బీసీ సంక్షేమశాఖలో బకాయిలు రూ.100 కోట్లకుపైనే..
2024–25 వార్షికబడ్జెట్‌లో ఈ పథకానికి రూ.80 కోట్ల కేటాయింపు
నాలుగేళ్లుగా బిల్లులన్నీ పెండింగ్‌లోనే..
నల్లగొండ జిల్లాకు చెందిన స్వాతి (పేరుమార్చాం) 2019–20 సంవత్సరంలో విద్యానిధి పథకానికి అర్హత సాధించి అమెరికాకు వెళ్లి ఎంఎస్ చేసింది. మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు అన్నీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి అధికారులను పలుమార్లు సంప్రదిస్తే తొలివిడత సాయం కింద రూ.10 లక్షలు అందాయి. రెండో సంవత్సరం కోర్సు పూర్తి చేసి దాదాపు మూడు సంవత్సరాలు కావొస్తున్నా ఇప్పటివరకు రెండో విడత సాయం రూ.10 లక్షలు ఇంకా అందలేదు. ఇప్పటివరకు దాదాపు ఇరవైసార్లు బీసీ సంక్షేమ శాఖ అధికారుల చుట్టూ తిరిగినా, ఎప్పుడిస్తారనే దానిపై సరైన సమాధానం రాలేదు.
సాక్షి, హైదరాబాద్: విదేశీ విద్యానిధి బకాయిల చెల్లింపులపై నీలినీడలు కమ్ముకున్నాయి. బకాయిలు రూ.100 కోట్లకు పైగా ఉండగా, ఈ బడ్జెట్‌లో కేవలం రూ.80 కోట్లే కేటాయించారు. దీంతో బకాయిల చెల్లింపుల ప్రక్రియ అటకెక్కినట్టేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం కింద అర్హత సాధించి విదేశాలకు వెళ్లి కోర్సు పూర్తి చేసినా, ఆ విద్యార్థులకు ఇంకా రెండోవిడత ఆర్థికసాయం అందనే లేదు. 2019–20 వార్షిక సంవత్సరం నుంచి విద్యానిధి నిధుల విడుదల నెమ్మదించింది. దీంతో బీసీ సంక్షేమశాఖ తనవద్ద ఉన్న నిధుల లభ్యతకు అనుగుణంగా విద్యార్థులకు మొదటివిడత సాయాన్ని అందిస్తూ రాగా... క్రమంగా రెండోవిడత సాయం అందలేదు. కోర్సు పూర్తి చేసి సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం రెండోవిడత ఇవ్వకపోవడంతో ఆయా విద్యార్థులు దీనిపై ఆశలు వదులుకునే పరిస్థితి ఏర్పడింది.
ఏటా రూ.60 కోట్లు కేటాయిస్తున్నా..
విదేశాల్లో ఉన్నతవిద్య అభ్యసించే బీసీ పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యానిధి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థి ఉన్నతవిద్య చదివేందుకు ఆర్థికసాయం కింద గరిష్టంగా రూ.20 లక్షలు అందిస్తుంది. ఈ మొత్తాన్ని విద్యార్థి తిరిగి చెల్లించాల్సిన పనిలేదు. ప్రతి సంవత్సరం ఈ పథకం కింద 300 మందికి సాయం చేసేలా విద్యార్థుల అర్హతలను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేశారు.
ఎంపికైన విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే రెండు వాయిదాల్లో రూ.10లక్షల చొప్పున ప్రభుత్వం జమ చేసేది. అయితే నాలుగేళ్లుగా ఈ పథకానికి నిధుల విడుదల తగ్గిపోయింది. ఏటా ఈ పథకం కింద రూ.60 కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తున్నా, వార్షిక సంవత్సరం పూర్తయ్యే నాటికి నిధుల విడుదల మాత్రం పూర్తిస్థాయి లో జరగడం లేదు. ఫలితంగా బకాయిలు పేరుకుపో యాయి. 2019–20 వార్షిక సంవత్సరం నుంచి పూర్తి స్థాయి నిధులివ్వకపోవడంతో ఇప్పటివరకు రూ.100 కోట్లు బకాయిలున్నట్టు బీసీ సంక్షేమశాఖ వర్గాలు చెబుతున్నాయి.
నిధుల లభ్యతను బట్టి మంజూరు..
విద్యానిధి పథకం కింద ప్రభుత్వం బీసీ సంక్షేమశాఖకు ఏటా రూ.60కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తుంది. కానీ వార్షిక సంవత్సరం ముగిసే నాటికి కేటాయించిన బడ్జెట్‌లో అరకొరగానే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ఈ క్రమంలో అర్హత సాధించిన విద్యార్థులకు తొలివిడత కింద రూ.10లక్షలు చొప్పున ఖాతాల్లో జమ చేస్తున్న బీసీ సంక్షేమశాఖ...ఆ తర్వాత రెండోవిడత చెల్లింపులపై చేతులెత్తేసింది. దీంతో ఆ చెల్లింపులు క్రమంగా పేరుకుపోతు న్నాయి. 2019–20, 2020–21, 2021–22 విద్యా సంవత్సరాలకు సంబంధించి చాలామంది విద్యార్థులకు తొలివిడత నిధులు అందగా... 2022–23 విద్యా సంవత్సరం విద్యార్థులకు మాత్రం తొలివిడత నిధులు కూడా అందలేదు.
Comments
Please login to add a commentAdd a comment