అంశాలను తేల్చేందుకు ఆ శాఖ తని ఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే గుర్తించిన నిబంధనలు పాటించని కాలేజీలపై ఎందుకు ఆయా శాఖలు చర్యలు చేపట్టడం లేదని చిత్రా రామచంద్రన్ ప్రశ్నించినట్లు తెలిసింది. ఎవరి శాఖ తరఫున వారు నిబంధనలు పాటించని వాటిపై చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు సమాచారం. హాస్టళ్లు, అకాడమీలు బోర్డు పరిధిలోకి.. అనుమతి లేని హాస్టళ్లు, శిక్షణ సంస్థలు, ఇంటర్మీడియెట్ తరగతులు నిర్వహించే అకాడమీలను ఇంటర్ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని, అవన్ని కచ్చితంగా బోర్డు నుంచి అనుబంధ గుర్తింపు తీసుకోవాలని నిర్ణయించారు. ఇకపై కండిషనల్ అఫిలియేషన్ల విధానం ఉండదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఫైర్ సేఫ్టీ, ఇతర నిబంధనల మేరకు లేని భవనాల నుంచి ఆయా కాలేజీలను ఇతర భవనాల్లోకి తరలించాలని యాజమాన్యాలకు తేల్చి చెప్పాలని నిర్ణయించారు. -
ఫీజులు లక్షలు.. దొంగ లెక్కలు
సాక్షి, అమరావతి: రూ.లక్షల్లో ఫీజులు.. రికార్డుల్లో చూపిస్తున్నది మాత్రం రూ.వేలల్లో... కనీస సదుపాయాలూ కరువే.. బట్టీ పద్ధతుల్లో చదువులు.. ఆటలు, పాటలు అసలే లేవు. ఉదయం నుంచి రాత్రి వరకు కూర్చున్న చోటు నుంచి కదిలే అవకాశం ఉండదు. విద్యార్థుల్లో విపరీతమైన మానసిక ఒత్తిడి. ఇవీ రాష్ట్రంలోని పలు ప్రైవేటు కాలేజీల్లో నెలకొన్న దుర్భర పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు పది చొప్పున ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించింది. ఆయా కళాశాలల్లోని పరిస్థితులను చూసి తనిఖీ బృందాలు విస్తుపోయాయి. కాలేజీల యాజమాన్యాలు రికార్డుల్లో చూపిస్తున్న సమాచారానికి... తనిఖీ బృందాలు గుర్తించిన వాస్తవ పరిస్థితులకు మధ్య ఎక్కడా పొంతనే లేకపోవడం గమనార్హం. ప్రైవేట్ కాలేజీల తనిఖీల్లో తేలిందేమిటి? - పలు జూనియర్ కాలేజీలు ఇంటర్మీడియెట్‌కు ఏడాదికి రూ.90 వేల నుంచి రూ.లక్ష దాకా వసూలు చేస్తున్నాయి. కానీ, రూ.40 వేల నుంచి రూ.50 వేలు మాత్రమే వసూలు చేస్తున్నట్లుగా రికార్డుల్లో నమోదు చేస్తున్నాయి. - పలు కాలేజీలు సరైన గుర్తింపు పత్రాలు లేకుండానే యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. - కొన్ని కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా మరుగుదొడ్లు కూడా లేవు. కృష్ణా జిల్లాలోని ఒక కాలేజీలో 400 మంది విద్యార్థినులుండగా, 3 మరుగుదొడ్లు మాత్రమే ఉండడం గమనార్హం. - ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందజేయడం లేదు. కాలేజీలు సబ్జెక్టుల వారీగా సొంతంగా ముద్రించిన వర్క్‌బుక్స్ మాత్రమే ఉన్నాయి. వాటికి ఒక్కొక్కరి నుంచి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. - పబ్లిక్ పరీక్షల పేరిట, ఎంసెట్, జేఈఈ, ఇతర పరీక్షల ఫీజుల పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అదనంగా వేలాది రూపాయలు దండుకుంటున్నారు. - ఒక్కో తరగతిలో నిబంధనలకు విరుద్ధంగా 90 మందిని కూర్చోబెడుతున్నారు. - బడా కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. - పలు కాలేజీల్లో 7 నుంచి 10 సెక్షన్ల దాకా నిర్వహిస్తున్నారు. వారానికోసారి పరీక్షలు నిర్వహిస్తున్నారు మెరిట్లో ఉన్న వారిని ఒకటో సెక్షన్లో ఉంచుతున్నారు. మరో వారం నిర్వహించే పరీక్షలో తక్కువ మార్కులు వస్తే కింది సెక్షన్లకు మార్చేస్తున్నారు. దీంతో విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారు. - కొన్ని కాలేజీల్లో తరగతి గదులు నిర్ణీత సైజుల్లో లేవు. సరైన గాలి, వెలుతురు లేని ఇరుకు గదుల్లోనే విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. శుభ్రమైన మంచి నీరు కూడా అందించడం లేదు. - అధ్యాపకులకు నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల దాకా వేతనం ఇస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. వాస్తవానికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు మాత్రమే ఇస్తున్నారు. - విద్యార్థులను ఇష్టానుసారంగా చేర్చుకుంటున్నారు. ఇంటర్మీడియెట్ బోర్డు అనుమతించిన సంఖ్యకు, అక్కడున్న విద్యార్థుల సంఖ్యకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది. -
ప్రైవేట్ కాలేజీలపై జగన్ సర్కారు కొరడా..!
సాక్షి, ఒంగోలు టౌన్: నిబంధనలు పాటించని ప్రైవేటు జూనియర్ కళాశాలలపై జగన్ సర్కారు కొరడా ఝుళిపిస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రుతో ఆడుకుంటున్న విద్యాసంస్థల ఆటకట్టించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయడం.. కాలేజీ పేర్ల వెనుక నీట్, జీ వంటి తోకలు చేర్చి తల్లిదండ్రులను ఆకర్షించడం.. ఒక దానికి అనుమతి తీసుకొని, మూడు నాలుగు బ్రాంచ్‌లు ఏర్పాటు చేయడం.. కాలేజీ హాస్టల్‌కు అనుమతి లేకుండా ఏర్పాటు చేయడం వంటివి ఇప్పటి వరకు అనేక ప్రైవేట్ జూనియర్ కాలేజీలు యథేచ్ఛగా చేస్తూ వచ్చాయి. తాము చెప్పిందే శాసనం అన్నట్టు తల్లిదండ్రులను బెదిరించే ధోరణిలో వ్యవహరిస్తూ వచ్చాయి. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఫీజులు వసూలు చేయాలని, ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా చర్యలు తప్పవని ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలకు వైఎస్సార్ సీపీ సర్కారు హెచ్చరికలు జారీ చేసింది. ఫీజుల వివరాలను ఆయా కాలేజీల నోటీసు బోర్డుల్లో తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సంబంధిత కాలేజీలకు ముందుగా నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత ఫైన్ వేయడం, అప్పటికీ తీరు మారకుంటే దానిని క్లోజ్ చేసేందుకు కూడా వెనుకాడవద్దంటూ రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఇప్పటి వరకు దర్జాగా జూనియర్ కాలేజీలు నిర్వహిస్తూ వచ్చిన అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమకు కౌంట్ డౌన్ ప్రారంభమైందని భయపడుతున్నారు. కార్పొ‘రేట్’ బురిడీ.. జిల్లాలో కార్పొరేట్ కాలేజీలు అడుగు పెట్టిన తర్వాత ఫీజుల రూపంలో అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించే విధంగా రకరకాల ప్రకటనలు చేస్తూ బుట్టలో వేసుకుంటున్నాయి. ఇక ఇంటర్ మీడియట్ ఫలితాలు, ఎంసెట్ ర్యాంకులు విడుదల చేస్తే కార్పొరేట్ కాలేజీలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఎక్కడో ఒకచోట అత్యధిక మార్కులు వచ్చినా, టాప్ టెన్‌లో ర్యాంకు వచ్చినా దానిని రాష్ట్రం మొత్తం రుద్దేసి తల్లిదండ్రులను బహిరంగంగానే బురిడీ కొట్టిస్తున్నాయి. కార్పొరేట్ కాలేజీలు రాకముందు జిల్లాలోని ప్రైవేట్ కాలేజీలు ఫీజులు నామమాత్రంగా వసూలు చేసేవి. కార్పొరేట్ కాలేజీలు అడుగుపెట్టిన తర్వాత ఫీజులను భారీగా పెంచేసుకున్నాయి. కార్పొరేట్ కాలేజీలకు తీసిపోని విధంగా కొన్ని ప్రైవేట్ కాలేజీలు కూడా ఫీజులు భారీగానే దండుకుంటున్నాయి. జిల్లాలో 107 ప్రైవేటు కళాశాలలు.. జిల్లాలో మొత్తం 151 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. అందులో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 33 ఉండగా, ఎయిడెడ్ కాలేజీలు 11ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలు 107 ఉన్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలు దగ్గరకు రాని విధంగా ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు జిల్లాలో పాగా వేశాయి. జిల్లాలో ఇంటర్ చదువుతున్న వారిలో మూడొంతుల మంది ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో ఉన్నారంటే అవి ఏ స్థాయిలో చక్రం తిప్పుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. నాడు విచ్చలవిడిగా అనుమతులు.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల ఏర్పాటుకు 2013 సంవత్సరం నుంచి అప్పటి ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. గతంలో ఉన్న నోటిఫికేషన్ విధానానికి తిలోదకాలు ఇచ్చేసింది. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అయితే ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చేసింది. నిబంధనలకు విరుద్దంగా క్యాంపస్‌లు నిర్వహిస్తున్నప్పటికీ అటువైపు కన్నెత్తి కూడా చూసేది కాదు. చంద్రబాబు మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరించిన విద్యా సంస్థల అధినేత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తమ విద్యా సంస్థల బ్రాంచ్‌లను ఏర్పాటుచేసి విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేయడమే పరమావధిగా పెట్టుకున్నారన్న విమర్శలు బలంగా ఉన్నాయి. జూనియర్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నుంచి శాంక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడం, ఆ తర్వాత వాటి రిపోర్టులను ఆర్ఐఓలకు పంపించడం ఇప్పటి వరకు జరుగుతూ వచ్చింది. గత ప్రభుత్వాలనే మేనేజ్ చేసుకొని ఆర్డర్లు తెచ్చుకున్నవారు తాము నిబంధనలకు లోబడి నిర్వహిస్తున్నామంటూ ఇంటర్ బోర్డు అధికారులపై ఒత్తిళ్లు తీసుకువచ్చి తమకు అనుకూలంగా రిపోర్టులు పంపించుకుంటూ వచ్చారు. ఇక నుంచి ప్రతి జూనియర్ కాలేజీ బోర్డులో సంబంధిత సెంటర్ కోడ్, ఆర్సీ నంబర్, సొసైటీ పేరు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 12 కాలేజీలకు షోకాజు నోటీసులు.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీలలో తనిఖీలు ప్రారంభించిన ఆర్ఐఓ వీవీ సుబ్బారావు ఇప్పటి వరకు 12 జూనియర్ కాలేజీలకు షోకాజు నోటీసులు జారీ చేశారు. పామూరులోని ఒక జూనియర్ కాలేజీకి నోటీసులు ఇవ్వడంతోపాటు రూ.50వేల జరిమానా కట్టించి రాష్ట్రంలోనే ఫైన్ కట్టించిన తొలి ఆర్‌ఐఓగా నిలిచారు. ఇదిలా ఉండగా విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ ఆర్ఐఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలో త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్ఐఓ సుబ్బారావు నేతృత్వంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్స్ సైమన్ విక్టర్, కాశింపీరాలతో కూడిన త్రీమె¯న్ కమిటీ జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీలను తనిఖీచేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోనున్నారు. -
ప్రయివేట్ కాలేజీలకు హైకోర్టు ఆదేశాలు..
సాక్షి, హైదరాబాద్ : పాసైన ఇంటర్ విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లు వారికి తిరిగి ఇవ్వాల్సిందేనని ప్రయివేట్ కళాశాలలకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాగా కొన్ని ప్రయివేట్ కాలేజీలు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా దగ్గర పెట్టుకోవడాన్ని సవాల్ చేస్తూ నికేశ్ అనే విద్యార్థి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు విద్యార్థి ఫీజులు చెల్లించినప్పటికీ కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు దగ్గరుంచుకోవడాన్ని తప్పుబట్టింది. వెంటనే విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని, ఒకవేళ ఫీజులు చెల్లించకపోయినా సర్టిఫికెట్లు విద్యార్థులకు ఇవ్వాల్సిందేనని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సెలవుల్లో యథేచ్ఛగా ఇంటర్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: ‘‘వేసవి సెలవుల్లో ప్రైవేటు జూనియర్ కాలేజీలు ప్రవేశాలు, తరగతులు చేపట్టడానికి వీల్లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం’’అంటూ ఇంటర్మీడియెట్ బోర్డు మార్చి 30న జారీ చేసిన ప్రకటన బుట్టదాఖలైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లోని కార్పొరేట్ కాలేజీలు బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కుతూ యథేచ్ఛగా తరగతులు నిర్వహిస్తున్నాయి. ర్యాంకుల కోసం ఇప్పటి నుంచే విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. సెలవులకు ఇంటికి వెళ్తామని అడిగే విద్యార్థులకు టీసీలు ఇస్తామని బెదిరిస్తున్నాయి. అలాగే పదో తరగతి ఫలితాలు రాకముందే ఇంటర్ ప్రవేశాలకు ఆయా కాలేజీలు తెరలేపాయి. తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ తమ కాలేజీల్లో విద్యార్థులను చేర్పించాలని, అలా చేర్పిస్తే రాయితీ ఇస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నాయి. అప్పటికైతే ఎక్కువ ఫీజు చెల్లించాల్సిందేనంటూ.. తమ కాలేజీల్లో చేరాలంటూ ఫోన్లు చేస్తున్న కాలేజీల ప్రతినిధులు రాయితీలను సాకుగా చూపి అడ్వాన్స్‌లు తీసుకుంటున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ‘ఇప్పుడైతే ఫీజు రాయితీ ఉంటుంది.. ఫలితాలు వచ్చాక చేర్చాలంటే మాత్రం మేం చెప్పినంత చెల్లించాల్సి ఉంటుంది, మీ ఇష్టం..’అంటూ తల్లిదండ్రులను సందిగ్ధంలో పడేస్తున్నారు. ఇప్పుడు సీటు కావాలంటే 2, 3 రోజుల్లో తమ కాలేజీ కార్యాలయాలకు వచ్చి సీట్లు రిజర్వు చేసుకోవాలని చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రులు వారి మాటలను నమ్మి కాలేజీలకు వెళ్లి డబ్బులు చెల్లించేస్తున్నారు. పట్టించుకోని బోర్డు అధికారులు... రాష్ట్రంలో 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా 1,560 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఏటా దాదాపు 4.5 లక్షల మంది విద్యార్థులు చేరుతున్నారు. వారిలో చాలా మంది విద్యార్థులను చేర్చుకునేందుకు కార్పొరేట్ కాలేజీలు ఏజెంట్లను పెట్టుకొని మరీ వ్యవహారం చక్కబెడుతున్నా ఇంటర్ బోర్డు మాత్రం నోరు మెదపడం లేదు. వేసవి సెలవుల్లో ప్రవేశాలు చేపట్టవద్దని ఓ ప్రకటన జారీ చేసి చేతులు దులుపుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్ యాజమాన్యాలు ఇచ్చే మామూళ్ల మత్తులో అధికారులు జోగుతూ ఇలాంటి ఉదంతాలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు యాజమాన్యాల ప్రతినిధుల వద్దకు చేరుతుండటం కూడా పలు సందేహాలకు తావిస్తోంది. పదో తరగతి పరీక్షల విభాగం, ఇంటర్ బోర్డుల నుంచి అనధికారికంగా ఈ వివరాలు బయటకు వెళ్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో రూ. లక్షలు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టిపెడితే ఇంటి దొంగల భరతం పట్టవచ్చన్న వాదనలు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల నుంచి ఫోన్ రాదే.. పదో తరగతి పరీక్షల ప్రారంభం నుంచే తల్లిదండ్రులకు కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల నుంచి ఫోన్లు వెళ్తున్నా.. ప్రభుత్వ కాలేజీల నుంచి మాత్రం అలాంటి చర్యలు చేపడుతున్న దాఖలాలు లేవు. రెండేళ్ల కిందట ఇంటర్ విద్యా జేఏసీ, జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్వర్యంలో ప్రభుత్వ కాలేజీల్లో నమోదును పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈసారి ఆ దిశగా బోర్డు ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదు. మరోవైపు ఇపుడు ప్రైవేటు కాలేజీలు చెప్పే మాయమాటలతో ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులు కూడా ప్రైవేటు కాలేజీల్లోనే తమ పిల్లలను చేర్చేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో జూన్ నాటికి ప్రభుత్వ కాలేజీల్లో చేర్పించేవారు లేకుండాపోతున్నారు. -
434 జూనియర్ కాలేజీల మూత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 434 ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలు జరిగే అవకాశం కనిపించడం లేదు. కనీస సదుపాయాలు లేని కారణంగా ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికే 61 జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపును నిరాకరించగా.. అవసరమైన డాక్యుమెంట్లు అందజేయని మరో 373 కాలేజీలకూ గుర్తింపు నిరాకరించేందుకు రంగం సిద్ధమైంది. అనుబంధ గుర్తింపు కోసం అవసరమైన డాక్యుమెంట్లను అందజేయాలని గత డిసెంబర్ నుంచి ఇంటర్ బోర్డు సూచిస్తున్నా.. ఈ 373 కాలేజీలు డాక్యుమెంట్లను దాఖలు చేయకపోవడం గమనార్హం. ఈనెల 21న జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ కానున్న నేపథ్యంలో.. ఆలోగా సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించిన కాలేజీలకు అనుబంధ గుర్తింపు వస్తుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ పేర్కొన్నారు. ఆ తర్వాత అనుమతి ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. వెబ్సైట్లో ఆయా కాలేజీల జాబితా రాష్ట్రంలోని 1,692 ప్రైవేటు జూనియర్ కాలేజీలు అనుమతుల కోసం ఇంటర్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో ఇప్పటివరకు 1,057 కాలేజీలకు బోర్డు అనుమతి ఇచ్చింది. మరో 61 కాలేజీల్లో తగిన సదుపాయాలు లేవంటూ అనుమతి నిరాకరించింది. ఇక 373 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నా.. అవసరమైన పత్రాలు దాఖలు చేయకపోవడంతో దరఖాస్తులను తిరిగి వెనక్కి పంపించింది. ఇక 103 కాలేజీల దరఖాస్తులు ఇంటర్ బోర్డులో, మరో 98 కాలేజీల దరఖాస్తులు జిల్లాల్లోని కార్యాలయాల్లో ప్రాసెస్‌లో ఉన్నాయి. వీటి ప్రాసెస్‌ను ఈ నెల 20 నాటికి పూర్తి చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. 21న ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేయనుండటంతో... అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితా, గుర్తింపు లేని కాలేజీల జాబితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. హాస్టళ్లకు అనుమతులు తీసుకోకున్నా రాష్ట్రంలో దాదాపు 500కుపైగా జూనియర్ కాలేజీలు హాస్టళ్లతో కలిపి కొనసాగుతున్నాయని ఇంటర్ బోర్డు తేల్చింది. అందులో హాస్టళ్ల నిర్వహణకు అనుమతుల కోసం కేవలం 13 కాలేజీలే దరఖాస్తు చేసుకున్నాయి. మిగతా కాలేజీలేవీ దరఖాస్తు చేసుకోలేదు. హాస్టళ్ల అంశంపై ఇంటర్ బోర్డుకు అధికారం లేదంటూ పలు కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై ఇంకా కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు. అయితే కాలేజీ హాస్టళ్లను నియంత్రించే అధికారం ఇంటర్ బోర్డుకు ఉందని బోర్డు కార్యదర్శి అశోక్ స్పష్టం చేశారు. ఆయా కాలేజీలు తమ హాస్టళ్లకు అనుమతులు తీసుకోకుంటే.. కాలేజీల అనుబంధ గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. -
ఇక రోజూ విజిటింగ్ అవర్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు జూనియర్ కాలేజీ హాస్టళ్ల ఇష్టారాజ్యానికి ఇక చెల్లుచీటీ పడనుంది. హాస్టళ్లలో పాటించాల్సిన నిబంధనలపై ఇంటర్మీడియట్ బోర్డు పంపిన ప్రతిపాదనలను కొన్ని మార్పులతో మంగళవారం ప్రభుత్వం ఆమోదించింది. దీంతో వెంటనే నిబంధనలు అమల్లోకి తెచ్చేందుకు బోర్డు చర్యలు చేపట్టింది. హాస్టళ్లలోని విద్యార్థులను తల్లిదండ్రులు/సంరక్షకులు రోజూ సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు కలిసేలా, అత్యవసరమైతే ఎప్పుడైనా కలిసేందుకు అనుమతిచ్చేలా నిబంధనలు సిద్ధం చేసింది. ప్రతి 50 మందికి 5 బాత్రూమ్లు, 8 టాయిలెట్లు ఉండేలా.. టిఫిన్ సహా 4 పూటల ఆహారం అందించేలా, విద్యార్థుల సంఖ్య ఆధారంగా హాస్టళ్ల గుర్తింపు ఫీజు చెల్లించేలా నిబంధనలు రూపొందించింది. ఏడాదికోసారి ఆడిట్ - హాస్టల్లో ప్రథమ చికిత్స కిట్, అగ్నిమాపక పరికరాలు, రిక్రియేషన్ రూమ్‌లు, రక్షిత తాగునీటి సదుపాయం లేదా ఆర్వో ప్లాంట్లు, సరిపడ వెంటిలేషన్ ఉండాలి. - ప్రతి విద్యార్థికి 50 చదరపు అడుగులు (ఎస్ఎఫ్టీ), ప్రతి 25 మందికి 1,000 ఎస్ఎఫ్టీ ఉండాలి. - ప్రైవేటుతోపాటు, ప్రభుత్వ హాస్టళ్లలోనూ చిన్న గదుల సదుపాయం లేనందున రూంకు ఇద్దరు నిబంధనను ప్రభుత్వం తొలగించింది. - కౌన్సెలింగ్, గైడెన్స్ రూం.. విద్యార్థులకు సరిపడ ఆట స్థలం ఉండాలి. ఉతికిన బట్టలు ఆరబెట్టేందుకు ఖాళీ స్థలం ఉండాలి. - హాస్టల్‌కు సొంత కిచెన్ ఉండాలి. కిచెన్, బాత్రూమ్, టాయిలెట్లు శుభ్రంగా ఉంచాలి. ఫుడ్ ఇన్స్పెక్టర్ జారీ చేసిన ఫుడ్ సేఫ్టీ సర్టిఫికెట్ ఉండాలి. - హాస్టళ్లకు వేరుగా అకౌంట్ నిర్వహించాలి. ఏడాదికోసారి ఆడిటర్‌తో లెక్కలు చేయించి రెన్యువల్ సమయంలో అందజేయాలి. రోజుకు రెండు సార్లు విద్యార్థుల హాజరు - విద్యార్థులకు ప్రతి రోజు టిఫిన్ సహా 4 సార్లు ఆహారం అందించాలి. నిఫుణుల నేతృత్వంలో ఆహారం వండాలి. వార్డెన్ కూడా భోజనం నాణ్యత పరిశీలించాలి. - పోషకాహారం అందించాలి. నెలకోసారి ఆరోగ్య పరీక్షలు చేయించాలి. హాస్టళ్లలో స్టాఫ్ నర్సు ఉండాలి. బాలికల హాస్టల్ అయితే మహిళా నర్సును నియమించాలి. - ఉదయం 7:30 నుంచి 8:30 గంటల వరకు టిఫిన్, మధాహ్నం 12:30 నుంచి 1:30 గంటల వరకు భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు భోజనం పెట్టాలి. - హాస్టళ్లలో కచ్చితంగా రిజిస్టర్ సైకాలజిస్ట్/క్వాలిఫైడ్ కెరీర్ కౌన్సెలర్ ఉండాలి. హాస్టళ్లలో నియమించే సిబ్బందికి పోలీసు క్లియరెన్స్ తీసుకోవాలి. - ప్రతి రోజు రెండుసార్లు విద్యార్థుల హాజరు తీసుకోవాలి. సెలవు కోసం తల్లిదండ్రులు లేఖ రాసి తీసుకెళ్లాలి. - అడ్మిషన్ రిజిస్టర్, విజటర్ బుక్, మెడికల్ రిజిస్టర్, ఫిర్యాదుల రిజిస్టర్ తప్పనిసరిగా ఉండాల్సిందే. - హాస్టల్ యాజమాన్యాలు ఇన్స్పెక్షన్ ఫీజు (కార్పొరేషన్లలో రూ. 80 వేలు, మున్సిపాలిటీలో రూ. 60 వేలు, గ్రామ పంచాయతీలో రూ. 50 వేలు) చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసకోవాలి. - హాస్టల్ నిర్వహణ ఫీజును కార్పొరేషన్లలో రూ. లక్ష, మున్సిపాలిటీ పరిధిలో రూ. 80 వేలు, గ్రామ పంచాయతీల్లో రూ.60 వేల చెల్లించాలి. - ఇవి కాకుండా 50 మంది విద్యార్థులకు రూ. 4 లక్షలు, 50 నుంచి 200 మంది వరకు రూ. 8 లక్షలు, 201 నుంచి 500 వరకు రూ. 12 లక్షలు, 500 మందికంటే ఎక్కువుంటే రూ. 16 లక్షలు డిపాజిట్ చేయాలి. -
పరీక్ష ఫీజుల్లోనూ కక్కుర్తే!
సాక్షి, హైదరాబాద్: నిరుపేద కుటుంబానికి చెందిన వీరేంద్ర తన కొడుకు నీరజ్‌ను అప్పు చేసి మరీ కొద్దిగా పేరున్న ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీలో చేర్పించారు. ఏటా రూ. 30 వేల చొప్పున చెల్లించేందుకు ఒప్పుకున్నారు. ఇప్పుడు పరీక్ష ఫీజు చెల్లించే సమయం వచ్చే సరికి రూ.3 వేలు చెల్లించాలని యాజమాన్యం చెప్పింది. అదేంటి పరీక్ష ఫీజు రూ.450 ఉంటే రూ. 3 వేలు చెల్లించమని అడుగుతున్నారేంటి అని ప్రశ్నిస్తే అది అంతే... చెల్లించాల్సిందేనన్న సమాధానం వచ్చింది. దీంతో గత్యంతరం లేక ఆ మొత్తాన్ని చెల్లించారు. హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగి అయిన సురేష్ తన కొడుకు విజయ్ను బాగా చదివించాలన్న ఆశతో నగరంలోని ఓ కార్పొరేట్ కాలేజీలో గతేడాది ఎంపీసీలో చేర్చించారు. ఇపుడు ఆ విద్యార్థి ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. యాజమాన్యం రూ. 4 వేలు పరీక్ష ఫీజు చెల్లించాలని చెప్పింది. ఇప్పటికే వార్షిక ఫీజుగా రూ. 45 వేలు చెల్లించిన సురేష్.. పరీక్ష ఫీజు అంతెందుకు ఉంటుందని ప్రశ్నిస్తే ‘మీ అబ్బాయి సెకండియర్ కదా... ప్రాక్టికల్స్ ఉంటాయి.. అందుకు ఇతర ఖర్చులుంటాయి.. చెల్లించాల్సిందేనని చెప్పారు. ఏం చేయాలో అర్థంకాక ఆ మొత్తాన్ని చెల్లించారు. ఇలా రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు తమ వసూళ్ల దందాను చివరకు పరీక్ష ఫీజులోనూ కొనసాగి స్తున్నాయి. బోర్డు వార్షిక ఫీజు రూ.1,950 ఉంటే రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్న యాజమాన్యాలు.. పరీక్ష ఫీజుల విషయంలోనూ విద్యార్థుల తల్లిదం డ్రుల నుంచి భారీగా దండుకుంటున్నాయి. బోర్డు నిర్ణీత పరీక్ష ఫీజు కంటే 200 నుంచి 300 రెట్లు వసూలు చేస్తున్నాయి. సాధారణ ప్రైవేటు జూనియర్ కాలేజీలు పరీక్ష ఫీజుకు అదనంగా రూ.1,000 వరకు వసూలు చేస్తుం డగా, పేరున్న ప్రైవేటు కాలేజీలు, కార్పొరేట్ కాలేజీలు రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. నియంత్రణ లేని వ్యవస్థతో అవస్థలు ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో వార్షిక ఫీజులు, పరీక్ష ఫీజుల వసూళ్లలో నియంత్రణ లేకపోవ డంతో యాజమాన్యాలు తల్లిదండ్రులను లూటీ చేస్తున్నాయి. అయినా ఇంటర్ బోర్డు ఫీజుల నియంత్రణపై దృష్టి సారించడం లేదు. ఫలితం గా నిరుపేద ప్రజలు, ప్రైవేటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులు ఫిర్యాదులు చేసినా బోర్డు అధికారులు ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టట్లేదు. రాష్ట్రంలో 406 ప్రభు త్వ జూనియర్ కాలేజీలు ఉండగా, 1,550 ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో మొత్తం 9.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో ప్రైవేటు కాలేజీల్లోనే 7.5 లక్షల మంది చదువుతున్నారు. యాజమాన్యాలు ఇష్టా రాజ్యంగా చేస్తున్న వసూళ్లు ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా మారాయి. అధిక వసూళ్లకు పాల్పడితే చర్యలు తల్లిదండ్రుల ఫిర్యాదులతో యాజమాన్యాలు చేస్తున్న అధిక వసూళ్లపై ఇంటర్ బోర్డు స్పందిం చింది. నిర్ణీత ఫీజు కంటే ఎక్కువ మొత్తం చెల్లించొద్దని సూచించింది. అధిక మొత్తం చెల్లించాలని అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని, అలాంటి కాలేజీలపై చర్యలు తీసుకుంటామంది. ఇవీ బోర్డు నిర్ణయించిన పరీక్ష ఫీజులు ప్రథమ సంవత్సరం ఆర్ట్స్, సైన్స్ విద్యార్థులకు రూ. 450 ద్వితీయ సంవత్సరం ఆర్ట్స్ విద్యార్థులకు రూ. 450 ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు రూ. 610 (రూ. 450 థియరీకి, రూ. 160 ప్రాక్టికల్స్‌కు) ప్రథమ, ద్వితీయ సంవత్సర వొకేషనల్ విద్యార్థులకు (ప్రాక్టికల్స్ కాకుండా అయితే) రూ. 450 ప్రథమ, ద్వితీయ సంవత్సర వొకేషనల్ విద్యార్థులకు (థియరీ రూ. 450, ప్రాక్టికల్స్ రూ. 160) మొత్తంగా రూ. 610. -
ప్రైవేట్ జూనియర్ కాలేజీల ఫీజు పెంపు!
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేట్ జూనియర్ కాలేజీల ఫీజుల పెంపుపై అధికారుల కమిటీ సిఫార్సులను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుం ది. ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై 15 రోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. సోమవారం సచి వాలయంలో ఎస్టీ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రైవేట్ కాలేజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు నరేందర్‌రెడ్డి, జగదీశ్వర్, సతీశ్, వాసుదేవారెడ్డి, సత్యనారాయణ, ప్రభాకర్, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీలకు రూ.16 వేల నుంచి రూ.22 వేల వరకు, సీఈసీ, ఎంఈసీలకు రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు ఫీజులు పెంచాలని ప్రతిని ధులు కోరారు. జూనియర్ కాలేజీలకు ఏ, బీ, సీ, డీ గ్రేడింగ్ ఇచ్చి, పనితీరు, ఫలితాల ప్రాతిపదికన ఫీజును ఖరారు చేస్తే ఎలా ఉంటుందని కమిటీలోని అధికారులు ప్రస్తావించారు. అయితే అన్ని కాలేజీలకు ఒకేలా ఫీజులు పెంచాలని ప్రతినిధులు పేర్కొన్నారు. -
వేటుకు వేళాయే...!
నిబంధనలు ఉల్లంఘించి వేసవి సెలవుల్లోనూ ఇంటర్ తరగతులు వందకుపైగా ప్రైవేటు కళాశాలలకు షాకాజ్ నోటీసులు సిటీబ్యూరో: నిబంధనలను ఉల్లంఘించి తరగతులు కొనసాగిస్తున్న ప్రైవేటు జూనియర్ కళాశాలలపై వేటుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం సెలవులు ప్రకటించినా.. పట్టించుకోకుండా పాఠాలు బోధిస్తున్న యాజమాన్యాలపై అధికారులు కన్నెర్ర చేస్తున్నారు. ఇంటర్ బోర్డు మార్చి 29 నుంచి మే 31 వరకు అన్ని మేనేజ్మెంట్ ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలలకు సెలవులు ప్రకటించింది. సెలవుల్లో తరగతులు నిర్వహించినా, ఎంట్రెన్స్ టెస్ట్‌లకు శిక్షణలు ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అయినా కొన్ని ప్రైవేటు కళాశాలలు బోర్డు ఆదేశాలను పట్టించుకోకుండా యథేచ్ఛగా తరగతులు నిర్వహిస్తున్నాయి. ఎంసెట్, ఏఐఈఈఈ, ఐఐటీ, జిప్మర్ ప్రవేశ పరీక్షలకు కోర్సులు నిర్వహిస్తున్నారు. మరికొన్ని కళాశాలలు మరో అడుగు ముందుకేసి.. విద్యార్థులకు అప్పుడే ద్వితీయ సంవత్సరం పాఠాలను బోధిస్తుండటంతో తనిఖీలకు వెళ్లిన అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు రద్దు..? నిబంధనలు ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తున్న కళాశాలలపై జంట జిల్లాల ఆర్ఐఓ కార్యాలయాలకు ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ కళాశాలలతోపాటు ఓ మోస్తరు స్థాయి కాలేజీలు కూడా తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆయా కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటివరకు జంట జిల్లాలో వందకు పైగా కళాశాలలకు నోటీసులు అందజేయడం విశేషం. శ్రీచైతన్య, నారాయణ, శ్రీగాయత్రి, ఎన్ఆర్ఐ, గౌతం తదితర కళాశాలలు నిబంధనలు ఉల్లంఘించిన జాబితాలో ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో 40, రంగారెడ్డి జిల్లాలో 70 కళాశాలల్లో విద్యార్థులను బయటికి పంపించి నోటీసులు జారీ చేసిన అధికారులు కళాశాలల గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి బోర్డుకు నివేదిక అందజేశారు. ఈ విషయమై రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చాక.. చర్యలు చేపడతామని అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. సెలవులు పూర్తయ్యే వరకు దాడులు కొనసాగుతాయని వారు పేర్కొంటున్నారు. భిన్న వాదనలు... సెలవుల్లో తరగతుల నిర్వహణపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులే స్వయంగా తమ పిల్లలను తరగతులకు పంపుతున్నట్లు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు పేర్కొం టున్నాయి. అలాంటప్పుడు వారికి బోధించాల్సిన బాధ్యత తమపై ఉందని చెబుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్‌తోపాటు ఎంసెట్, ఏఐఈఈఈ, జిప్మర్ ప్రవేశ పరీక్షలకు ఏడాదంతా ఆయా కళాశాలలు శిక్షణ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందుకుగాను తల్లిదండ్రులు రూ.లక్షల్లో ఫీజులను చెల్లించారు. మరి కొన్ని రోజుల్లో ప్రవేశ పరీక్షలు జరగనున్నందున, కీలక సమయంలో కళాశాలలు బంద్ చేస్తే తమ పిల్లలు నష్టపోతారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అధికారుల తనిఖీల నేపథ్యంలో కళాశాలల యాజమాన్యాలు తరగతులు నిర్వహించేందుకు ధైర్యం చేయట్లేదని సమాచారం. -
ఇంటర్ స్పాట్ విధుల బహిష్కరణ
ప్రెవేటు కళాశాల యాజమాన్యాల నిరసన ఆదిలాబాద్ టౌన్ : ప్రైవేటు జూని యర్ కళాశాలల్లో ట్యూషన్ ఫీజుల ను పెంచాలని, పెండింగ్‌లో ఉ న్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తెలంగాణ ప్రైవేటు జూనియర్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియెషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రైవేటు కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్లు ఇంటర్ మూల్యాంకన విధులను బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి స్పాట్ కేంద్రం ఎదుట ధర్నా చేపట్టారు. సాయంత్రం వరకు నిరసన కొనసాగించారు. సమస్యల పరిష్కరానికి ప్రభుత్వం నుంచి హామీ రావడంతో ధర్నా విరమించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణకుమార్ మాట్లాడుతూ, 2014-15 విద్యా సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులకు గురువుతున్నాయని తెలిపారు. స్పాట్ విధులకు హాజరయ్యే ప్రైవేటు కళాశాలల లెక్చరర్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తి రుపతి, కార్యనిర్వహణ కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి భూమేశ్, ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, సంఘ బాధ్యులు పున్నారావు పాల్గొన్నారు.