సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిబంధనలు పాటించని ప్రైవేటు జూనియర్ కాలేజీలపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనలు అతిక్రమించే కాలేజీలపై చర్యలు తప్పవని పేర్కొంది. విద్యా సంస్థల భవనాలు, నిబంధనల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఫైర్ సర్వీ సెస్ డీజీ, హోం సెక్రెటరీ, జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, కళాశాల విద్యాశాఖ, ఇంటర్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. అగ్నిమాపక నిబంధనల ప్రకారం ఎన్ని కాలేజీలు ఉన్నాయి.. ఎన్ని కాలేజీలు లేవు అన్న అంశాలను తేల్చేందుకు ఆ శాఖ తని ఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే గుర్తించిన నిబంధనలు పాటించని కాలేజీలపై ఎందుకు ఆయా శాఖలు చర్యలు చేపట్టడం లేదని చిత్రా రామచంద్రన్ ప్రశ్నించినట్లు తెలిసింది. ఎవరి శాఖ తరఫున వారు నిబంధనలు పాటించని వాటిపై చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు సమాచారం.
హాస్టళ్లు, అకాడమీలు బోర్డు పరిధిలోకి..
అనుమతి లేని హాస్టళ్లు, శిక్షణ సంస్థలు, ఇంటర్మీడియెట్ తరగతులు నిర్వహించే అకాడమీలను ఇంటర్ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని, అవన్ని కచ్చితంగా బోర్డు నుంచి అనుబంధ గుర్తింపు తీసుకోవాలని నిర్ణయించారు. ఇకపై కండిషనల్ అఫిలియేషన్ల విధానం ఉండదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఫైర్ సేఫ్టీ, ఇతర నిబంధనల మేరకు లేని భవనాల నుంచి ఆయా కాలేజీలను ఇతర భవనాల్లోకి తరలించాలని యాజమాన్యాలకు తేల్చి చెప్పాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment