శశాంక బినేశ్... మంచి వక్త. సామాజిక కార్యకర్త... ఓ విజేత. ‘మీ తరఫున మేము మాట్లాడుతాం’ అంటోంది. ‘మీ ఆరోగ్యాన్ని మేము పట్టించుకుంటాం’ అంటోంది. ‘ఉద్యోగినులకు అండగా ఉంటాను’ అంటోంది. ‘సస్టెయినబుల్ ఫ్యాషన్ కోసం పని చేస్తాను’ ... అని ప్రకృతికి భరోసా ఇస్తోంది.
శశాంక బినేశ్ సొంతూరు హైదరాబాద్, చందానగర్. బీఫార్మసీ తర్వాత యూకేకి వెళ్లి ‘లండన్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ’ నుంచి ఫార్మసీలో పీజీ చేశారామె. ఇండియాకి వచ్చి కొంతకాలం ఉద్యోగం చేసినప్పటికీ అది సంతృప్తినివ్వలేదు. ‘‘సొంతంగా ఏదో ఒకటి చేయాలి, నన్ను నేను నిరూపించుకోవాలనే ఆలోచన చాలా గట్టిగా ఉండేది. ఈ లోపు మరో ఉద్యోగంలో చేరాను. ఆ ఉద్యోగంలో డిజిటల్ మార్కెటింగ్ మీద మంచి పట్టు వచ్చింది. ఇక ఆలస్యం చేయలేదు.
ఇంట్లోనే ఒక గదిలో సొంతకంపెనీ ‘వి హాంక్’ మొదలుపెట్టాను. ఇప్పుడు ప్రతి వ్యాపారమూ బ్రాండింగ్ మీదనే నడుస్తోంది. బ్రాండ్‌కి ప్రమోషన్ కల్పించే పని మేము చేస్తాం. సింపుల్‌గా చెప్పాలంటే... మీ గురించి, మీ వ్యాపారం గురించి మేము హారన్ మోగిస్తామన్నమాట’’ అంటూ తన సేవా ప్రయాణాన్ని వివరించే ముందు ఉపాధి కోసం తాను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన విషయాన్ని చెప్పారామె. ‘సామాజిక కార్యకర్తగా ఈ పనులు ఇప్పుడు కొత్తగా చేస్తున్నవి కావు, మా ఇల్లే నేర్పించింది’’ అన్నారు శశాంక బినేశ్.
తాత... నాన్న... నేను!
నా చిన్నప్పుడు చందానగర్ నగరంలో భాగం కాదు, గ్రామం. మా తాత మందగడ్డ రాములు గ్రామానికి ఉప సర్పంచ్, సర్పంచ్‌గా ఊరికి సరీ్వస్ చేశారు. పేదవాళ్లు నివసించే శాంతినగర్ కాలనీ వాళ్లకు ఇళ్లు, కరెంటు వంటి సౌకర్యాలు ఆయన హయాంలోనే వచ్చాయి. మా నాన్న విక్రమ్ కుమార్ ఇప్పటికీ శ్రామికుల ప్రయోజనాల కోసం పని చేస్తూనే ఉన్నారు. నా అడుగులు కూడా అటువైపే పడ్డాయి.
యూకేలో చదువుకుంటున్నప్పుడు పార్ట్‌టైమ్ జాబ్... షెఫీల్డ్ నగరంలో ఒక వృద్ధాశ్రమంలో. పెద్దవాళ్లకు ఒళ్లు తుడవడం, దుస్తులు మార్చడం, వీల్‌చెయిర్‌లో తీసుకెళ్లడం వంటి పనులు చేశాను. ఆ ఉద్యోగం... జీవితం పట్ల నా దృక్పథాన్ని మార్చేసింది. ఇండియాలో మా నాన్న తన స్నేహితులతో కలిíసి 2007లో నాదర్‌గుల్ దగ్గర ఒక ట్రస్ట్ హోమ్ స్థాపించారు. ఆ హోమ్ కోసం పని చేయడం మొదలుపెట్టాను.
ఇక డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్న సమయంలో సినీనటి సమంత, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల అనగాని తో పరిచయమైంది. అప్పటినుంచి ‘ప్రత్యూష సపోర్ట్’ స్వచ్ఛంద సంస్థతో పని చేస్తున్నాను. పేదపిల్లలకు వైద్యసహాయం అందించడం మీద ప్రధానంగా దృష్టి పెట్టాను. ఇప్పటివరకు 650కి పైగా సర్జరీలు చేయించగలిగాను. స్ఫూర్తి ఫౌండేషన్, డిజైర్ సొసైటీతో కలిసి హెచ్‌ఐవీ పిల్లలకు ‘విష్ ట్రూ కమ్’ ప్రోగ్రామ్, అనాథ పిల్లలకు ‘వింగ్స్ ఆఫ్ హోప్’ ద్వారా విమాన ప్రయాణాలు చేయించడం వంటి పనులతో సేవాకార్యక్రమాల్లో ఉండే సంతృప్తిని ఆస్వాదించాను.
పేదరికం... అనారోగ్యం... రెండూ శాపాలే!
నా సర్వీస్‌ని ముఖ్యంగా ఆర్థిక వెనుకబాటు తనం, అనారోగ్యాల నిర్మూలనల మీదనే కేంద్రీకరించడానికి బలమైన కారణమే ఉంది. పేదరికమే ఒక శాపమైతే, అనారోగ్యం మరొక విషాదం. ఈ రెండూ కలిస్తే ఆ వ్యక్తి వేదన వర్ణనాతీతం. పిల్లలకు వైద్యం చేయించలేక తల్లిదండ్రులు పడే గుండెకోతను చెప్పడానికి ఏ భాషలోనూ మాటలు దొరకవు. సమాజంలో ఇన్ని సమస్యలుంటే ఇవి చాలవన్నట్లు మనుషులు ఒకరినొకరు కులాల పరంగా దూరం చేసుకోవడం మరొక విషాదం. భారతీయ విద్యాభవన్‌లో చదువుకున్నన్ని రోజులూ నాకు కులాల గురించి తెలియదు.
ఇంటర్‌కి మా వాళ్లు ర్యాంకుల ప్రకటనలతో హోరెత్తించే కాలేజ్‌లో చేర్చారు. బీసీ వర్గానికి చెందిన నేను అక్కడ వివక్షను చూశాను, ఎదుర్కొన్నాను కూడా. ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారిన ఈ తరంలో కూడా ఇలా ఉంటే మా నానమ్మ, ఇంకా ముందు తరాల వాళ్లు ఎంతటి వివక్షకు లోనయ్యారో కదా అనే ఆలోచన మెదలుతుండేది. మా ట్రస్ట్ హోమ్‌లో కులం లేని సమాజాన్ని సృష్టించగలిగాను. నేను లీగల్ గార్డియన్‌గా ‘జములమ్మ’ అనే అమ్మాయిని దత్తత చేసుకున్నాను. ఆ అమ్మాయి కులమేంటో చూడలేదు. వైద్యసహాయం అందిస్తున్న వారి కులాలూ చూడం. నేను రక్తదాతల సంఘం సభ్యురాలిని కూడా. రక్తం అవసరమైన పేషెంట్‌లు రక్తదాత కులాన్ని చూడరు.
సమంత చూపిన బాట!
మేము పేషెంట్‌కి వైద్యసహాయం కోసం ఎంపిక చేసుకునేటప్పుడు త్రీ పార్టీ ఫండింగ్ విధానాన్ని అవలంబిస్తుంటాం. మూడింట ఒకవంతు మేము సహాయం అందిస్తాం, ఒక వంతు పేషెంట్ కుటుంబీకులు, ఒక వంతు హాస్పిటల్ వైపు నుంచి బిల్లులో తగ్గింపు ఉండేటట్లు చూస్తాం. సరీ్వస్ విషయంలో సమంత ప్రభావం నా మీద ఎంతగా ఉందంటే... ఆమె చేనేతల ప్రమోషన్ కోసం పని చేస్తున్న సమయంలో నా వంతుగా ప్రకృతికి ఉపకరించే పని చేయాలని స్టూడియో బజిల్ హ్యాండ్‌లూమ్ క్లోతింగ్ బిజినెస్ పెట్టాను.
ఇన్నేళ్ల నా సరీ్వస్‌లో లెక్కకు మించిన పురస్కారాలందుకున్నాను. కానీ వాల్మీకి ఫౌండేషన్ నుంచి ఈ ఏడాది అందుకున్న ‘సేవాగురు’ గుర్తింపు ఎక్కువ సంతోషాన్నిచ్చింది. మావారు బినేశ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలేసి ‘వి హాంక్’ కోసమే పూర్తి సమయం పని చేయడం కూడా నాకు అందివచి్చన అవకాశం అనే చెప్పాలి. నన్ను నేను మలచుకోవడంలో బినేశ్ నాకు పెద్ద సపోర్ట్’’ అన్నారు శశాంక బినేశ్.
‘పోష్’ చైతన్యం
మహిళలు పని చేసే ప్రదేశాల్లో తప్పనిసరిగా ‘సెక్సువల్ హెరాస్‌మెంట్ రిడ్రెసల్ కమిటీ’ ఉండాలి. ధనలక్ష్మీ బ్యాంకు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీ సభ్యురాలిని. చాలా మంది మహిళలకు తమ పని ప్రదేశంలో అలాంటి కమిటీ ఉందనే సమాచారమే ఉండడం లేదు. ఇందుకోసం అవగాహన సదçస్సుల ద్వారా మహిళలను చైతన్యవంతం చేయడం నాకు చాలా సంతృప్తినిస్తోంది. సమస్య ఎదురైతే గళం విప్పాలనే తెగువ లేకపోవడం కంటే గళం విప్పవచ్చనే చైతన్యం కూడా లేకపోవడం శోచనీయం. నేను ధైర్యంగా ఇవన్నీ చేయడానికి మా నాన్న పెంపకమే కారణం.
‘ఆడవాళ్లు మానసికంగా శక్తిమంతులు. ఎన్ని అవాంతరాలెదురైనా అనుకున్న పనిని మధ్యలో వదలరు’ అని చెప్పేవారాయన. ‘మహిళ ఒకరి మీద ఆధారపడి, ఒకరి సహాయాన్ని అరి్థంచే స్థితిలో ఉండకూడదు. తన కాళ్లమీద తాను నిలబడి, మరొక మహిళకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉండాలి. సమాజం గురించి భయపడి వెనుకడుగు వేయవద్దు. జీవితం పట్ల నీ నిర్ణయం ప్రకారం ముందుకే వెళ్లాలి. నువ్వు విజయవంతమైతే సమాజమే నిన్ను అనుసరిస్తుంది’ అని చెప్పేవారు. నేను సాటి మహిళలకు చెప్పే మంచి మాట కూడా అదే.
– శశాంక బినేశ్, సోషల్ యాక్టివిస్ట్
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment