ఫుట్‌పాత్ మీద ఉండేవారికి కరోనా వ్యాక్సిన్ వేయించడం; వీధి బాలలకు పుట్టినరోజు వేడుక; సంజీవకుమార్
ఓ సాధారణ పట్టణంలో పుట్టి పెరిగాడతడు. కంప్యూటర్ కోర్సు కోసం హైదరాబాద్ వచ్చాడతడు. నేర్చుకున్నాడు... తను నేర్చిన విద్యను ఇతరులకు నేర్పించేపనిలో మునిగిపోయాడు. ఎదుగుతున్నాననుకున్నాడు... అగాధంలోకి జారిపోయాడు. ఫుట్ పాత్ మీదే నిద్ర... అతడిని మార్చిన రోజది.
సంజీవకుమార్ పుట్టింది, పెరిగింది మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో. పాలిటెక్నిక్, ఐటీఐ, గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకునే నాటికి సమాజంలో సాంకేతికంగా మరో విప్లవం మొదలైంది. అదే కంప్యూటర్ ఎడ్యుకేషన్. రాబోయే కాలంలో కంప్యూటర్ లేనిదే ఏ పనీ చేయలేమని తెలుసుకున్నాడు సంజీవ్‌కుమార్.
హైదరాబాద్‌కు వచ్చి డీటీపీతో మొదలు పెట్టి డీసీఏ, పీజీడీసీఏ, పీజీ డీఎస్‌ఈ వరకు అప్పటికి అందుబాటులో ఉన్న కోర్సులన్నీ చేశాడు. తన మీద నమ్మకం పెరిగింది. సైబర్‌టెక్ పేరుతో నల్లకుంటలో కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్ స్థాపించాడు. కంప్యూటర్స్‌లో ప్రపంచాన్ని ఆందోళనలో ముంచెత్తిన వైటూకే సమస్య సద్దుమణిగింది. కానీ అంతకంటే పెద్ద ఉత్పాతం సంజీవకుమార్ జీవితాన్ని ఆవరించింది. ఆ వివరాలను సాక్షితో పంచుకున్నాడతడు.
అప్పు మిగిలింది!
‘‘నా మీద నాకున్న నమ్మకం, దానికితోడు అందరినీ నమ్మడం నా జీవిత గమనాన్ని మార్చేశాయి. నా మీద నమ్మకంతో కంప్యూటర్ సెంటర్‌లు ప్రారంభించాను. స్నేహితుల మీద నమ్మకంతో పదకొండు బ్రాంచ్‌లకు విస్తరించాను. కొన్ని బ్రాంచ్‌ల నిర్వహణ స్నేహితులకప్పగించాను. కొందరు స్నేహితులు పెట్టుబడి కోసం డబ్బు అప్పు ఇచ్చి సహకరించారు. నా పెళ్లి కోసం ఒకటిన్నర నెలలు మా ఊరెళ్లాను. పెళ్లి చేసుకుని హైదరాబాద్‌కి వచ్చేటప్పటికి పరిస్థితి తారుమారుగా ఉంది. ఫ్రాంచైసీలు తీసుకున్న స్నేహితులు మోసం చేశారు. నా కళ్ల ముందు తొంబై ఐదు లక్షల అప్పు.
నా భార్య బంగారం, నేను నిర్వహిస్తున్న కంప్యూటర్ సెంటర్‌లను అమ్మేసి కూడా ఆ అప్పు తీరలేదు. అప్పు ఇచ్చిన స్నేహితుల నుంచి ఒత్తిడి పెరిగింది. నా భార్యను పుట్టింట్లో ఉంచి హైదరాబాద్‌కొచ్చాను. నా దగ్గర డబ్బున్నప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్లెవరూ నాకు ఒక్కరోజు అన్నం కూడా పెట్టలేదు. ఆకలితో ఫుట్‌పాత్ మీద పడుకున్న రోజును నా జీవితంలో మర్చిపోలేను. డబ్బులేని మనిషికి విలువ లేదని తెలిసి వచ్చిన క్షణాలవి. మరి ఫుట్‌పాత్ మీదనే బతికేవాళ్ల పరిస్థితి ఏమిటి... అనే ఆలోచన మొదలైన క్షణం కూడా అదే.
వైద్యం... ఆహారం!
నేను స్కై ఫౌండేషన్ స్థాపించింది 2012లో. అప్పటి నుంచి వీధుల్లో బతికే వాళ్లకు ప్రతి ఆదివారం అన్నం పెట్టడం, మందులివ్వడం, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నాను. ఆఫీస్‌లోనే వండి రెండు వందలకు పైగా పార్సిళ్లతో మా వ్యాన్ బయలుదేరుతుంది. వాటిని ఫుట్‌పాత్ మీద, చెట్టుకింద పడుకున్న వాళ్లకు ఇస్తాం. అలాగే ప్రతి బిడ్డా పుట్టిన రోజు పండుగనూ, కేక్ కట్ చేసిన ఆనందాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో పిల్లలకు సామూహికంగా పుట్టిన రోజులు చేస్తున్నాను.
స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజు పిల్లల చేత జెండావందనం చేయిస్తాను. కోఠీలో పాత పుస్తకాలు తెచ్చి పంచుతాను. వీటన్నింటికంటే నేను గర్వంగా చెప్పుకోగలిగిన పని వీళ్లందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించడం. ఫుట్‌పాత్‌ల మీద బతుకీడ్చే వాళ్లకు ఆధార్ కార్డు ఉండదు, మొబైల్ ఫోన్ ఉండదు. కరోనా వ్యాక్సిన్ వేయాలంటే ఈ రెండూ ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసి ప్రత్యేక అనుమతి తీసుకుని వాళ్లందరికీ వ్యాక్సిన్ వేయించాను. కరోనా సమయంలో సేవలందించిన వైద్యులకు, వైద్య సిబ్బందికి సన్మానం చేశాను.
ఒక్క అవకాశమివ్వండి!
వీధుల్లో బతుకు వెళ్లదీసే వాళ్లకు తాత్కాలికంగా అన్నం పెట్టడం, దుస్తులివ్వడం శాశ్వత పరిష్కారం కాదు. ఈ బతుకులు రోడ్డు పక్కనే ఉండిపోకూడదంటే వాళ్లకు బతుకుదెరువు చూపించాలి. ప్రభుత్వాలు వాళ్లను షెల్టర్ హోమ్‌లో ఉంచి ఆహారం పెట్టడంతో సరిపెట్టకూడదు. చిన్న చిన్న పనుల్లో శిక్షణ ఇచ్చి సమాజంలోకి పంపించాలి. వడ్రంగం, బుక్ బైండింగ్, అగరుబత్తీల తయారీ, విస్తరాకుల కటింగ్ వంటి చిన్న పనులు నేర్పించినా చాలు. వాళ్లకు ఒక దారి చూపించినవాళ్లమవుతామని ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలిచ్చాను. పైలట్ ప్రాజెక్టుగా ఒక ఏరియాకి బాధ్యత ఇవ్వండి. విజయవంతం చేసి చూపిస్తానని కూడా తెలియచేశాను. అలా చేయగలిగినప్పుడు వీధి జీవితాలు ఇంటివెలుగులవుతాయి’’ అన్నారు సంజీవకుమార్.
ఫుట్‌పాత్ మీద కొత్త ఉపాధి!
కంప్యూటర్ సెంటర్‌లను అమ్మేసిన తర్వాత కన్సల్టెంట్‌గా మారాను. తార్నాకలోని సన్మాన్ హోటల్ ముందున్న ఫుట్ పాతే నా వర్క్ ప్లేస్. నా భుజాన ఒక్క బ్యాగ్‌తో పాన్ కార్డ్ సర్వీస్ రూపంలో జీవితం కొత్తగా మొదలైంది. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు వచ్చేవి. నెలకు రెండు వేల అద్దెతో ఒక గదిలో ‘స్కై క్రియేషన్స్’ పేరుతో సర్వీస్‌ను రిజిస్టర్ చేశాను.
పాన్ కార్డు నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ సర్వీస్‌లు, ప్లేస్‌మెంట్‌ల వరకు సర్వీస్‌లను విస్తరించాను. పద్మారావు నగర్‌లో ఓ చిన్న ఫ్లాట్ కొనుకున్న తర్వాత స్కై ఫౌండేషన్ పేరుతో సామాజిక సేవ మొదలు పెట్టాను. అద్దె ఇంట్లో ఫౌండేషన్ రిజిస్టర్ చేయాలంటే ఇంటి యజమాని అనుమతించరు. కాబట్టి సొంత గూడు ఒకటి ఏర్పరుచుకునే వరకు ఆగి అప్పటి నుంచి వీధి పాలైన జీవితాల కోసం పని చేయడం మొదలుపెట్టాను.
– సంజీవకుమార్, ఫౌండర్, స్కై ఫౌండేషన్, హైదరాబాద్
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment