‘స్మార్ట్’గా సంక్షేమం
♦ పథకాల లబ్ధిదారులకు స్మార్ట్ ఫోన్లు
♦ యూనిట్ల పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ
♦ ఎస్టీ, బీసీ శాఖ ముఖ్యకార్యదర్శి వినూత్న ఆలోచన
సాక్షి, హైదరాబాద్: వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన లబ్ధిదారులకు త్వరలోనే స్మార్ట్ ఫోన్ల యోగం పట్టనుంది. సంక్షేమ పథకాల కింద రుణాలతో పాటు ఫోన్లు కూడా ఇచ్చే సరికొత్త పథకం త్వరలోనే అమల్లోకి రానుంది. తద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, పథకాలు ఏ విధంగా సాగుతున్నాయనే దానిని ఆయా సంక్షేమ శాఖల ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2016-17) నుంచి రాష్ట్ర వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖల ద్వారా అమలుచేయనున్న స్వయం ఉపాధి పథకాల్లో ఫోన్లను కూడా భాగం చేయనున్నారు.
ఇందు కోసం ఆర్థిక స్వావలంబన పథకాల్లో విడిగా కొంత మొత్తాన్ని కేటాయించనున్నారు. లబ్ధిదారుల్లో అంకితభావం పెంపొందించడంతో పాటు, తాము చేపట్టబోయే స్వయం ఉపాధి పథకాలను వారు పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా దీనికి రూపకల్పన చేస్తున్నారు. స్వయం ఉపాధి పథకాల లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాగానే, వారు నిర్వహించనున్న యూనిట్లు, ఉపాధి చర్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహనను కల్పించేందుకు శిక్షణ, వాట్సప్, జీపీఎస్, ఇంటర్‌నెట్ సౌకర్యాలతో లబ్ధిదారులకు స్మార్ట్ ఫోన్లు అందిస్తారు. ఈ క్రమంలో రాష్ర్టస్థాయిలో పర్యవేక్షణకు పరిమితమైన స్టాఫ్‌తో కాల్ సెంటర్, జిల్లా స్థాయిలో ఈ పథకాల పర్యవేక్షణకు విడిగా హ్యాండ్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఇందుకోసం ఈ పథకాల అమల్లో మూడు శాతం నిధులను కేటాయిస్తాయి.
నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం
ఈ పథకాల లబ్ధిదారులే ఎప్పటికప్పుడు తమ యూనిట్ల పరిస్థితి, పురోగతిపై ఫొటోలు తీసి వాట్సప్‌లో పెట్టేలా చూడాలనే ఆలోచనతో ఆయా శాఖలున్నాయి. ఎస్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతను నిర్వహిస్తున్న సోమేశ్‌కుమార్ ప్రత్యేకంగా ఈ అంశాలను పొందుపరుస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా స్వయం ఉపాధి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఒక కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఈ అంశాలను చేర్చడం ద్వారా వారిలో నిబద్ధతతో పాటు, జవాబుదారీతనం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా లబ్ధిదారుల చొరవ, అభిరుచులను తెలుసుకొని, పథకాల పర్యవేక్షణకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇది మంచి ఫలితం ఇస్తుందని, తద్వారా ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా, నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని అధికారులు విశ్వసిస్తున్నారు.