పతకాలే లక్ష్యంగా క్రీడా పాఠశాలలు | Sports schools targeting medals | Sakshi
Sakshi News home page

పతకాలే లక్ష్యంగా క్రీడా పాఠశాలలు

Published Mon, Jan 24 2022 3:59 AM | Last Updated on Mon, Jan 24 2022 8:27 AM

Sports schools targeting medals - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసి అత్యుత్తమ శిక్షణ ఇవ్వడం ద్వారా పతకాలు ఒడిసి పట్టేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ప్రతి జిల్లాలో క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలతో కలిసి గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను క్రీడాకారుల కార్ఖానాలుగా మారుస్తోంది. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లాలోని పెదవేగిలో బాలుర, పోలసానపల్లిలో బాలికల గురుకులాల్లో స్పోర్ట్స్‌ స్కూళ్లు ప్రారంభించింది. ఈ ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా 20కిపైగా క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. 

సంయుక్త నిర్వహణ
గురుకులాలు, ఆదర్శ పాఠశాలలకు అనుబంధంగా ఏర్పాటు చేసే క్రీడా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, క్రీడాకారులకు భోజన, వసతిని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల ద్వారా సమకూర్చనున్నారు. కోచ్‌ల నియామకం, విద్యార్థుల ఎంపిక, శిక్షణ ప్రక్రియలను శాప్‌ నిర్వహించనుంది. దాదాపు 30 క్రీడాంశాల్లో.. ఒక్కో పాఠశాలలో ఆరు విభాగాల చొప్పున ఏర్పాటు చేసి తర్ఫీదు ఇవ్వనున్నారు. 

ప్రతిపాదనలు సిద్ధం
క్రీడా పాఠశాలల కోసం ఇప్పటివరకు 8 ఎస్సీ గురుకులాలు (వీటిలో రెండింటిని ఇప్పటికే ప్రారంభించారు), 11 ఎస్టీ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను గుర్తించారు. వీటిల్లో ప్లే ఫీల్డ్స్‌ అభివృద్ధికి రూ.3.92 కోట్లు, క్రీడా పరికరాల కోసం రూ.3 కోట్ల చొప్పున విడివిడిగా ప్రతిపాదనలు రూపొందించారు. వీటితోపాటు సమగ్రశిక్షలో మోడల్‌ స్కూళ్లు, కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు (కేజీబీవీ), ఏపీ రెసిడెన్షియల్, మైనార్టీ వెల్ఫేర్‌ పరిధిలో, ప్రత్యేక ప్రతిభావంతులకు కూడా స్పోర్ట్స్‌ స్కూళ్లను నెలకొల్పేందకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కడప, విజయనగరం జిల్లాల్లో మాత్రమే క్రీడా పాఠశాలలు నడుస్తున్నాయి. వీటిల్లో అన్ని వర్గాల విద్యార్థులకు బ్యాటిల్‌ టెస్టుల ఆధారంగా.. మెరిట్‌ సాధించిన వారికి సీట్లు కేటాయిస్తున్నారు. 

క్రీడా పాఠశాలలు ఇలా..
ఎస్సీ గురుకులాలు: పెదవేగిలో బాలుర, పోలసానపల్లిలో బాలికల గురుకులాల్లో క్రీడా పాఠశాలలు మొదలయ్యాయి. ఇంకా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల (బాలికలు), విజయనగరం జిల్లా కొప్పెర్ల (బాలురు), కృష్ణాజిల్లా కృష్ణారావుపాలెం (బాలురు), కుంటముక్కల (బాలికలు), వైఎస్సార్‌ జిల్లా పులివెందుల (గండిక్షేత్రం–బాలురు), కర్నూలు జిల్లా డోన్‌ (బాలికలు)లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు.

ఎస్టీ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలు: శ్రీకాకుళం జిల్లా సీతంపేట (బాలురు), విజయనగరం జిల్లా భద్రగిరి (బాలికలు), విశాఖ జిల్లా చింతపల్లి (బాలురు),  తూర్పుగోదావరి జిల్లా ముసురుమల్లి (బాలురు), గంగవరం (బాలికలు), పశ్చిమగోదావరి జిల్లా రాజానగర్‌ (బాలికలు), వైఎస్సార్‌ జిల్లా రాయచోటి (బాలికలు), ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం (బాలురు), చిత్తూరు జిల్లా రేణిగుంట (బాలురు), అనంతపురం జిల్లా గొల్లలదొడ్డి (బాలురు), కర్నూలు జిల్లా మహానంది  (బాలికలు)లలో ఏర్పాటు చేయనున్నారు.

క్రీడా విజయానికి నాంది
రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధిలో భాగంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలకు అనుబంధంగా స్పోర్ట్స్‌ స్కూళ్లను ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు స్కూళ్లను ప్రారంభించాం. గ్రామీణ స్థాయి క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసి.. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేదిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇది క్రీడా విజయానికి నాంది పలుకుతుంది. శాప్‌లో అనుభవజ్ఞులైన కోచ్‌లు ఉన్నారు. వారిని మరింత సమర్థంగా ఉపయోగించుకుని మెరుగైన ఫలితాలు సాధిస్తాం.
– ఎన్‌.ప్రభాకరరెడ్డి, ఎండీ, ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement