బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో స్వరూపానందేంద్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బ్రాహ్మణులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఆలనాపాలనా లేని ఆలయాల్లో నిత్య పూజల కోసం ధూపదీప నైవేద్య పథకం కింద అర్చకులకు నెలకు రూ.6 వేల చొప్పున ఇస్తున్న భృతిని రూ.10 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 3,645 దేవాలయాలకు వర్తిస్తున్న ధూపదీప నైవేద్య పథకాన్ని మరో 2,796 ఆలయాలకూ వర్తింపచేయనున్నట్టు చెప్పారు. గోపనపల్లిలో 9 ఎకరాల్లో రూ.12 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని కేసీఆర్ పలువురు పీఠాధిపతుల సమక్షంలో బుధవారం ఉదయం ప్రారంభించారు.
అనంతరం ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగిస్తూ.. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కొన్ని అంశాలను పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. అనువంశిక అర్చకుల విధానాన్ని పునరుద్ధరించాలంటూ కొన్నేళ్లుగా అర్చక కుటుంబాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దీనిపై కేబినేట్‌లో చర్చించి త్వరలో పరిష్కరించనున్నట్టు హామీ ఇచ్చారు. వేద పాఠశాలల నిర్వహణకు ఇస్తున్న రూ.2 లక్షలను ఇకనుంచి వార్షిక గ్రాంటుగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఐటీఎం, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు.
ప్రస్తుతం బ్రాహ్మణ పరిషత్ ద్వారా వేద పండితులకు ప్రతి నెలా ఇస్తున్న గౌరవ భృతిని రూ.2,500 నుంచి రూ.5,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. అలాగే, ఈ భృతిని పొందే అర్హత వయసును 75 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు తగ్గిస్తున్నట్టు చెప్పారు. తన సంజీవని వ్యాఖ్యతో మహాకవి కాళిదాసు సాహిత్య ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహామహోపాధ్యాయ కోలాచల మల్లినాథ సూరి పేరున ఆయన స్వస్థలమైన మెదక్ జిల్లాలోని కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు.
సర్వజన సమాదరణ
‘లోకా సమస్తా సుఖినోభవన్తు అన్నది బ్రాహ్మణుల నోట పలికే జీవనాదర్శం. సర్వజన సమాదరణ అన్నది తెలంగాణ ప్రభుత్వ విధానం, పేదరికం ఎవరి జీవితాల్లో ఉన్నా వారిని ఆదుకోవాలనే మానవీయ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. కులానికి పెద్దలైనా బ్రాహ్మణుల్లో ఎంతోమంది పేదలున్నారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యతగా భావించింది. అందుకే 2017లో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటు చేసింది. ఏడాదికి రూ.వంద కోట్ల నిధులను దానికి కేటాయిస్తున్నాం.
ఈ నిధులతో వివిధ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. పేద బ్రాహ్మణుల జీవనోపాధి నిమిత్తం బెస్ట్ (బ్రాహ్మణ ఎంపవర్‌మెంట్ స్కీం ఆఫ్ తెలంగాణ స్టేట్) పథకం కింద రూ.5 లక్షల చొప్పున పెట్టుబడి సాయంగా ప్రభుత్వం ఇప్పటివరకు రూ.150 కోట్లను వెచ్చించింది’ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు. సనాతన సంస్కృతి కేంద్రంగా ‘బ్రాహ్మణ సదనం’ను నిర్మించిన తొలి రాష్ట్రం తెలంగాణనే అని పేర్కొన్నారు.
రాష్ట్రానికి వచ్చే పీఠాధిపతులు, ధర్మాచార్యుల విడిది కేంద్రంగా, పేద బ్రాహ్మణ వివాహాలకు ఉచిత కల్యాణ వేదికగా, కులాలతో ప్రమేయం లేకుండా పేదలు తమ ఇంట్లో శుభాశుభ కార్యక్రమాలకు పురోహితులను ఉచితంగా పంపే సేవాకేంద్రంగా విలసిల్లాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. వివిధ క్రతువులు, ఆలయ నిర్మాణాలు, ఆగమశాస్త్ర నియమాలు, దేవతా ప్రతిష్టలు వివిధ వ్రతాలకు సంబంధించిన పుస్తకాలతో సమగ్రమైన లైబ్రరీ ఈ సదనంలో ఏర్పాటు చేయాలని కోరారు.
వైదిక కార్యక్రమాలకు సంబంధించిన అరుదైన పుస్తకాలు, డిజిటల్ వీడియోలు అందులో ఉంచాలన్నారు. సూర్యాపేటలో డాక్టర్ ఎ.రామయ్య ఇచ్చిన ఎకరం స్థలంలో నిర్మించిన బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని త్వరలో ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఖమ్మం, మధిర, బీచుపల్లి ప్రాంతాల్లోనూ బ్రాహ్మణ భవనాలను నిర్మిస్తున్నట్టు చెప్పారు. బ్రాహ్మణ సదనం ప్రారంభం సందర్భంగా శృంగేరీ పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతీ స్వామి, కంచికామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆడియో సందేశ రూపంలో ఆశీర్వదించారంటూ వారితోపాటు ప్రత్యక్షంగా విచ్చేసిన ఇతర పీఠాధిపతులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
ధర్మస్య జయోస్తు!
అధర్మస్య నాశోస్తు
ప్రాణిషు సద్భావనాస్తు
విశ్వస్య కళ్యాణమస్తు..
ఓం శాంతి.. శాంతి.. శాంతిః అన్న శ్లోకంతో సీఎం ప్రసంగాన్ని ముగించారు.
యాగంలో పాల్గొన్న సీఎం
బుధవారం ఉదయం తొలుత సదనానికి చేరుకున్న సీఎం కేసీఆర్ నేరుగా యాగశాలకు వచ్చి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎంకు శంఖ నాదం, వేద పఠనం మధ్య వారు తలపాగా, శాలువాలతో ఆశీర్వదించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య ప్రతినిధులను పలకరించారు. ప్రాంగణంలో కొనసాగుతున్న చండీయాగం, సుదర్శనయాగం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. తర్వాత వాస్తుపూజ నిర్వహించారు. బ్రాహ్మణ సదనం శిలాఫలకాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆవిష్కరించగా ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
తర్వాత సభాస్థలిలో పీఠాధిపతులకు సత్కరించి వారికి పాదాభివందనం చేశారు. పుష్పగిరి పీఠం విద్యానృసింహ భారతీస్వామి, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం సుభుధేంద్ర తీర్థస్వామి, మదనానంద సరస్వతీ పీఠం మాధవానంద స్వామి, హంపీ విరూపాక్షపీఠం విద్యారణ్య భారతీ స్వామి, ధర్మపురి పీఠం సచ్చిదానంద సరస్వతీ మహాస్వామి, సీతారాంబాగ్ జగన్నాథ మఠం వ్రతధర రామానుజ జీయర్ స్వామి హాజరయ్యారు.
కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లారాజేశ్వర్ రెడ్డి, వాణీదేవి, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, సతీశ్, బాల్క సుమన్, నగర మేయర్ విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, జస్టిస్ భాస్కర్ రావు, అష్టావధాని మాడుగుల నాగఫణి శర్మ, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు డా.కేవీ రమణాచారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment