ఆధునిక వ్యవసాయంపై గిరిజనులకు బాసట
♦ ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో అధ్యయనానికి అవకాశం
♦ గిరిజన రైతుల ఆదాయం పెంపు దిశలో సర్కారు తోడ్పాటు
♦ కొత్త పథకాన్ని ప్రతిపాదించిన ఎస్టీ సంక్షేమ శాఖ
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాల్లో అనుసరిస్తున్న శాస్త్ర, సాంకేతిక పద్ధతులపై రాష్ట్రానికి చెందిన గిరిజన రైతులు, యువకులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పద్ధతులను స్వయంగా తెలుసుకుని అధ్యయనం చేయడానికి వారికి అవకాశం కల్పించనున్నారు. ఇందులో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాల సందర్శనకు వెయ్యి మందికి, విదేశాల్లో అధ్యయనానికి వంద మందికి (ఎక్స్‌పోజర్ విజిట్స్‌కు) అవకాశం లభించనుంది.
ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాల్లో అనుసరిస్తున్న ఆధునిక విధానాలను ఇక్కడ కూడా అమలు చేస్తే వ్యవసాయం, పశుపోషణ, ఉద్యానవన పంటలు, కుటీర పరిశ్రమల ద్వారా ఇక్కడి గిరిజన రైతులు కూడా మంచి ఆదాయాన్ని పొందడానికి ఈ పర్యటనలు తోడ్పడతాయని ఎస్టీశాఖ సంక్షేమశాఖ భావిస్తోంది. దీనికోసం గిరిజనసంక్షేమశాఖ శాసనసభకు సమర్పించిన 2016-17 బడ్జెట్ ఫలితాల వివరణలో రూ.30 కోట్లతో ఈ పథకాన్ని ప్రతిపాదించింది. గిరిజనులకు కొత్త శాస్త్ర, సాంకేతిక వ్యవసాయ పద్ధతులను పరిచయం చేయడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచే దిశలో ఈ పథకాన్ని రూపొందించినట్టు ఎస్టీ సంక్షేమ శాఖ తెలిపింది.
ఈపథకంతో పాటు ఇతరత్రా అంశాలపై 2016-17 బడ్జెట్ ఫలితాల వివరణలో ఆయా ప్రతిపాదనలతో పాటు కొన్నింటికి ఎస్టీశాఖ కేటాయింపులు చేసింది. ఇందులో భాగంగా ఎస్టీలకు సుస్థిరమైన సాగు పరిస్థితులను కల్పించేందుకు గిరిజన రైతులు, ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం బడ్జెట్‌లో రూ. 10 కోట్లను ప్రతిపాదించారు. అదేవిధంగా రాష్ర్టంలోని పదిజిల్లాల్లో గిరిజన భవనాలు/ సముదాయాలు నిర్మించనున్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించారు.
అలాగే అత్యవసర సమయాల్లో గిరిజన కుటుంబాలను ఆదుకునేందుకు ‘గిరిజన పరిహార మూలధనం’ పథకం కింద బడ్జెట్‌లో రూ.2 కోట్లకు ఎస్టీశాఖ ప్రతిపాదనలు సమర్పించింది. గిరిజనులను ఆస్పత్రులకు తరలించడం, మందుల కొనుగోలు వంటి వాటికి సాయం అందజేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇక గిరిజన గ్రామాలను పట్టణాలతో అనుసంధానించడానికి రోడ్ల విస్తరణ, ఇతర మౌలిక సదుపాయాలకోసం రూ. 250 కోట్లను ఎస్టీ శాఖ ప్రతిపాదించింది. మూడేళ్లలో ఈ పనులను పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందించింది. ప్రధానంగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ ఐటీడీఏల పరిధిలో ఈ పనులను చేపడతారు.