
2014 నుంచి లబ్ధి పొందిన వారి సమాచారం సేకరించండి
రుణాలు తీసుకొని ఎంతమంది వృత్తి కొనసాగిస్తున్నారో ఆడిట్ చేయండి
బీసీ సంక్షేమ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: బీసీ రుణాలపై ఆడిట్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా 2014 నుంచి రుణాలు తీసుకొని లబ్ధి పొందిన వారి సమాచారాన్ని సేకరించాలని చెప్పారు. వృత్తి ప్రామాణికంగా రుణాలు తీసుకున్న వారు ఎంత మంది వృత్తి కొనసాగిస్తున్నారో కూడా ఆడిట్ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం బీసీ సంక్షేమ శాఖపై సీఎం సమీక్ష చేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల పునరుద్ధరణకు కేబినెట్లో ఆమోదం తెలిపామని, అవసరమైతే న్యాయ పోరాటం చేయాల్సి ఉందని తెలిపారు.
ఆ హత్యలపై వేగంగా విచారణ
వైఎస్సార్‌సీపీ హయాంలో బీసీలను ఊచకోత కోశారని, ఆ హత్యలపైనా విచారణ వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం చెప్పారు. అవసరమైతే ఇందుకు ప్రత్యేక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. సబ్ కమిటీ నివేదిక రాగానే బీసీ రక్షణ చట్టాన్ని అమల్లోకి తెస్తామన్నారు. రాష్ట్రంలో 2014–19 మధ్య జిల్లా కేంద్రాల్లో 13 కాపు భవనాలను మంజూరు చేసి, ఐదింటి నిర్మాణాలను ప్రారంభించామని, తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిలిపేసిందని అన్నారు. ఇప్పుడు వాటి నిర్మాణానికి మళ్లీ నిధులు విడుదల చేసినట్లు చెప్పారు.
బీసీ హాస్టల్స్ ట్యూటర్స్ బకాయిలు విడుదల
485 హాస్టల్స్‌లో ట్యూటర్స్ గౌరవ వేతనం బకాయిలు రూ.4.35 కోట్లు విడుదలకు అనుమతి ఇచ్చారు. డైట్ ఛార్జెస్ బకాయిలు రూ.185.27 కోట్లలో రూ.110.52 కోట్లు చెల్లించడానికి సీఎం అంగీకారం తెలిపారు. కాస్మోటిక్ బిల్లులు రూ.29 కోట్లు చెల్లించాలని ఆదేశించారు.
సత్యసాయి జిల్లాలోని నసనకోట, ఆత్మకూరు బీసీ సంక్షేమ బాలికల పాఠశాలలను రెసిడెన్షియల్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కుప్పంలోనూ బీసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. ఈ సమీక్షలో మంత్రి ఎస్.సవిత, అధికారులు పాల్గొన్నారు.
సంజీవయ్య ప్రస్థానం స్ఫూర్తిదాయకం
మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ఉండవల్లి నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం చంద్రబాబు పూలమాల వేసి నివాళులరి్పంచారు. కాగా అన్నమయ్య జిల్లాలో ప్రేమోన్మాది యాసిడ్ దాడిని సీఎం చంద్రబాబు ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయాన్ని నిర్ణయించడానికి సీఎం చంద్రబాబు విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, ఏఎస్ రామకృష్ణలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటుచేశారు.
ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి
స్వచ్చాంధ్ర లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పరిశుభ్రత పెంచేందుకు, అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు అమలు చేస్తున్న కార్యాచరణపై సీఎం శుక్రవారం సమీక్ష చేశారు. ప్రతి నెల 3వ శనివారం ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తోందన్నారు.
స్వచ్ఛాంధ్ర లక్ష్యాల సాధనలో భాగంగా 14 ఇండికేటర్స్ ఆధారంగా జిల్లాలకు ర్యాంకులను సీఎం ప్రకటించారు. మొత్తం 200 పాయింట్లకు గాను 129 పాయింట్లతో ఎనీ్టఆర్ జిల్లా మొదటి స్థానంలో, 127 పాయింట్లతో విశాఖ జిల్లా రెండో స్థానంలో, 125 పాయింట్లతో తూర్పు గోదావరి మూడో స్థానంలో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment