రూ.5 వేల కోట్లతో నిర్మిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సమీకృత గురుకులాల నిర్మాణానికి వెంటనే ఆయా నియోజకవర్గాల్లో స్థలాలు సేకరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5 వేల కోట్లతో 30 ప్రాంతాల్లో 120 సమీకృత గురుకులాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని సాధ్యమైనంత త్వరగా స్థలాల సేకరణతో పాటు, భవనాల నమూనాలు (డిజైన్లు) పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో 15 నుంచి 25 ఎకరాల్లో, పట్టణ ప్రాంతాల్లో 10 నుంచి 15 ఎకరాల్లో సమీకృత గురుకుల పాఠశాలల ఏర్పాటు కోసం స్థల సేకరణ చేయాలని చెప్పారు. రాబోయే ఎడెనిమిది నెలల్లో ఈ భవనాలను పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సోమవారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని, అందుకు తగ్గట్టుగా అధికారుల పనితీరు ఉండాలని సూచించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో విద్యార్థుల ప్రవేశాలు వందశాతం పూర్తి చేయాలని చెప్పారు.
ప్రతి విద్యార్థి మంచం పైనే పడుకోవాలి
ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి మంచం పైనే పడుకునేలా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని భట్టి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 1,029 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు ఇప్పటివరకు మంచాలు, పరుపులు, దుప్పట్లు ఎన్ని ఉన్నాయి? ఇంకా ఎంతమందికి ఇవి కావాలి అనే దానిపై వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి గురుకుల పాఠశాలలతో పాటు ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు తప్పనిసరిగా మరుగుదొడ్లు, స్నానాల గదులు, నీటి సరఫరా, విద్యుత్ సదుపాయం ఉండేలా చూడాలని, వసతి గదులకు తలుపులు, కిటికీలు, దోమలు రాకుండా వాటికి మెష్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యార్థులకు సౌకర్యాల కల్పనపై చెక్ లిస్టు రూపొందించి ఈనెల 29వ తేదీలోగా సమర్పించాలని ఆదేశించారు. చెక్ లిస్టును ప్రతి హాస్టల్లో ప్రదర్శించాలన్నారు.
ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తాం
విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలంటూ మంత్రి పొన్నం చేసిన విజ్ఞప్తిపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలో పెండింగ్‌లో ఉన్న ఓవర్సీస్ స్కాలర్íÙప్ బకాయిల జాబితాను అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 800 మంది బీసీ విద్యార్థులకు, 500 మంది చొప్పున ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తామని ప్రకటించారు.
పెద్దాపూర్ పాఠశాలపై సమీక్ష
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను తాము సందర్శించిన తర్వాత అక్కడ తీసుకున్న చర్యలపై గురుకులాల కార్యదర్శి రమణకుమార్‌ను డిప్యూటీ సీఎం ఆరా తీశారు. విద్యార్థులకు మంచాలు, పరుపులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పాఠశాల మైదానం చదును చేయాలని, నూతన భవనాల నిర్మాణం కోసం కావాల్సిన ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment