792 గ్రామాలకు గాను 292 గ్రామాలే ఉన్నాయా?
మిగతావన్నీ ఎలా మాయమైనట్లు?
గిరిజన ప్రాంతాల పరిధులు ఎందుకు కుదిస్తున్నారు?
పూర్తి వివరాలను మా ముందుంచండి
కేంద్ర గిరిజన శాఖ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని 792 గిరిజన గ్రామాలకు ప్రస్తుతం 292 గ్రామాలే ఉండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. మిగిలిన గ్రామాలన్నీ ఏమయ్యాయని, ఎలా మాయమయ్యాయని అధికారులను నిలదీసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని, లేని పక్షంలో తదుపరి విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యక్తిగతంగా హాజరు కావాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిని ఆదేశించింది.
గిరిజన ప్రాంతాల పరిధిని, విస్తీర్ణాన్ని ఎందుకు, ఏ అధికారంతో కుదించేస్తున్నారో కూడా వివరించాలంది. తదుపరి విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి ర వి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గిరిజనేతరుల కోసం గిరిజన ప్రాంతాల విస్తీర్ణాన్ని అధికారులు తగ్గించేస్తున్నారని, పెద్ద సంఖ్యలో గ్రామాలను పట్టణాల్లో కలిపేస్తున్నారంటూ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడు టి.వెంకట శివరాం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది.
ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఎ. శ్యాంసుందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అధికారులు ఉద్దేశపూర్వకంగా గిరిజన ప్రాంతాల విస్తీర్ణాన్ని, పరిధులను కుదించేస్తున్నారని తెలిపారు. పెద్ద సంఖ్యలో గిరిజన గ్రామాలను పట్టణ ప్రాంతాల్లో కలిపేశారన్నారు. దీనివల్ల గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని, గిరిజనేతరులు లబ్ధి పొందుతున్నారని వివరించారు. అందుకే గిరిజన ప్రాంతాలను నిర్దిష్టంగా నోటిఫై చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు.
అధికారులు సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన వివరాల ప్రకారం గతంలో 792 గ్రామాలు ఉండగా, ప్రస్తుతం 292 గ్రామాలే ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ గిరిజన ప్రాంతాల పరిధులను ఎందుకు కుదించేస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై కేంద్రం ఎందుకు స్పందించడంలేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అయిన డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్‌జీ) పసల పొన్నారావును ప్రశ్నించింది.
తాము పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగామని, ఇప్పటివరకు ఇవ్వలేదని పొన్నారావు తెలిపారు. తదుపరి విచారణ నాటికి అఫిడవిట్ రూపంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ కార్యదర్శిని ధర్మాసనం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment