ST Welfare Department
-
పతకాలే లక్ష్యంగా క్రీడా పాఠశాలలు
సాక్షి, అమరావతి: గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసి అత్యుత్తమ శిక్షణ ఇవ్వడం ద్వారా పతకాలు ఒడిసి పట్టేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ప్రతి జిల్లాలో క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలతో కలిసి గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను క్రీడాకారుల కార్ఖానాలుగా మారుస్తోంది. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లాలోని పెదవేగిలో బాలుర, పోలసానపల్లిలో బాలికల గురుకులాల్లో స్పోర్ట్స్ స్కూళ్లు ప్రారంభించింది. ఈ ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా 20కిపైగా క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. సంయుక్త నిర్వహణ గురుకులాలు, ఆదర్శ పాఠశాలలకు అనుబంధంగా ఏర్పాటు చేసే క్రీడా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, క్రీడాకారులకు భోజన, వసతిని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల ద్వారా సమకూర్చనున్నారు. కోచ్‌ల నియామకం, విద్యార్థుల ఎంపిక, శిక్షణ ప్రక్రియలను శాప్ నిర్వహించనుంది. దాదాపు 30 క్రీడాంశాల్లో.. ఒక్కో పాఠశాలలో ఆరు విభాగాల చొప్పున ఏర్పాటు చేసి తర్ఫీదు ఇవ్వనున్నారు. ప్రతిపాదనలు సిద్ధం క్రీడా పాఠశాలల కోసం ఇప్పటివరకు 8 ఎస్సీ గురుకులాలు (వీటిలో రెండింటిని ఇప్పటికే ప్రారంభించారు), 11 ఎస్టీ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను గుర్తించారు. వీటిల్లో ప్లే ఫీల్డ్స్ అభివృద్ధికి రూ.3.92 కోట్లు, క్రీడా పరికరాల కోసం రూ.3 కోట్ల చొప్పున విడివిడిగా ప్రతిపాదనలు రూపొందించారు. వీటితోపాటు సమగ్రశిక్షలో మోడల్ స్కూళ్లు, కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు (కేజీబీవీ), ఏపీ రెసిడెన్షియల్, మైనార్టీ వెల్ఫేర్ పరిధిలో, ప్రత్యేక ప్రతిభావంతులకు కూడా స్పోర్ట్స్ స్కూళ్లను నెలకొల్పేందకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కడప, విజయనగరం జిల్లాల్లో మాత్రమే క్రీడా పాఠశాలలు నడుస్తున్నాయి. వీటిల్లో అన్ని వర్గాల విద్యార్థులకు బ్యాటిల్ టెస్టుల ఆధారంగా.. మెరిట్ సాధించిన వారికి సీట్లు కేటాయిస్తున్నారు. క్రీడా పాఠశాలలు ఇలా.. ఎస్సీ గురుకులాలు: పెదవేగిలో బాలుర, పోలసానపల్లిలో బాలికల గురుకులాల్లో క్రీడా పాఠశాలలు మొదలయ్యాయి. ఇంకా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల (బాలికలు), విజయనగరం జిల్లా కొప్పెర్ల (బాలురు), కృష్ణాజిల్లా కృష్ణారావుపాలెం (బాలురు), కుంటముక్కల (బాలికలు), వైఎస్సార్ జిల్లా పులివెందుల (గండిక్షేత్రం–బాలురు), కర్నూలు జిల్లా డోన్ (బాలికలు)లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఎస్టీ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలు: శ్రీకాకుళం జిల్లా సీతంపేట (బాలురు), విజయనగరం జిల్లా భద్రగిరి (బాలికలు), విశాఖ జిల్లా చింతపల్లి (బాలురు), తూర్పుగోదావరి జిల్లా ముసురుమల్లి (బాలురు), గంగవరం (బాలికలు), పశ్చిమగోదావరి జిల్లా రాజానగర్ (బాలికలు), వైఎస్సార్ జిల్లా రాయచోటి (బాలికలు), ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం (బాలురు), చిత్తూరు జిల్లా రేణిగుంట (బాలురు), అనంతపురం జిల్లా గొల్లలదొడ్డి (బాలురు), కర్నూలు జిల్లా మహానంది (బాలికలు)లలో ఏర్పాటు చేయనున్నారు. క్రీడా విజయానికి నాంది రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధిలో భాగంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలకు అనుబంధంగా స్పోర్ట్స్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు స్కూళ్లను ప్రారంభించాం. గ్రామీణ స్థాయి క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసి.. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేదిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇది క్రీడా విజయానికి నాంది పలుకుతుంది. శాప్‌లో అనుభవజ్ఞులైన కోచ్‌లు ఉన్నారు. వారిని మరింత సమర్థంగా ఉపయోగించుకుని మెరుగైన ఫలితాలు సాధిస్తాం. – ఎన్.ప్రభాకరరెడ్డి, ఎండీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ -
‘వసతి పాట్లు’పై నిశిత దృష్టి
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో నెలకొన్న ప్రధాన సమస్యలపై సత్వరమే స్పందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వసతిగృహాల వారీగా తక్షణ అవసరాలపై నివేదికలు కోరింది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల మొదటి వారం నుంచి సంక్షేమ వసతిగృహాలు పునఃప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో విద్యార్థులు వచ్చేనాటికి ప్రధాన సమస్యలు పరిష్కరించాలని, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టడం, చిన్నపాటి నిర్మాణాలు పూర్తి చేయడం వంటి వాటికి ప్రాధాన్యతనిస్తోంది. ప్రాధాన్యతా క్రమంలో ప్రతిపాదనలు... సంక్షేమ వసతిగృహాల్లో సమస్యలపై జిల్లా స్థాయిలో ప్రతిపాదనలు సమర్పించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖలు సూచించాయి. ఈ మేరకు జిల్లా సంక్షేమ అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి.ప్రత్యేక ఫార్మాట్‌ను తయారు చేసిన అధికారులు...ఆమేరకు వివరాలు పంపాలని, వసతిగృహాల్లో విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో ప్రణాళికలు తయారు చేయాలని స్పష్టం చేశాయి. జిల్లాల వారీ ప్రతిపాదనలు ఈనెల 20వ తేదీలోగా రాష్ట్ర కార్యాలయానికి సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. వసతి గృహాల్లో ప్రధానంగా విద్యుత్, నీటిసరఫరా, డ్రైనేజీ వ్యవస్థకు చెందిన సమస్యలున్నాయి. వీటితోపాటు దీర్ఘకాలికంగా పెయింటింగ్ వేయకపోవడంతో భవనాలు పాతవాటిలా కనిపిస్తున్నాయి. తాజా ప్రతిపాదనల్లో వీటికి సైతం ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. శాశ్వత భవనాల్లోని పనులకు రూ.25 కోట్లు అవసరమని అంచనా.. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 1850 వసతిగృహాలున్నాయి. వీటిలో దాదాపు 280 హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ముందుగా శాశ్వత భవనాలకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అక్కడి సమస్యలను ప్రస్తావిస్తూ ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. అదేవిధంగా అద్దె భవనాల్లోని హాస్టళ్లకు మాత్రం యజమానితో సంప్రదింపులు జరిపి రంగులు, విద్యుత్ సమస్యను పరిష్కరించాలని, నీటి సరఫరా, డ్రైనేజీ పనులకు మాత్రం ప్రభుత్వం నుంచి సాయం అందించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. శాశ్వత భవనాల్లో పనులకు దాదాపు రూ.25కోట్లు అవసరమవుతుందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.ఈనెల 20లోపు జిల్లా స్థాయి ప్రతిపాదనలు వచ్చిన వెంటనే వాటి ఆధారంగా రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యతా క్రమంలో తక్షణ అవసరాలకు తగినట్లు రాష్ట్ర కార్యాలయ అధికారులు ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తారు. నెలాఖరులోగా దానికి ప్రభుత్వ ఆమోదం లభిస్తే జూన్ రెండో వారం కల్లా పనులు పూర్తి చేయనున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
పాఠశాల స్థాయిలోనే కంప్యూటర్ విద్య
ఎస్టీ సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్ సాక్షి, హైదరాబాద్: గిరిజనులకు పాఠశాల స్థాయిలోనే కంప్యూటర్ విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్టీ సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆదేశించారు. ఎస్టీ విద్యాసంస్థల బలోపేతంతో పాటు, అదనపు సౌకర్యాల కల్పనకు రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. విద్యాసంవత్సరం మొదలయ్యే నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు, ఇతర సదుపాయాలను కల్పించనున్నట్లు తెలియజేశారు. మంగళవారం సచివాలయంలో గిరిజన ఉప ప్రణాళిక అమలు తీరును మంత్రి సమీక్షించారు. సబ్‌ప్లాన్ లక్ష్యాలను సాధించేందుకు ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి అన్ని విభాగాలను సమీక్షిస్తామన్నారు. ఇందుకు తగినట్లుగా ఫలితాలను సాధించలేకపోతే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గిరిజన సబ్‌ప్లాన్‌లో వ్యక్తిగత ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల పేర్లను తమ శాఖ వెబ్సైట్లో ఉంచాలని, ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. గిరిజన తండాలకు రోడ్ల కల్పనకు పంచాయతీరాజ్‌శాఖ ద్వారా రూ.230 కోట్లు, గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రూ.145 కోట్లు ఖర్చుచేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామలక్ష్మణ్, ఎస్టీ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్, కమిషనర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. -
ఆధునిక వ్యవసాయంపై గిరిజనులకు బాసట
♦ ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో అధ్యయనానికి అవకాశం ♦ గిరిజన రైతుల ఆదాయం పెంపు దిశలో సర్కారు తోడ్పాటు ♦ కొత్త పథకాన్ని ప్రతిపాదించిన ఎస్టీ సంక్షేమ శాఖ సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాల్లో అనుసరిస్తున్న శాస్త్ర, సాంకేతిక పద్ధతులపై రాష్ట్రానికి చెందిన గిరిజన రైతులు, యువకులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పద్ధతులను స్వయంగా తెలుసుకుని అధ్యయనం చేయడానికి వారికి అవకాశం కల్పించనున్నారు. ఇందులో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాల సందర్శనకు వెయ్యి మందికి, విదేశాల్లో అధ్యయనానికి వంద మందికి (ఎక్స్పోజర్ విజిట్స్‌కు) అవకాశం లభించనుంది. ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాల్లో అనుసరిస్తున్న ఆధునిక విధానాలను ఇక్కడ కూడా అమలు చేస్తే వ్యవసాయం, పశుపోషణ, ఉద్యానవన పంటలు, కుటీర పరిశ్రమల ద్వారా ఇక్కడి గిరిజన రైతులు కూడా మంచి ఆదాయాన్ని పొందడానికి ఈ పర్యటనలు తోడ్పడతాయని ఎస్టీశాఖ సంక్షేమశాఖ భావిస్తోంది. దీనికోసం గిరిజనసంక్షేమశాఖ శాసనసభకు సమర్పించిన 2016-17 బడ్జెట్ ఫలితాల వివరణలో రూ.30 కోట్లతో ఈ పథకాన్ని ప్రతిపాదించింది. గిరిజనులకు కొత్త శాస్త్ర, సాంకేతిక వ్యవసాయ పద్ధతులను పరిచయం చేయడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచే దిశలో ఈ పథకాన్ని రూపొందించినట్టు ఎస్టీ సంక్షేమ శాఖ తెలిపింది. ఈపథకంతో పాటు ఇతరత్రా అంశాలపై 2016-17 బడ్జెట్ ఫలితాల వివరణలో ఆయా ప్రతిపాదనలతో పాటు కొన్నింటికి ఎస్టీశాఖ కేటాయింపులు చేసింది. ఇందులో భాగంగా ఎస్టీలకు సుస్థిరమైన సాగు పరిస్థితులను కల్పించేందుకు గిరిజన రైతులు, ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం బడ్జెట్లో రూ. 10 కోట్లను ప్రతిపాదించారు. అదేవిధంగా రాష్ర్టంలోని పదిజిల్లాల్లో గిరిజన భవనాలు/ సముదాయాలు నిర్మించనున్నారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించారు. అలాగే అత్యవసర సమయాల్లో గిరిజన కుటుంబాలను ఆదుకునేందుకు ‘గిరిజన పరిహార మూలధనం’ పథకం కింద బడ్జెట్లో రూ.2 కోట్లకు ఎస్టీశాఖ ప్రతిపాదనలు సమర్పించింది. గిరిజనులను ఆస్పత్రులకు తరలించడం, మందుల కొనుగోలు వంటి వాటికి సాయం అందజేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇక గిరిజన గ్రామాలను పట్టణాలతో అనుసంధానించడానికి రోడ్ల విస్తరణ, ఇతర మౌలిక సదుపాయాలకోసం రూ. 250 కోట్లను ఎస్టీ శాఖ ప్రతిపాదించింది. మూడేళ్లలో ఈ పనులను పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందించింది. ప్రధానంగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ ఐటీడీఏల పరిధిలో ఈ పనులను చేపడతారు. -
ఎస్టీ విద్యార్థినులకు కొత్తగా 4 డిగ్రీ కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: గిరిజన బాలికల్లో అక్షరాస్యతను పెంచేందుకు ఎస్టీ సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. రాష్ర్టంలో గిరిజన విద్యార్థినుల కోసం కొత్తగా నాలుగు డిగ్రీ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ రూపొందించిన ప్రతిపాదనలకు ఎస్టీ గురుకుల సంస్థల బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆమోదముద్ర వేసింది. వీటిని ప్రభుత్వానికి పంపించాలని నిర్ణయించింది. ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, పలువురు ఎమ్మెల్యేల వినతుల మేరకు గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో ఈ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయాలని ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ప్రతిపాదించింది. ఖమ్మం జిల్లాలో 7.65 లక్షల ఎస్టీల జనాభాకుగాను బాలికల కోసం 4 జూనియర్ కాలేజీలుండగా, మహిళల అక్షరాస్యత 43 శాతంగా ఉంది. వరంగల్ జిల్లాలో 5.3 లక్షల గిరిజనులుండగా, 4 జూనియర్ కాలేజీలున్నాయి. మహిళల అక్షరాస్యత 39 శాతంగా ఉంది. ఆదిలాబాద్‌లో 3 జూనియర్ కాలేజీలుండగా, అక్కడ దాదాపు 5 లక్షల గిరిజనులు నివసిస్తున్నారు. మహిళల అక్షరాస్యత 41 శాతంగా ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో 3.6 లక్షల మంది గిరిజనులుండగా, 2 జూనియర్ కాలేజీలున్నాయి. మహిళల అక్షరాస్యత 30 శాతంగా ఉంది. జూనియర్ కాలేజీలుగా 4 గురుకుల పాఠశాలలు మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి, కల్వకుర్తి, వరంగల్ జిల్లా కొత్తగూడ, నల్లగొండ జిల్లా తుంగతుర్తిలోని బాలికల గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ఎస్టీ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించనుంది. వీటిల్లో జూనియర్ కాలేజీ సెక్షన్లను ప్రారంభించాల్సిందిగా మంత్రి అజ్మీరా చందూలాల్ చేసిన విజ్ఞప్తి మేరకు 2015-16లో జూనియర్ కాలేజీ తరగతులను ప్రారంభిం చారు. ఈ నేపథ్యంలో ఆ కాలేజీల ప్రారంభానికి అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని ఎస్టీ శాఖ, ఎస్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీలు విజ్ఞప్తి చేయనున్నాయి. 160 మందికి సివిల్స్ లాంగ్‌టర్మ్ కోచింగ్ ఎస్టీ గురుకులాల్లో 9వ తరగతి నుంచే సివిల్ సర్వీసెస్‌కు లాంగ్‌టర్మ్ కోచింగ్‌ను ఇవ్వాలని ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ నిర్ణయించింది. ప్రతి ఏడాది 160 మంది విద్యార్థులకు సివిల్స్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నారు. దీనిలో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రత్యేక శిక్షణను ఇస్తారు. 9, 10, ఇంటర్ చదివే విద్యార్థులకు వేసవి సెలవుల్లోనూ ఈ శిక్షణను కొనసాగిస్తారు. -
ఉన్నత విద్యనభ్యసించే ఎస్టీలకు రూ.50 వేలు
ఎస్టీ గురుకుల సొసైటీ సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: మెడిసిన్, ఐఐటీతో పాటు ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశం సాధించే ఎస్టీ విద్యార్థులకు రూ.50వేల నగదు పురస్కారం, ల్యాప్‌టాప్‌ను ఇవ్వనున్నారు. ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ విద్యార్థులకు ప్రోత్సాహకంగా వీటిని అంది స్తారు. సొసైటీ పాలక మండలి అధ్యక్షుడు, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఈ మేరకు నిర్ణయించారు. పాఠశాల విద్యా శాఖ నిధులతో నిర్వహించే 9 ఎస్టీ గురుకుల పాఠశాలలు, ఇంటర్ బోర్డు నిధులతో ప్రారంభించిన 2 జూనియర్ కళాశాలలను సంస్థ నాన్‌ప్లాన్ స్కీమ్ కిందకు తీసుకొచ్చేందుకు ఆమోదించారు. విద్యార్థుల పురోగతిపై తల్లితండ్రులకు ఎస్ఎంఎస్ల ద్వారా తెలియజేయాలని, అన్ని పాఠశాలల్లో క్రమం తప్పకుండా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి విద్యాభివృద్ధిపై సమీక్షించాలని మంత్రి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో జరిగిన ఎస్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసై టీ తొలి పాలక మండలి సమావేశంలో కొన్ని ప్రతిపాదనలను ఆమోదించారు. పాలక మండ లి సభ్యులైన ఎస్టీ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్, కమిషనర్ లక్ష్మణ్, పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ జి.కిషన్, ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. నూతన పాలకమండలి, 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ.123 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించారు. బాలికల పాఠశాలల్లో వారి భద్రతకు ఇద్దరేసి సెక్యూరిటీ గార్డుల నియామకం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని తీర్మానించారు. -
‘స్మార్ట్’గా సంక్షేమం
♦ పథకాల లబ్ధిదారులకు స్మార్ట్ ఫోన్లు ♦ యూనిట్ల పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ♦ ఎస్టీ, బీసీ శాఖ ముఖ్యకార్యదర్శి వినూత్న ఆలోచన సాక్షి, హైదరాబాద్: వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన లబ్ధిదారులకు త్వరలోనే స్మార్ట్ ఫోన్ల యోగం పట్టనుంది. సంక్షేమ పథకాల కింద రుణాలతో పాటు ఫోన్లు కూడా ఇచ్చే సరికొత్త పథకం త్వరలోనే అమల్లోకి రానుంది. తద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, పథకాలు ఏ విధంగా సాగుతున్నాయనే దానిని ఆయా సంక్షేమ శాఖల ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2016-17) నుంచి రాష్ట్ర వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖల ద్వారా అమలుచేయనున్న స్వయం ఉపాధి పథకాల్లో ఫోన్లను కూడా భాగం చేయనున్నారు. ఇందు కోసం ఆర్థిక స్వావలంబన పథకాల్లో విడిగా కొంత మొత్తాన్ని కేటాయించనున్నారు. లబ్ధిదారుల్లో అంకితభావం పెంపొందించడంతో పాటు, తాము చేపట్టబోయే స్వయం ఉపాధి పథకాలను వారు పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా దీనికి రూపకల్పన చేస్తున్నారు. స్వయం ఉపాధి పథకాల లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాగానే, వారు నిర్వహించనున్న యూనిట్లు, ఉపాధి చర్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహనను కల్పించేందుకు శిక్షణ, వాట్సప్, జీపీఎస్, ఇంటర్నెట్ సౌకర్యాలతో లబ్ధిదారులకు స్మార్ట్ ఫోన్లు అందిస్తారు. ఈ క్రమంలో రాష్ర్టస్థాయిలో పర్యవేక్షణకు పరిమితమైన స్టాఫ్‌తో కాల్ సెంటర్, జిల్లా స్థాయిలో ఈ పథకాల పర్యవేక్షణకు విడిగా హ్యాండ్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఇందుకోసం ఈ పథకాల అమల్లో మూడు శాతం నిధులను కేటాయిస్తాయి. నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం ఈ పథకాల లబ్ధిదారులే ఎప్పటికప్పుడు తమ యూనిట్ల పరిస్థితి, పురోగతిపై ఫొటోలు తీసి వాట్సప్‌లో పెట్టేలా చూడాలనే ఆలోచనతో ఆయా శాఖలున్నాయి. ఎస్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతను నిర్వహిస్తున్న సోమేశ్‌కుమార్ ప్రత్యేకంగా ఈ అంశాలను పొందుపరుస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా స్వయం ఉపాధి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఒక కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఈ అంశాలను చేర్చడం ద్వారా వారిలో నిబద్ధతతో పాటు, జవాబుదారీతనం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా లబ్ధిదారుల చొరవ, అభిరుచులను తెలుసుకొని, పథకాల పర్యవేక్షణకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇది మంచి ఫలితం ఇస్తుందని, తద్వారా ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా, నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని అధికారులు విశ్వసిస్తున్నారు. -
సంక్షేమం వాయిదా
నల్లగొండ : జిల్లా సంక్షేమ శాఖల పథకాలను అమలు చేయడంలో వాయిదాల పర్వం కొనసాగుతూ వస్తోంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో వచ్చి పడుతున్న సమస్యలు..పథకాల అమలుకు మోకాలడ్డుతూనే ఉన్నాయి. రాష్ట్ర విభజనకు ముందు ఖరారు చేసిన వార్షిక ప్రణాళిక..కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ ఆమోదముద్ర వేసిన ఈ ఏడాది ప్రణాళిక...ఈ రెండు కూడా ప్రజలకు చేరకుండానే అర్థాంతరంగా ఆగిపోయాయి. ప్రతి ఏడాది బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల వార్షిక ప్రణాళిక మే, జూన్‌లో ఖరారు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ చివరి నాటికి గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేస్తారు. ఎంపికైన లబ్ధిదారుల జాబితా జిల్లా కార్యాలయాలకు నవంబర్, డిసెంబర్లో వస్తుంది. అదే నెలల్లో అధికారులు అర్హులైన లబ్ధిదారుల పేరుమీద మంజూరు లేఖలు బ్యాంకులకు పంపుతారు. బ్యాంకర్లు మార్చిలోగా పథకాల గ్రౌండింగ్ పూర్తిచేస్తారు. ఇంకా ఏమైన మిగిలి ఉంటే వాటిని మరుసటి ఏడాదికి తీసుకుంటారు. ఈ విధానం అంతా కూడా రెండేళ్ల క్రితం వరకు సజావుగానే సాగింది. కానీ గడిచిన రెండు సంవత్సరాల వార్షిక ప్రణాళిక అమలే అస్తవ్యస్తంగా తయారైంది. ఓట్లు దండుకునే ప్రయత్నంలో... 2012-13 సంవత్సరానికి గాను ఖరారు చేసిన వార్షిక ప్రణాళికను 2013 డిసెంబర్లో మార్చేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వం లబ్ధిపొందాలన్న ఉద్దేశంతో ఖరారు చేసిన ప్రణాళికను రద్దు చేశారు. కొత్తగా జీఓ నెం.101 జారీ చేశారు. దీని ప్రకారం పథకాల లబ్ధిదారుల వయోపరిమితి 21-45 ఏళ్లకు పెంచారు. గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయకుండా...గ్రామాల్లో రాజకీయ నాయకుల భాగస్వామ్యంతో లబ్ధిదారులను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని మెలిక పెట్టారు. నాటి ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలన్న దురాశతో కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ప్రణాళిక అమలు ఆలస్యమైంది. జనవరిలో కొత్త ప్లాన్ తెరమీదకు తీసుకొచ్చి, మూడు మాసాల్లో దానిని పూర్తిచేయాలని ఆదేశాలు ఉండటంతో అధికారులు ఆగమేఘాల మీద లబ్ధిదారులను అయినకాడికి గుర్తించారు. కానీ మున్సిపల్, సాధారణ ఎన్నికల కోడ్ మార్చి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో పథకాలను గ్రౌండింగ్ చేయకుండా ఆపేయాల్సి వచ్చింది. పర్యవసానంగా 2012-13కు సంబంధించిన వార్షిక ప్రణాళిక ఎన్నికల తర్వాత అమలు చేద్దామంటే కొత్తగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అంచనాలు తారుమారయ్యాయి. దీంతో గతేడాది లబ్ధిదారులను గుర్తించి, మంజూరు ఇచ్చిన యూనిట్లు ప్రజలకు చేరకుండానే కాగితాలకే పరిమితయ్యాయి. పాతవాటికి సంబంధించి నిర్ణయం తీసుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తూ వచ్చింది. ఎన్నికల కోడ్ కంటే ముందు మంజూరు ఇచ్చి...బ్యాంకు ఖాతాలు తీసుకున్న వారి కి సబ్సిడీ విడుదల చేయాలని ప్రభుత్వం గత నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లెక్కన 2012-13 సంవత్సరంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల నుంచి వివిధ పథకాల కింద 4, 768 మంది లబ్ధిదారులకు గాను కేవలం 2,625 మంది మాత్రమే బ్యాంకు ఖాతాలు తెరిచారు. మిగిలిన 2143 మందికి సంక్షేమ శాఖల నుంచి సాయం అందనట్లే. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా ఆ రెండు వేల మందికి పథకాలు గ్రౌండింగ్ చేసే అవకాశం లేదు. కొత్త ప్లాన్‌కు ‘ఎమ్మెల్సీ’ ఎన్నికల బ్రేక్... 2014-15 వార్షిక ప్రణాళిక గతేడాది మేలో ఖరారు కావాల్సి ఉండగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల జోలికి పోలేదు. పథకాల విధానాల్లో మార్పులు తీసుకురావాలన్న ఉద్దేశంతో కాలాతీతం చేస్తూ వచ్చింది. బీసీ, ఎస్టీ శాఖల ప్రణాళిక ఈ నెల మొదటి వారంలో ప్రభుత్వం ఆమోదించగా...ఎస్సీ ప్రణాళిక మూడు రోజుల క్రితం జిల్లాకు చేరింది. కొత్త ప్లానింగ్‌లో లబ్ధిదారుల వయోపరిమితి 21-55 ఏళ్లకు పెంచారు. దీంతోపాటు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ లక్ష రూపాయలకు పెంచారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌తో ముగియనుంది. ఇంత స్వల్ప వ్యవధిలో గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేయడం అధికారులకు కత్తిమీద సాములాంటింది. వీటిన్నింటినీ పక్కకు పెడితే తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మార్చి నెలాఖరు వరకు కోడ్ అమల్లో ఉంటుంది. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది. ఈ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన పక్షంలో ఏప్రిల్ నెలాఖరు వరకు కొనసాగుతుంది. అప్పటి వరకు సంక్షేమ పథకాలకు సంబంధించి గ్రామసభలు నిర్వహించడం గానీ, లబ్ధిదారుల ఎంపిక కానీ చేయకూడదు. దీనిని బట్టి చూస్తే ఈ ఏడాది వార్షిక ప్రణాళిక కూడా అటకెక్కినట్లే..! ఆర్థిక సంవత్సరంలో ఆరంభంలో ప్రారంభం కావాల్సిన సంక్షేమ పథకాల వార్షిక ప్రణాళిక ఆర్ధిక సంవత్సరం మూడు మాసాల్లో ముగస్తుందనంగా ఆమోదించి ఆచరణలోకి తీసుకరావడం అనేది పథకాలనే నమ్ముకున్న పేద, మధ్య తరగతి ప్రజలను వంచించడమే అవుతుంది..