గిరిపుత్రుల బడి అత్యాధునిక హంగులు సంతరించుకుంది. పాఠ్యాంశ బోధనలో నూతన ఒరవడికి తెరలేపింది. ఆన్‌లైన్ పాఠాలు, డిజిటల్ తరగతులకు భిన్నంగా లైవ్ టీచింగ్‌ను గిరిజన సంక్షేమ శాఖ అందుబాటులోకి తెచ్చింది. ప్రత్యేక సదుపాయాలతో ఏర్పాటు చేసిన స్టూడియో ద్వారా ఈ–పాఠ్యాంశ బోధన మొదలుపెట్టింది. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ఈ విధానాన్ని మరింత ఆధునీకరిస్తూ పాఠ్యాంశ బోధనను సరికొత్తగా ఆవిష్కరిస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఈ–పాఠ్యాంశ బోధన అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా 50 పాఠశాలల్లో ఈ–స్టూడియో బోధన కొనసాగుతోంది. నేరుగా శాటిలైట్ లింకుతో ఈ ప్రక్రియను విజయవంతంగా అమలు చేస్తోంది. పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడంలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ లైవ్ టీచింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్రం మంజూరు చేసిన నిధుల నుంచి రూ.11 కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులను వినియోగించి ఈ–స్టూడియో, డిజిటల్ క్లాస్‌రూమ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది.
– సాక్షి, హైదరాబాద్
బోధన ఇలా..
ప్రస్తుతం 50 ఆశ్రమ పాఠశాలల్లో ఈ–స్టూడియో ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. రోజుకు 5 తరగతులుంటాయి. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రోజుకో లైవ్ టీచింగ్ 45 నిమిషాల పాటు సాగుతుంది. దీంతో ప్రతి తరగతికి రోజుకో సబ్జెక్టు బోధిస్తారు. దాన్ని వీక్షించేందుకు స్కూల్‌లో డిజిటల్ స్క్రీన్, ప్రొజెక్టర్, రిసీవర్, డిష్, ల్యాప్‌టాప్ తదితరాలతో ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఈ–స్టూడియో ద్వారా జరిగే పాఠ్యాంశ బోధన స్కూల్‌లోని డిజిటల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. బోధకుడికి సంబంధించి చిన్న స్క్రీన్‌లో వీడియో డిస్‌ప్లే అవుతూనే.. బ్యాక్‌గ్రౌండ్‌లో పాఠ్యాంశానికి సంబంధించిన యానిమేషన్ కనిపిస్తుంది.
సందేహాల నివృత్తి..
పాఠ్యాంశ బోధన ప్రక్రియలో విద్యార్థులకు సందేహాలు వస్తే వాటిని లైవ్‌లోనే అడిగే వీలుంటుంది. పాఠ్యాంశాన్ని వింటున్న ప్రతి విద్యార్థి దగ్గర ఓ బజర్ ఉంటుంది. అందులో వివిధ రకాల బటన్లు ఉంటాయి. సందేహాలు, సమాధానాలు, స్పష్టత తదితరాలకు అనుగుణంగా విద్యార్థులు ఆ బటన్లు నొక్కుతుంటారు. అంశం అర్థం కాకపోతే బటన్ నొక్కితే వారిని లైవ్‌లోకి తీసుకొస్తారు. ఎక్కువ మందికి సందేహాలు వస్తే పాఠ్యాంశాన్ని తిరిగి అర్థమయ్యేలా బోధిస్తారు. తక్కువ సందేహాలు లేవనెత్తితే వాటికి అక్కడికక్కడే సూచనలు చేస్తూ కీలకాంశాలను రిపీట్ చేస్తారు.
ఈ–స్టూడియో కేంద్రంగా..
లైవ్ టీచింగ్ కోసం మాసబ్‌ట్యాంక్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా ఈ–స్టూడియోను ఏర్పాటు చేశారు. అక్కడ టీచింగ్ రూమ్‌తో పాటు కంట్రోల్ రూమ్ ఉంది. పాఠ్యాంశ బోధనలో భాగంగా టీచర్ బోధిస్తున్న సమయంలోనే అందుకు సంబంధించిన యానిమేషన్లు ప్లే చేసేలా వీడియో మిక్సర్ ఉంది. అందుకు తగిన ఆడియోను జోడించేందుకు ఆడియో కంట్రోల్ ఉంటుంది. వీటిని స్టూడియో ఇంజనీర్లు పర్యవేక్షిస్తారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులు సందేహాలను లేవనెత్తినప్పుడు క్షణాల్లో వారిని లైవ్‌లోకి తీసుకొస్తారు. ఈ–స్టూడియోలో ఐదుగురు నిపుణులతో పాటు ఇంజనీర్లు ఉంటారు. ప్రతి స్కూల్‌లో ఒక ఇన్‌స్ట్రక్టర్ ఉంటారు.
పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతోంది
లైవ్ పాఠాలతో పిల్లల్లో ఏకాగ్రత, ఆసక్తి పెరుగుతోంది. సాధారణంగా క్లాస్‌రూంలో బోర్డుపై ముఖ్యమైన అంశాలను రాస్తూ వివరిస్తాం. ఇక్కడ డిజిటల్ బోర్డుపై యానిమేషన్ల ద్వారా వివరించడంతో పాటు ముఖ్యమైన అంశాలను డిజిటల్ బోర్డుపై రాసే వీలుంటుంది. బోర్డుపై యానిమేషన్లను చూపడంతోనే విద్యార్థులకు విషయం అర్థమవుతుంది. మరింత లోతుగా బోధించే అవకాశం ఉంటుంది. డిజిటల్ బోధనతో విద్యార్థులు మరింత ఏకాగ్రతతో పాఠాన్ని వింటున్నారు. అర్థం కాని అంశముంటే వెంటనే బజర్ నొక్కుతున్నారు. విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. – శ్రీకాంత్, టీచర్
బోధనకు సమాంతరంగా వీడియోలు
ఆన్‌లైన్ బోధనలో యానిమేషన్లు కీలకం. బోధనకు తగినట్లుగా సమయానుకూలంగా వాటిని ప్లే చేయాలి. దీంతో ప్రతి పాఠ్యాంశానికి సంబంధించిన పాయింట్లతో వీడియోలు సిద్ధం చేసుకోవడంతో పాటు వాటి నిడివిని ఖచ్చితంగా అంచనా వేయాలి. అందుకు ముందురోజే ఏర్పాట్లు చేసుకుంటాం. బోధన ప్రక్రియ సాగుతున్నంత సేపు పరిశీలిస్తాం.
– చంద్రకాంత్, స్టూడియో ఇంజనీర్
త్వరలో మరో 35 పాఠశాలల్లో..
ఈ–స్టూడియోను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాం. ఈ విద్యా సంవత్సరంలో కచ్చితంగా అమలు చేయాలన్న లక్ష్యంతో 50 పాఠశాలల్లో ఏర్పాటు చేశాం. త్వరలో మరో 35 స్కూళ్లలో అందుబాటులోకి తెస్తాం. కేంద్రం ఇటీవల రూ.2.85 కోట్లు విడుదల చేసింది. ఆశ్రమ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో డిజిటల్ బోధన తీసుకొస్తాం. కొత్త విధానంలో బోధన ప్రక్రియ ప్రారంభ దశలో ఉంది.
– నవీన్ నికోలస్,గిరిజన సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment