వరంగల్ జిల్లాకు చెందిన మురిపాల సిద్ధార్థ్ ఎంఎస్ కోసం అమెరికాకు వెళ్లాలనుకున్నాడు. బీటెక్‌లో మంచి మార్కులు రావడంతో విదేశీ విద్యానిధి పథకం కింద దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఓ మధ్యవర్తి.. ఈ పథకం కింద రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందేలా చూస్తానని, అందుకు ప్రతిఫలంగా రూ. 5 లక్షలు ఇవ్వాలంటూ బేరమాడాడు. ఆర్థిక సాయంపై ఆశతో సిద్ధార్థ్ తండ్రి ఒప్పుకున్నాడు. రూ.లక్ష కూడా ఇచ్చాడు. ధ్రువపత్రాల పరిశీలన సమయంలో అధికారులు సిద్ధార్థ్ తండ్రిని పిలిచి మంచి మార్కులు, ఉత్తమ స్కోర్ ఉండడంతో మీ కుమారుడు తప్పకుండా ఎంపికవుతాడని చెప్పాడు. ఈ క్రమంలో ఎంపికైన సిద్ధార్థ్ అమెరికా వెళ్లి చదువు కొనసాగిస్తున్నాడు. అయితే ఎంఎస్ కోర్సులో చేరిన తర్వాత అడ్మిషన్ సర్టిఫికెట్, ధ్రువపత్రాలను సమర్పించాలని సిద్ధార్థ్ తండ్రికి అధికారులు ఫోన్ చేశారు. దీంతో ధ్రువపత్రాలను సమర్పించిన ఆయన మధ్యవర్తి విషయాన్ని వెల్లడించారు. అధికారులు ఫిర్యాదు ఇవ్వాలని చెప్పడంతో లేఖ ఇచ్చాడు. కానీ మధ్యవర్తి ఫోన్ నంబర్ పనిచేయకపోవడంతో అధికారులు చర్యలు తీసుకోలేదు. మధ్యవర్తి మాటలు విని తాను మోసపోయినట్లు చివరకు సిద్ధార్థ్ తండ్రి గుర్తించాడు.
సాక్షి, హైదరాబాద్: ప్రతిభావంతులైన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యా నిధి పథకం కింద గరిష్టంగా రూ. 20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి, బీసీ సంక్షేమ శాఖ ద్వారా మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ విద్యా నిధి పేరిట ఈ పథకాలు అమలవుతున్నాయి. అర్హుడైన విద్యార్థికి రెండు దఫాలుగా గరిష్టంగా రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ఆర్థిక సాయం అందించే పథకం ఇదే కావడం గమనార్హం. కాగా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో ఈ పథకానికి విపరీతమైన క్రేజ్ ఉంది. దీంతో మధ్యవర్తులు దరఖాస్తుదారులను మాయ మాటలతో మోసం చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు.
అత్యంత గోప్యంగా ఎంపిక ప్రక్రియ
పరిమిత కోటాతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు ఏటా గరిష్టంగా 2 వందల మందికి, బీసీ, ఈబీసీలకు 300 మందికి సాయం అందిస్తోంది. బీసీ, ఈబీసీ కేటగిరీలో ఈ ఏడాది ఏకంగా 3వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. పోటీ తీవ్రంగా ఉండటంతో దరఖాస్తు, సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో మధ్యవర్తులు తల్లిదండ్రులను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అడుగుతూ ఈ పథకం కింద తప్పకుండా మీకు ఆర్థిక సాయం అందేలా చూస్తామని నమ్మబలుకుతున్నారు. విద్యానిధి పథకం కింద దరఖాస్తులు, సర్టిఫికెట్ల పరిశీలన, అర్హుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది.
సంబంధిత సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి/కార్యదర్శితో పాటు సంక్షేమ శాఖ కమిషనర్/డైరెక్టర్, అదనపు సంచాలకులు, సంయుక్త సంచాలకులు, ఉప సంచాలకులు ఇందులో ఉంటారు. ఈ ప్రక్రియ ఆద్యంతం గోప్యంగా సాగుతుంది. ఎంపికైన తర్వాత జాబితా వెలువడినప్పుడు మాత్రమే అర్హుల పేర్లు బయటకు వస్తాయి. ఈ అంశాన్ని మధ్యవర్తులు అవకాశంగా మలుచుకుంటున్నారు. కొందరు జాబితా వెలువడిన వెంటనే లబ్ధదారులకు ఫోన్లు చేసి తమ ప్రయత్నం వల్లే ఆర్థిక సాయం అందుతోందంటూ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి వసూళ్లకు తెగబడుతున్నారు.
అధికార యంత్రాంగం నజర్
వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి తండ్రి ఇటీవల ఫిర్యాదు చేయడంతో విద్యానిధి పథకంలో జరుగుతున్న అక్రమ వ్యవహారంపై అధికారులు దృష్టి పెట్టారు. విద్యార్థులు, తల్లిదండ్రులను పిలిపించి మధ్యవర్తుల అంశంపై ఆరా తీస్తున్నారు. సమాచారం ఇచ్చిన వారి నుంచి లిఖిత పూర్తక ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. దీనిపై ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు.
విద్యానిధి అర్హతలు, ఎంపిక ఇలా...
విదేశీ విద్యా నిధి పథకంలో గ్రాడ్యుయేషన్ మార్కులు కీలకం. నిర్దేశించిన దేశాల్లో ఎంఎస్ చదువుకునే విద్యార్థులు ఈ పథకం కింద ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులు సమర్పించాలి. విద్యార్థి డిగ్రీ మార్కులకు 60 శాతం స్కోర్, జీఆర్‌ఈ/జీమ్యాట్ స్కోర్‌కు 20 శాతం, ఐఈఎల్‌టీఎస్/టోఫెల్‌కు మరో 20 శాతం మార్కులుంటాయి. దరఖాస్తులను అధికారులు వడపోసి నిబంధనల ప్రకారం అత్యధిక మార్కులున్న వారిని రిజర్వేషన్ల వారీగా ఎంపిక చేస్తారు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో అత్యధిక మార్కులున్న వారి జాబితాను రూపొందించి పరిమితికి లోబడి అర్హుల ఎంపిక చేపడతారు. బీసీల్లో మాత్రం సబ్ కేటగిరీలు, ఈబీసీ కేటగిరీ వారీగా వడపోత చేపట్టి ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థికి మొదటి రెండు సెమిస్టర్లు పూర్తయ్యాక సగం, చివరి రెండు సెమిస్టర్లు పూర్తయ్యాక మిగతా సాయాన్ని ప్రభుత్వం విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. విద్యార్థి చదువుకు సంబంధించిన ప్రతి అంశాన్ని అధికారులకు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తేనే నిధులు విడుదలవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment