పాఠశాల స్థాయిలోనే కంప్యూటర్ విద్య
ఎస్టీ సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్
సాక్షి, హైదరాబాద్: గిరిజనులకు పాఠశాల స్థాయిలోనే కంప్యూటర్ విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్టీ సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆదేశించారు. ఎస్టీ విద్యాసంస్థల బలోపేతంతో పాటు, అదనపు సౌకర్యాల కల్పనకు రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. విద్యాసంవత్సరం మొదలయ్యే నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు, ఇతర సదుపాయాలను కల్పించనున్నట్లు తెలియజేశారు. మంగళవారం సచివాలయంలో గిరిజన ఉప ప్రణాళిక అమలు తీరును మంత్రి సమీక్షించారు. సబ్‌ప్లాన్ లక్ష్యాలను సాధించేందుకు ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి అన్ని విభాగాలను సమీక్షిస్తామన్నారు.
ఇందుకు తగినట్లుగా ఫలితాలను సాధించలేకపోతే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గిరిజన సబ్‌ప్లాన్‌లో వ్యక్తిగత ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల పేర్లను తమ శాఖ వెబ్‌సైట్లో ఉంచాలని, ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. గిరిజన తండాలకు రోడ్ల కల్పనకు పంచాయతీరాజ్‌శాఖ ద్వారా రూ.230 కోట్లు, గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రూ.145 కోట్లు ఖర్చుచేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామలక్ష్మణ్, ఎస్టీ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్, కమిషనర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.