పాట రికార్డింగ్ సమయంలో ఆరేళ్ల బాల సరస్వతీదేవి; భర్త, పిల్లలతో బాలసరస్వతీ దేవి
పువ్వుకు రాగం అబ్బితే ఎలా ఉంటుంది?
ఆ పువ్వు స్వరాన్ని ఎలా సవరించుకుంటుంది?
ఆ తావి గానాన్ని ఎలా శ్రుతి చేసుకుంటుంది?
అక్షరాలను పూలరెక్కల్లా పొదివి పట్టుకుంటుంది.
సరిగమలు కందకుండా సున్నితంగా గానం చేస్తుంది.
ఆ గాన సరస్వతి... మన రావు బాలసరస్వతీదేవి.
పువ్వు పాడితే ఎలా ఉంటుందో... రావు బాలసరస్వతీదేవి పాట వింటే తెలుస్తుంది. హైదరాబాద్, మణికొండలోని గాయత్రి ప్లాజాలో ఆమె ఫ్లాట్ గోడలు ఆ గానసరస్వతి రాగాలను నిత్యం వింటుంటాయి. తొంభై ఐదేళ్ల వయసులో కూడా ఆమె స్వరంలో రాగం శ్రుతి తప్ప లేదు. తొంభై ఏళ్లుగా సాగుతున్న సాధనతో ఆ స్వరం అద్దుకున్న తియ్యదనం అది. పారిజాత పువ్వులాంటి మృదుత్వం ఆమె రాగానిది. ఆ గొంతు సన్నజాజి మొగ్గలా పరిమళం వెదజల్లుతోందిప్పటికీ. ఆ సుమధుర గానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. తొమ్మిది దశాబ్దాల ఆమె సంగీత సేవను గౌరవిస్తోంది. నవంబర్ ఒకటవ తేదీన (రేపు) ఆమె వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కారం అందుకోనున్నారు.
గ్రామఫోన్ నుంచి సీడీల వరకు
సరస్వతి నాలుగవ ఏట నుంచి వేదికల మీద పాడుతున్నారు. ఆరవ ఏట హెచ్.ఎం.వి కంపెనీ ఆమె పాటను గ్రామఫోన్‌లో రికార్డు చేసింది. తెలుగు సినిమాలో తొలి నేపథ్య గాయనిగా రికార్డు ఆమెదే. ఆకాశవాణి కేంద్రాలు మద్రాసు, విజయవాడ స్టేషన్‌ల కోసం ప్రారంభగీతం పాడిన రికార్డు కూడా ఆమెదే. తెలుగు, తమిళ, కన్నడ భాషలతోపాటు సింహళ గీతాలనూ ఆలపించారు. బాలనటిగా, బాల గాయనిగా సినీరంగం ఆమెను గారం చేసింది.
పేరు ముందు ‘బాల’ను చేర్చింది. కర్ణాటక సంగీతం, హిందూస్థానీ సంగీతాలు సాధన చేసింది. సినిమా షూటింగ్‌ల కారణంగా స్కూలుకెళ్లడం కుదరకపోవడంతో ఆమె చదువు కోసం ట్యూటర్ ఇంటికి వచ్చి పాఠాలు చెప్పేవారు. ఆమెకు ఇంగ్లిష్ నవలలు చాలా ఇష్టం. ఆ అలవాటును ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. గ్రామఫోన్ రికార్డుల కాలం నుంచి క్యాసెట్ టేప్‌లో రికార్డ్ చేసే టెక్నాలజీని చూశారు. సీడీలు, ఎంపీత్రీలనూ చూశారు. టెక్నాలజీతోపాటు అప్‌డేట్ అవుతూ వచ్చారు.
కానీ, సినిమా సంగీతం, సాహిత్యంలో వచి్చన భాషాపరంగా విలోమమవుతున్న ప్రమాణాలను అంగీకరించలేకపోయారు. సినిమా అంటే శక్తిమంతమైన వినోదసాధనం. పిల్లలు, యువతకు మానసిక వికాసం, మేధో వికాసంతోపాటు వాళ్ల అభివృద్ధికి... వినోదం అనే సాధనంతో బాటలు వేసే గొప్ప కళామాధ్యమంగా ఉండాలి సినిమా. అంతే తప్ప విలువలను దిగజార్చుకునే సాధనం కాకూడదని చెబుతారామె. రెండు వేలకు పైగా పాటలు పాడిన ఈ సంగీత సరస్వతి ఈ రోజుల్లో పాటల సాహిత్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
పాట కలిపింది ఇద్దరినీ!
చెన్నై (మద్రాసు) లో పుట్టి పెరిగిన బాల సరస్వతి పెళ్లి తర్వాత కోడలిగా కోలంక జమీందారీలో అడుగుపెట్టారు. ప్రకృతి ఇద్దరు వ్యక్తులను దూరం చేసిన విషాదాంతాలను సినిమాల్లో చూస్తుంటాం. కానీ ప్రకృతి ఇద్దరు మనుషులను దగ్గర చేయాలనుకుంటే చాలా చమత్కారంగా దగ్గర చేస్తుంది. అందుకు ఈ గానసరస్వతి పెళ్లే గొప్ప ఉదాహరణ. ‘‘నా పాటను వినడానికి స్వయంగా కోలంక జమీందార్... శ్రీ రాజారావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు గారు మద్రాసులో మా ఇంటికి వచ్చారు.
నేనప్పుడే ‘కలువ రేకుల కనులు గల నా స్వామీ’ అనే పాట రికార్డింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాను. మా నాన్న పాట పాడమనగానే అదే పాట పాడాను. రాజా వారేమో తన పెద్ద కళ్లను వరి్ణస్తూ, వారి మీద ప్రేమను అలా పాట రూపంలో వ్యక్తం చేశాననుకున్నారట. అదే మా పెళ్లికి నాందీ గీతం’ అంటూ ఆనాటి జ్ఞాపకాన్ని సంతోషంగా గుర్తు చేసుకున్నారామె. అందుకే తనకు ఇష్టమైన ప్రదేశం మద్రాసేనని చెబుతారామె.
ఈ బాల రెండో బాల్యమిది!
బాలసరస్వతీ దేవికి హాఫ్ వైట్ పట్టు చీరలిష్టం. క్రీమ్ కలర్‌తో అనేక రంగుల కాంబినేషన్‌లలోనే ఎక్కువగా కనిపిస్తారు. ఆమెకు మల్లెలన్నా ఇష్టమే. ఇక స్వీట్స్... ముఖ్యంగా గులాబ్ జామూన్, జాంగ్రీలను చూస్తే చిన్నపిల్లయిపోతారు. చాక్లెట్ చేతికిస్తే పసి పిల్లల ముఖం వికసించినట్లే ఆమె ముఖంలో నవ్వులు పూస్తాయి.
భోజనం గుప్పెడే కానీ, ఆ వెంటనే స్వీట్ తినడం ఆమెకిష్టం, ఆ తర్వాత తియ్యగా పాడడం మరింత ఇష్టం. ఆ సరిగమల వారసత్వం ఇద్దరు కొడుకులకు రాలేదు, మనుమడు, మనుమరాలికీ రాలేదు. కానీ మనుమరాలి కూతురు నేహకు వచ్చింది. గానసరస్వతి కళ్ల ముందే ఆ ఇంట్లో సరిగమల కొత్తతరం వెల్లివిరుస్తోంది. తొంబై ఐదేళ్ల వయసులో హైదరాబాద్‌లోని పెద్ద కుమారుని ఇంటిలో ప్రశాంతంగా పసిబిడ్డలా జీవిస్తున్నారు బాల సరస్వతీదేవి. కన్నతల్లిని ‘కన్నక్కా’ అని పిలుస్తూ తల్లిని కన్నబిడ్డలా చూసుకుంటున్నారాయన. కోడలు అత్తగారి చిన్నప్పటి జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ ఆమెను అపురూపంగా చూసుకుంటున్నారు. సాక్షి ఇంటర్వ్యూలో ఆమె కొన్ని సంగతులు చెప్తూ మధ్యలో మర్చిపోతుంటే ఆమె పెద్ద కొడుకు, పెద్ద కోడలు అందుకుని పూర్తి చేయడమే అందుకు నిదర్శనం.
సినిమాలకు మాత్రమే దూరం... స్వరానికి కాదు!
పెళ్లి తర్వాత పదిహేనేళ్లకు బాల సరస్వతీదేవి సినిమాల కోసం పాడడం మానేశారు. కానీ సంగీత సాధన మాత్రం ఆపలేదు. సినారె తెలుగులోకి అనువదించిన మీరాభజన్ గీతాలను ఆలపించారామె. ఎనభై ఏళ్ల వయసులో ఆమె తనకిష్టమైన కొన్ని లలిత గీతాలను ఎంచుకుని స్వీయ సంగీత దర్శకత్వం వహించి ‘రాధా మాధవం’ సీడీ విడుదల చేశారు. కోవిడ్‌కి ముందు 2018లో అంటే ఆమె తొంబయ్యేళ్ల వయసులో ‘స్వరాభిషేకం’ కార్యక్రమంలో పాడడమే ఆమె చివరి వేదిక. ఆ వేడుక తర్వాత మూడవ రోజు ఇంట్లో జరిగిన ప్రమాదం ఆమెను ఇంటికే పరిమితం చేసింది. అయితే ఆశ్చర్యంగా జారి పడడంతో విరిగిన తుంటి ఎముక దానంతట అదే సరయింది. సంగీతమే తనను స్వస్థత పరిచిందంటారామె. ఇప్పటికీ రోజూ ఆ స్వరం రాగాలను పలుకుతుంటుంది. ఆమె ఊపిరితిత్తులకు శక్తినిస్తున్నది సంగీతమేనని వైద్యులు కూడా నిర్ధారించారు.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫొటోలు: మోహనాచారి
Comments
Please login to add a commentAdd a comment