‘పథకం’ ప్రకారం బ్రాహ్మణుల అభివృద్ధి
- వరాలు ప్రకటించిన రాష్ట్ర సర్కార్
- రూ.6 లక్షలలోపు ఆదాయం ఉంటే వివేకానంద విదేశీ విద్య
- టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు సరస్వతీ విద్యా ప్రశస్తి
- ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు తుది గడువు సెప్టెంబర్ 30
- ఆరోగ్య బీమా పథకం కింద రూ.2 లక్షల వరకు ఉచిత వైద్యం
- కుటుంబ సభ్యులు మరణిస్తే అంత్యక్రియలకు రూ.15 వేలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణులపై వరాల జల్లు కురిపించింది. వారి సంక్షేమానికి, అభివృద్ధికి పలు పథకాలు ప్రకటించింది. గురువారం ఇక్కడ తన చాంబర్‌లో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి కార్యక్రమాల్లో బ్రాహ్మణులకు సర్కారు పెద్దపీట వేస్తోందని తెలిపారు. వివేకానంద విదేశీ విద్యా పథకం క్రింద 41 మందికి నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. రెండేళ్ల విదేశీ విద్యను అభ్యసించేవారికి గరిష్టంగా రూ.20 లక్షలు, ఒక ఏడాది విదేశీ విద్యకు రూ.15 లక్షలు, ఏడాదిలోపు అయితే రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
రూ.6 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారు మాత్రమే వివేకానంద విదేశీ విద్య పథకానికి అర్హులని తెలిపారు. సరస్వతీ విద్యా ప్రశస్తి పథకం కూడా ప్రవేశపెట్టామని, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి ఆర్థిక సహయం అందిస్తామని చెప్పారు. ఎస్‌ఎస్‌సీలో రూ.7500, ఇంటర్‌లో రూ.10 వేలు ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. డిగ్రీ, పీజీ స్థాయిల్లో 75 శాతం, ప్రొఫెషనల్ కోర్సుల్లో 80 శాతం మార్కులు సాధించినవారికి రూ.15 వేలు, 20 వేలు, 25 వేల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. వచ్చే నెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు.
ఆరోగ్య బీమా పథకం కింద కుటుంబ యజమానితోపాటు ముగ్గురు సభ్యులకు, రాష్ట్రంలోని ఏదేని ఆస్పత్రుల్లో రూ.2 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తామని, దీనికి ఈ నెల 14 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని రమణాచారి సూచించారు. పరిశ్రమలు, వ్యాపారం, స్వయం ఉపాధికిగాను సబ్సిడీ పథకాలు తీసుకవచ్చామని, రూ. 5లక్షల ప్రాజెక్టు చేపట్టేవారికి 75 శాతం గ్రాంట్, రూ.10 లక్షల ప్రాజెక్టు అయితే 50 శాతం, రూ.25 లక్షల ప్రాజెక్టు అయితే 30 శాతం గ్రాంట్ అందిస్తున్నామని పేర్కొన్నారు. బ్రాహ్మణ కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకు రూ.15 వేలు ఆర్థిక సహకారం అందిస్తున్నామని చెప్పారు. బ్రాహ్మణ రచయితలు, కవుల రచనల ముద్రణకు రూ.50 వేలు, సామూహిక ఉపనయనాలకు రూ.11,116 మంజూరు చేస్తామన్నారు.