Ashram schools
-
అంధులు, బధిరుల ఆశ్రమ పాఠశాలల్లో అడ్మిషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరు అంధులు, బధి రుల ఆశ్రమ పాఠశాలలు, ఒక జూనియర్ కళాశాలలో 462 సీట్లు అందుబాటులో ఉన్నాయని, అర్హత గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకుడు బి.రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం ఆయా పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసే విద్యార్థి వయసు 5 సంవత్సరాలు పైబడి ఉండాలని, ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు 3 జతచేసి దరఖాస్తులు పంపాలన్నారు. ఈ పాఠశాలల్లో ఉచిత విద్యతో పాటు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్, ఉచిత భోజనం, అన్నివేళలా వైద్య సౌకర్యం, హాస్టల్ వసతి, కంప్యూటర్ శిక్షణ కల్పి స్తారన్నారు. విద్యార్థులకు బ్రెయిలీ లిపి, సాంకేతిక బాష నేర్పబడతాయన్నారు. ఖాళీలు ఇలా.. ► విజయనగరంలోని అంధుల ఆశ్రమ పాఠశాలలో 1నుంచి 8వ తరగతి వరకు 43 ఖాళీలు ఉన్నాయి. వివరాలకు 83175–48039, 94403–59775 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు. ► విశాఖపట్నం అంధుల పాఠశాలలో 1నుంచి 10వ తరగతి వరకు 54 ఖాళీలు ఉన్నాయి. బాలికలకు మాత్రమే. వివరాలకు ఫోన్ 94949–14959, 90144–56753 నంబర్లలో సంప్రదించాలి. ► హిందూపురం అంధుల పాఠశాలలో 1నుంచి 10వ తరగతి వరకు 106 ఖాళీలు ఉన్నాయి. వివరాలకు ఫోన్ 77022–27917, 77805–24716 నంబర్లలో సంప్రదించవచ్చు. ► విజయనగరం బధిరుల పాఠశాలలో 1నుం చి 8వ తరగతి వరకు 20 ఖాళీలు ఉన్నాయి. ప్రవేశాల కోసం ఫోన్ 90000–13640, 99638–09120 నంబర్లలో సంప్రదించాలి. ► బాపట్ల బధిరుల పాఠశాలలో 1నుంచి 10వ తరగతి వరకు 78 ఖాళీలు ఉన్నాయి. ఫోన్ 94419–43071, 99858–37919 నంబర్లలో సంప్రదించవచ్చు. ► ఒంగోలు బధిర పాఠశాలలో 1నుంచి 10వ తరగతి వరకు 136 ఖాళీలు ఉన్నాయి. వివరాలకు ఫోన్ 94404–37629, 70132–68255 నంబర్లలో సంప్రదించవచ్చు. ► బాపట్ల బధిరుల ఆశ్రమ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో బాలురు, బాలికలకు 25 ఖాళీలు ఉన్నాయి. వివరాలకు 94419–43071, 99858–37919 నంబర్లలో సంప్రదించవచ్చు. -
పతకాలే లక్ష్యంగా క్రీడా పాఠశాలలు
సాక్షి, అమరావతి: గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసి అత్యుత్తమ శిక్షణ ఇవ్వడం ద్వారా పతకాలు ఒడిసి పట్టేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ప్రతి జిల్లాలో క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలతో కలిసి గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను క్రీడాకారుల కార్ఖానాలుగా మారుస్తోంది. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లాలోని పెదవేగిలో బాలుర, పోలసానపల్లిలో బాలికల గురుకులాల్లో స్పోర్ట్స్ స్కూళ్లు ప్రారంభించింది. ఈ ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా 20కిపైగా క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. సంయుక్త నిర్వహణ గురుకులాలు, ఆదర్శ పాఠశాలలకు అనుబంధంగా ఏర్పాటు చేసే క్రీడా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, క్రీడాకారులకు భోజన, వసతిని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల ద్వారా సమకూర్చనున్నారు. కోచ్‌ల నియామకం, విద్యార్థుల ఎంపిక, శిక్షణ ప్రక్రియలను శాప్ నిర్వహించనుంది. దాదాపు 30 క్రీడాంశాల్లో.. ఒక్కో పాఠశాలలో ఆరు విభాగాల చొప్పున ఏర్పాటు చేసి తర్ఫీదు ఇవ్వనున్నారు. ప్రతిపాదనలు సిద్ధం క్రీడా పాఠశాలల కోసం ఇప్పటివరకు 8 ఎస్సీ గురుకులాలు (వీటిలో రెండింటిని ఇప్పటికే ప్రారంభించారు), 11 ఎస్టీ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను గుర్తించారు. వీటిల్లో ప్లే ఫీల్డ్స్ అభివృద్ధికి రూ.3.92 కోట్లు, క్రీడా పరికరాల కోసం రూ.3 కోట్ల చొప్పున విడివిడిగా ప్రతిపాదనలు రూపొందించారు. వీటితోపాటు సమగ్రశిక్షలో మోడల్ స్కూళ్లు, కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు (కేజీబీవీ), ఏపీ రెసిడెన్షియల్, మైనార్టీ వెల్ఫేర్ పరిధిలో, ప్రత్యేక ప్రతిభావంతులకు కూడా స్పోర్ట్స్ స్కూళ్లను నెలకొల్పేందకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కడప, విజయనగరం జిల్లాల్లో మాత్రమే క్రీడా పాఠశాలలు నడుస్తున్నాయి. వీటిల్లో అన్ని వర్గాల విద్యార్థులకు బ్యాటిల్ టెస్టుల ఆధారంగా.. మెరిట్ సాధించిన వారికి సీట్లు కేటాయిస్తున్నారు. క్రీడా పాఠశాలలు ఇలా.. ఎస్సీ గురుకులాలు: పెదవేగిలో బాలుర, పోలసానపల్లిలో బాలికల గురుకులాల్లో క్రీడా పాఠశాలలు మొదలయ్యాయి. ఇంకా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల (బాలికలు), విజయనగరం జిల్లా కొప్పెర్ల (బాలురు), కృష్ణాజిల్లా కృష్ణారావుపాలెం (బాలురు), కుంటముక్కల (బాలికలు), వైఎస్సార్ జిల్లా పులివెందుల (గండిక్షేత్రం–బాలురు), కర్నూలు జిల్లా డోన్ (బాలికలు)లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఎస్టీ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలు: శ్రీకాకుళం జిల్లా సీతంపేట (బాలురు), విజయనగరం జిల్లా భద్రగిరి (బాలికలు), విశాఖ జిల్లా చింతపల్లి (బాలురు), తూర్పుగోదావరి జిల్లా ముసురుమల్లి (బాలురు), గంగవరం (బాలికలు), పశ్చిమగోదావరి జిల్లా రాజానగర్ (బాలికలు), వైఎస్సార్ జిల్లా రాయచోటి (బాలికలు), ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం (బాలురు), చిత్తూరు జిల్లా రేణిగుంట (బాలురు), అనంతపురం జిల్లా గొల్లలదొడ్డి (బాలురు), కర్నూలు జిల్లా మహానంది (బాలికలు)లలో ఏర్పాటు చేయనున్నారు. క్రీడా విజయానికి నాంది రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధిలో భాగంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలకు అనుబంధంగా స్పోర్ట్స్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు స్కూళ్లను ప్రారంభించాం. గ్రామీణ స్థాయి క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసి.. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేదిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇది క్రీడా విజయానికి నాంది పలుకుతుంది. శాప్‌లో అనుభవజ్ఞులైన కోచ్‌లు ఉన్నారు. వారిని మరింత సమర్థంగా ఉపయోగించుకుని మెరుగైన ఫలితాలు సాధిస్తాం. – ఎన్.ప్రభాకరరెడ్డి, ఎండీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ -
నెలాఖరుకు అద్దాల్లా ఆశ్రమ పాఠశాలలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆశ్రమ పాఠశాలల్లో నాడు–నేడు పనులు చురుగ్గా సాగుతున్నాయి. పనులు ఈనెలాఖరుకు పూర్తయ్యే అవకాశాలున్నాయి. అన్ని వసతులతో రూపుమార్చుకుంటున్న ఈ పాఠశాలలు అద్దాల్లా మారుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 378 ఆశ్రమ పాఠశాలలున్నాయి. ఇవన్నీ ఏజెన్సీ ప్రాంతంలోను, నల్లమల అడవుల్లోను ఉన్నాయి. 31 ప్రభుత్వ భవనాలు, రెండు అద్దె భవనాలు, ఒక అద్దెలేని భవనం కలిపి 34 మినహా మిగిలిన 344 స్కూళ్లలో నాడు–నేడు పనులు చేపట్టారు. అటవీ ప్రాంతాల్లో చాలా పాఠశాలలకు ఇప్పటివరకు ప్రహరీలు లేవు. జంతువుల భయం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి పగటిపూటే ఎలుగుబంట్లు, చిరుతపులులు పాఠశాలల పరిసరాల్లో కనిపిస్తుంటాయి. ఇప్పుడు ప్రతి పాఠశాలకు ప్రహరీ నిర్మిస్తుండటంతో ఈ సమస్య తీరనుంది. ప్రహరీ నుంచి లోపలికి రోడ్డు వేసి ఆటస్థలాన్ని కూడా తీర్చిదిద్దుతున్నారు. స్నానాల గదుల్లో టైల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మరుగుదొడ్లు, వాష్బేసిన్లు విద్యార్థుల సంఖ్యను బట్టి ఏర్పాటు చేస్తున్నారు. డైనింగ్ హాల్స్ రూపుదిద్దుకుంటున్నాయి. 16 నుంచి ప్రారంభమైన 9, 10 తరగతులు ఆశ్రమ పాఠశాలలు గురుకుల విద్యాలయాలను పోలి ఉంటాయి. విద్యార్థులు రాత్రిపూట ఇంటికి వెళ్లేందుకు అవకాశం ఉంది. ఉపాధ్యాయులు కూడా రాత్రి వరకు ఉండి ఇంటికి వెళతారు. విద్యావిధానం గురుకుల పాఠశాలల్లో మాదిరే ఉంటుంది. ఆశ్రమ పాఠశాలల్లో ఈనెల 16 నుంచి 9, 10 తరగతులు మొదలయ్యాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. మిగిలిన క్లాసుల వారికి ఆన్లైన్లో బోధిస్తున్నారు. గిరిజన సంక్షేమశాఖ ద్వారా నిర్వహిస్తున్న 179 ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ హాస్టళ్లలో నాడు–నేడు పనులు పూర్తికావచ్చాయి. ప్రీ మెట్రిక్ హాస్టళ్లు 21, పోస్టు మెట్రిక్ హాస్టల్స్ 158 ఉన్నాయి. -
గిరిపుత్రులకు ఈ–పాఠాలు!
గిరిపుత్రుల బడి అత్యాధునిక హంగులు సంతరించుకుంది. పాఠ్యాంశ బోధనలో నూతన ఒరవడికి తెరలేపింది. ఆన్లైన్ పాఠాలు, డిజిటల్ తరగతులకు భిన్నంగా లైవ్ టీచింగ్‌ను గిరిజన సంక్షేమ శాఖ అందుబాటులోకి తెచ్చింది. ప్రత్యేక సదుపాయాలతో ఏర్పాటు చేసిన స్టూడియో ద్వారా ఈ–పాఠ్యాంశ బోధన మొదలుపెట్టింది. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ఈ విధానాన్ని మరింత ఆధునీకరిస్తూ పాఠ్యాంశ బోధనను సరికొత్తగా ఆవిష్కరిస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఈ–పాఠ్యాంశ బోధన అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా 50 పాఠశాలల్లో ఈ–స్టూడియో బోధన కొనసాగుతోంది. నేరుగా శాటిలైట్ లింకుతో ఈ ప్రక్రియను విజయవంతంగా అమలు చేస్తోంది. పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడంలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ లైవ్ టీచింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్రం మంజూరు చేసిన నిధుల నుంచి రూ.11 కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులను వినియోగించి ఈ–స్టూడియో, డిజిటల్ క్లాస్రూమ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. – సాక్షి, హైదరాబాద్ బోధన ఇలా.. ప్రస్తుతం 50 ఆశ్రమ పాఠశాలల్లో ఈ–స్టూడియో ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. రోజుకు 5 తరగతులుంటాయి. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రోజుకో లైవ్ టీచింగ్ 45 నిమిషాల పాటు సాగుతుంది. దీంతో ప్రతి తరగతికి రోజుకో సబ్జెక్టు బోధిస్తారు. దాన్ని వీక్షించేందుకు స్కూల్లో డిజిటల్ స్క్రీన్, ప్రొజెక్టర్, రిసీవర్, డిష్, ల్యాప్‌టాప్ తదితరాలతో ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఈ–స్టూడియో ద్వారా జరిగే పాఠ్యాంశ బోధన స్కూల్లోని డిజిటల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. బోధకుడికి సంబంధించి చిన్న స్క్రీన్‌లో వీడియో డిస్ప్లే అవుతూనే.. బ్యాక్‌గ్రౌండ్‌లో పాఠ్యాంశానికి సంబంధించిన యానిమేషన్ కనిపిస్తుంది. సందేహాల నివృత్తి.. పాఠ్యాంశ బోధన ప్రక్రియలో విద్యార్థులకు సందేహాలు వస్తే వాటిని లైవ్‌లోనే అడిగే వీలుంటుంది. పాఠ్యాంశాన్ని వింటున్న ప్రతి విద్యార్థి దగ్గర ఓ బజర్ ఉంటుంది. అందులో వివిధ రకాల బటన్లు ఉంటాయి. సందేహాలు, సమాధానాలు, స్పష్టత తదితరాలకు అనుగుణంగా విద్యార్థులు ఆ బటన్లు నొక్కుతుంటారు. అంశం అర్థం కాకపోతే బటన్ నొక్కితే వారిని లైవ్‌లోకి తీసుకొస్తారు. ఎక్కువ మందికి సందేహాలు వస్తే పాఠ్యాంశాన్ని తిరిగి అర్థమయ్యేలా బోధిస్తారు. తక్కువ సందేహాలు లేవనెత్తితే వాటికి అక్కడికక్కడే సూచనలు చేస్తూ కీలకాంశాలను రిపీట్ చేస్తారు. ఈ–స్టూడియో కేంద్రంగా.. లైవ్ టీచింగ్ కోసం మాసబ్‌ట్యాంక్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా ఈ–స్టూడియోను ఏర్పాటు చేశారు. అక్కడ టీచింగ్ రూమ్‌తో పాటు కంట్రోల్ రూమ్ ఉంది. పాఠ్యాంశ బోధనలో భాగంగా టీచర్ బోధిస్తున్న సమయంలోనే అందుకు సంబంధించిన యానిమేషన్లు ప్లే చేసేలా వీడియో మిక్సర్ ఉంది. అందుకు తగిన ఆడియోను జోడించేందుకు ఆడియో కంట్రోల్ ఉంటుంది. వీటిని స్టూడియో ఇంజనీర్లు పర్యవేక్షిస్తారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులు సందేహాలను లేవనెత్తినప్పుడు క్షణాల్లో వారిని లైవ్‌లోకి తీసుకొస్తారు. ఈ–స్టూడియోలో ఐదుగురు నిపుణులతో పాటు ఇంజనీర్లు ఉంటారు. ప్రతి స్కూల్లో ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటారు. పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతోంది లైవ్ పాఠాలతో పిల్లల్లో ఏకాగ్రత, ఆసక్తి పెరుగుతోంది. సాధారణంగా క్లాస్‌రూంలో బోర్డుపై ముఖ్యమైన అంశాలను రాస్తూ వివరిస్తాం. ఇక్కడ డిజిటల్ బోర్డుపై యానిమేషన్ల ద్వారా వివరించడంతో పాటు ముఖ్యమైన అంశాలను డిజిటల్ బోర్డుపై రాసే వీలుంటుంది. బోర్డుపై యానిమేషన్లను చూపడంతోనే విద్యార్థులకు విషయం అర్థమవుతుంది. మరింత లోతుగా బోధించే అవకాశం ఉంటుంది. డిజిటల్ బోధనతో విద్యార్థులు మరింత ఏకాగ్రతతో పాఠాన్ని వింటున్నారు. అర్థం కాని అంశముంటే వెంటనే బజర్ నొక్కుతున్నారు. విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. – శ్రీకాంత్, టీచర్ బోధనకు సమాంతరంగా వీడియోలు ఆన్లైన్ బోధనలో యానిమేషన్లు కీలకం. బోధనకు తగినట్లుగా సమయానుకూలంగా వాటిని ప్లే చేయాలి. దీంతో ప్రతి పాఠ్యాంశానికి సంబంధించిన పాయింట్లతో వీడియోలు సిద్ధం చేసుకోవడంతో పాటు వాటి నిడివిని ఖచ్చితంగా అంచనా వేయాలి. అందుకు ముందురోజే ఏర్పాట్లు చేసుకుంటాం. బోధన ప్రక్రియ సాగుతున్నంత సేపు పరిశీలిస్తాం. – చంద్రకాంత్, స్టూడియో ఇంజనీర్ త్వరలో మరో 35 పాఠశాలల్లో.. ఈ–స్టూడియోను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాం. ఈ విద్యా సంవత్సరంలో కచ్చితంగా అమలు చేయాలన్న లక్ష్యంతో 50 పాఠశాలల్లో ఏర్పాటు చేశాం. త్వరలో మరో 35 స్కూళ్లలో అందుబాటులోకి తెస్తాం. కేంద్రం ఇటీవల రూ.2.85 కోట్లు విడుదల చేసింది. ఆశ్రమ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో డిజిటల్ బోధన తీసుకొస్తాం. కొత్త విధానంలో బోధన ప్రక్రియ ప్రారంభ దశలో ఉంది. – నవీన్ నికోలస్,గిరిజన సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ -
కష్టాల్లో ‘ఆశ్రమాలు’!
శ్రీకాకుళం, సీతంపేట: జిల్లాలోని పలు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సమస్యలు తిష్ఠ వేశాయి. వంటశాలలు లేక ఆరుబయ వంటలను చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఒండ్రుజోల బాలికల ఆశ్రమ పాఠశాలలతో పాటు శంబాం, మల్లి, చిన్నబగ్గ, పొల్ల తది తర గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కూడా వంటపాకలు పూర్తిగా లేవు. అన్ని చోటాŠŠŠŠŠŠ్ల వంట మనుషుల కొరత వేధిస్తోంది. పొంతన లేని ప్రకటనలు.. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామం టూ ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో గిరిజన విద్యకు కల్పిస్తున్న మౌలికవసతులకు పొంతన లేకుండా పోతుంది. ముఖ్యంగా విద్యార్థులకు మెనూ వండడానికి వంటపాకలు చాలా పాఠశాలలకు లేవు. దీంతో వర్షాకాలంలో నిర్వాహకులు పడరాని పాట్లు పడుతున్నారు. చాలా కాలంగా ఖాళీగా ఉన్న వంట మనుషుల పోస్టులను కూడా సర్కార్ భర్తీ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో గిరిజన విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. గిరిజన సంక్షేమఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో ఏళ్ల తరబడి వంటమనుషులు, సహాయకులు, వాచ్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి భర్తీ కాకపోవడంతో విద్యార్థినీ, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో వసతిగృహ సంక్షేమాధికా రులు సొంత డబ్బులు పెట్టుకుని ప్రైవేట్ వంటమనుషులను ఏర్పాటు చేసుకుని వండించుకునే పరిస్థితి ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో మారుమూల పాఠశాలల్లో విద్యార్థులే సహాయకులుగా మారుతున్నారు. జిల్లాలోని 47 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 5,176 మంది బాలురు, 5,188 మంది బాలికలు చదువుతున్నారు.16 పోస్ట్‌మెట్రిక్ వసతిగృహాల్లో 2,557 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ మూడు పూటలా భోజనం వండి పెట్టాల్సి ఉంది. ఇందుకు గాను మొత్తం 203 మంది అవసరం ఉండగా 113 మంది మాత్రమే ప్రస్తుతం ఉన్నా రు. 90 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయి.అలాగే వంట మనుషులు 29, సహాయకులు 33, వాచ్మెన్ 28, ఆఫీస్ సబార్డీనేట్‌లు 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వంట శాలలు సైతం సుమారు 15 పాఠశాలలకు లేవు. ఇదీ పరిస్థితి.. సీతంపేట బాలికల గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో సుమారు 650 మంది విద్యార్థులు చదువతున్నారు. వీరికి వండి వడ్డించడానికి ఇద్దరు వంటమనుషులు, మరో ఇద్దరు సహాయకులు, నైట్‌వాచ్‌వుమెన్ ఉండాలి. కేవలం ఒక వాచ్మెన్, కుక్ మాత్రమే ఉన్నారు. పూతికవలసలో 500 మందికి పైగా విద్యార్థులు ఉండగా కేవలం ఒకే ఒక వంట మనిషి ఉన్నారు. పొల్ల ఆశ్రమ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఎక్కువ మంది విద్యార్థినీ, విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ఇంతవరకు నైట్‌వాచ్‌మెన్ లేరు. శంబాం, హడ్డుబంగి, చిన్నబగ్గ తదితర ఆశ్రమ పాఠశాలల్లో ఇదే పరిస్థితి. ఆశ్రమ పాఠశాలల్లో పోస్టులు మంజూరైనప్పటికీ భర్తీ మాత్రం కాలేదు. మూడేళ్ల క్రితం ఈ పోస్టులు ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేయడాని కి చర్యలు తీసుకున్నప్పటికీ పైరవీలు చోటు చేసుకోవడంతో మధ్యలోనే నిలుపుదల చేశారు. కాగా పోస్ట్‌మెట్రిక్ వసతి గృహాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ పోస్టులే మంజూరు కాలేదు. అలాగే భవనాల మరమ్మతుల పేరుతో ఏటా కొన్ని పాఠశాలలకు నిధులు మంజూరవుతున్నా పైపైనే రంగులు వేయడం, అరకొరగా మరమ్మతులు చేసి వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి.ధులు ఏమౌతున్నాయి? గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖకు ఆశ్రమ పాఠశాలల మరమ్మతులు, మౌలికవసతుల పేరుతో ఈ ఏడాది రూ.4.70 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఎక్కడా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పనులు జరగలేదు. ప్రత్యేకంగా వంటశాలలు నిర్మాణం లేదు. కొన్ని చోట్ల పురిపాకల్లోనే వంటలు చేయాల్సిన దుస్థితి ఉంది. పలుమార్లు ఈ సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. – విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే -
విద్యార్థినులపై జ్వరాల పంజా
విజయనగరం, సాలూరురూరల్: మండలంలోని కొత్తవలస గిరిజన బాలికల సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు జ్వరాలబారిన పడ్డారు. సుమారు 20 మందికి పైగా విద్యార్థినులు అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఎ. పావని, యు.కృష్ణవేణి, ఎం.హేమలత, సీహెచ్.భవానీ, జె.పార్వతి, కె.స్వప్న, జి.మేఘన, పి.వసుంధర, తదితరులు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై హెచ్ఎం సంధ్యారాణి మాట్లాడుతూ, ఎనిమిది మంది విద్యార్థినులు జ్వరంబారిన పడినట్లు వైద్యులు తెలిపారని చెప్పింది. విద్యార్థినులకు మామిడిపల్లి పీహెచ్సీలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఇద్దరి విద్యార్థినులను మెరుగైన చికిత్స కోసం సాలూరు పీహెచ్‌సీకి తరలించినట్లు సమాచారం. సేవకురాలిగా హెచ్ఎం.. పాఠశాల ఏఎన్ఎం ముంగి వెంకటలక్ష్మి విద్యార్థినులను తీసుకుని ఆస్పత్రులకు వెళ్తుండడంతో మిగిలిన విద్యార్థినులకు హెచ్ఎం సంధ్యారాణి దగ్గరుండి మరీ సేవలందిస్తోంది. ఎప్పటికప్పుడు టెంపరేచర్ తీయడం.. దగ్గరుండి మందులు వేయించడం.. తదితర పనులన్నీ హెచ్ఎం చేస్తోంది. ఒకే మంచంపై ఇద్దరు ఆశ్రమ పాఠశాలలోని సిక్ రూమ్‌లో ఒక్కో మంచంపై ఇద్దరేసి విద్యార్థినులు పడుకుంటున్నారు. ఒక్కో మంచంపై ముగ్గురేసి కూడా ఉండి వైద్యసేవలు పొందుతున్నారు. తడవడం వల్లే.. భోజనాలకు వెళ్లే సమయంలో తడిసి పోవడం వల్లే జ్వరాలు ప్రబలాయని విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మెస్ వద్ద భోజనం చేసే సౌకర్యం లేకపోవడంతో భోజనం పట్టుకుని తిరిగి డార్మిటరీకి వచ్చే క్రమంలో తడిసిపోతున్నామని పలువురు చెబుతున్నారు. ఇదిలా ఉంటే విద్యార్థినులు జ్వరాల బారిన పడడం వల్ల సిబ్బందికి కూడా ఇక్కట్లు తప్పడం లేదు. ఆస్పత్రికి తీసుకెళ్లడం.. రిపోర్టులు తీసుకురావడం వంటి పనులతో వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక విద్యార్థినులు జ్వరాలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలను తమతో పంపించాలని కోరుతున్నారు. అయితే ఇళ్లకు వెళ్లినా అక్కడ జరగరానిది ఏదైనా జరిగితే తమకే ఇబ్బందని, అందుకే ఇక్కడే వైద్యసేవలందిస్తామని సిబ్బంది చెబుతున్నారు. -
కష్టాల చదువు
* సమస్యల వలయంలో గురుకుల, ఆశ్రమ పాఠశాలలు * మూత్రశాలలు.. స్నానాల గదులు కరువు * అర్ధరాత్రయినా... ఆరుబయటకే * బాలికల పాఠశాలలకు ప్రహరీలు లేవు * పట్టిపీడిస్తున్న ఉపాధ్యాయుల కొరత పాలమూరు : ఆర్థిక స్థోమత లేక.. చదువుపై ఉన్న మక్కువతో సర్కారు ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులు అక్కడి అరకొర వసతులతో నిత్యం సతమతమవుతున్నారు. జిల్లాలోని పలు ఆశ్రమ, గురుకుల పాఠశాలలు అసౌకర్యాలకు నిలయంగా మారాయి. అక్కడ చేరిన విద్యార్థులకు క్షేమం లేకుండా పోయింది. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 12 గురుకుల పాఠశాలలు, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 16 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, 6 గిరిజన కులాలు, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 4 గురుకుల పాఠశాలలు, మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2 గురుకుల పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఇందులో 16,600 మంది విద్యార్థులు వసతితోపాటు విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాలోని పలు ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు కల్పించిన వసతులు, అక్కడి పరిస్థితులైన సాక్షి విలేకరుల బృందం గురువారం ప్రత్యేక విజిట్ నిర్వహించింది. ఇందులో అనేక ఆసక్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పాఠశాలల విద్యార్థులు ప్రధానంగా తాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తోంది. కొన్నిచోట్ల వాటి ప్రాంగణంలో చేతి పంపులు ఉండడంతో అక్కడి విద్యార్థులు ఉప్పునీటిని తాగి కడుపు నింపుకుంటున్నారు. విద్యార్థుల సంఖ్యకు సరిపోను మూత్రశాలలు, స్నానాల గదులు లేక ఆరుబయటకు వెళ్తున్నారు. ఆరుబయట నెలకొల్పిన కొన్ని భవనాలకు ప్రహరీలు లేక వారికి రక్షణ కరువైంది. కొన్నిచోట్ల ముఖ్యమైన సబ్జెక్టులను బోధించే ఉపాధ్యాయుల ఖాళీలు ఉండటంతో 9, 10 తరగతుల విద్యార్థులు చదువుల్లో వెనుకబడాల్సి వస్తోంది. ప్రధాన సమస్యలివే.. - వటవర్లపల్లి ఆశ్రమ పాఠశాలలో నీటివసతి లేక రెండు కిలోమీటర్ల దూరంలో అడవికి సమీపంగా ఉన్న దిగుడు బావి వద్దకు వెళ్లి స్నానాలు చేస్తున్నారు. గురువారం ఇక్కడి ఆశ్రమ పాఠశాలలో ముగ్గురు వర్కర్లకుగానూ ఒక్కరు మాత్రమే విధుల్లో ఉండటంతో విధ్యార్థులే వంట చేసుకోవాల్సి వచ్చింది. - బాత్రూములలో వెలుతురు లేదు. రాత్రి సమయంలో చిన్న పిల్లలు ఆరుబయటకు వెళ్లాలంటే భయపడి పాఠశాల ఆవరణలోనే మలమూత్ర విసర్జన చేస్తున్నారు. - బల్మూరు మండలంలోని చెంచుగూడెం బాలిక ఆశ్రమ పాఠశాలలో నాల్గవ తరగతికి చెందిన నవ్వ, నిఖితలు వీవ్ర జ్వరంతో బాధపడుతూ కనిపించారు. ఇక్కడి ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్లు, మూత్రశాలల్లో నీటి వసతి సరిపడా లేని కారణంగా విద్యార్థినులు బహిర్భుమికి బయటకు వెళ్లాల్సి వస్తోంది. - పలు బాలికల గురుకుల, ఆశ్రమ పాఠశాలల వద్ద రక్షణ లేకపోవడం, సంబంధిత సిబ్బంది బాధ్యతారాహిత్యం కారణంగా అమ్మాయిలకు ఆకతాయిల సమస్య ఎదురవుతోంది.