ఫిఫ్త్ జనరేషన్
గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన గౌరీ కిర్లోస్కర్ తమ కుటుంబ వ్యాపార విజయాల వెలుగులో మాత్రమే కనిపించాలనుకోలేదు. ‘కొత్తగా నేను ఏమీ చేయకపోయినా జీవితం సాఫీగా సాగిపోతుంది’ అనుకోలేదు. ‘ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యంలో నేను ఎక్కడ?’ అని ప్రశ్నించుకుంది. ఆ ప్రశ్నే ఆమెతో ఎన్నో ప్రయాణాలు చేయించింది.
ప్రతి ప్రయాణంలో విలువైన పాఠాలు నేర్చుకునేలా చేసింది. తమ కుటుంబ వ్యాపార చరిత్రలో తనకంటూ కొన్ని పుటలు ఉండాలనుకుంది. ఆమె ప్రయత్నం, కష్టం ఫలించాయి. ఫిప్త్ జెనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రసిద్ధ వ్యాపార సామ్రాజ్యమైన ‘కిర్లోస్కర్’లోకి అడుగుపెట్టిన గౌరీ కిర్లోస్కర్ తనను తాను నిరూపించుకుంది. తమ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించింది.
కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టినంత మాత్రానా ఎంటర్‌ప్రెన్యూర్‌గా వారిది నల్లేరు మీద నడక అనుకోవడానికి లేదు. తమను తాము నిరూపించుకొని ఫ్యామిలీ బిజినెస్‌కు మరింత బలాన్ని ఇచ్చేవారితో పాటు నిరూపించుకోలేక వెనుతిరిగేవారు కూడా ఉంటారు. గౌరీ కిర్లోస్కర్ మొదటి కోవకు చెందిన మహిళ.
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పోలిటికల్ సైన్స్(ఎల్‌ఎస్‌ఈ)లో చదువుకుంది. అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో ఫైనాన్స్‌లో డిగ్రీ చేసింది.
చదువు పూర్తి కాగానే తమ కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టి పెద్ద హోదాలో వెలిగిపోవచ్చు. అలా కాకుండా ఉద్యోగం చేయాలనుకుంది గౌరి.
ఉద్యోగం చేయాలనుకోవడానికి కారణం... తనను తాను నిరూపించుకోవడం..
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్‌గా ఉద్యోగ ప్రస్థానాన్ని ్రపారంభించింది. ఆ తరువాత ‘పియర్సన్ కార్పొరేట్ ఫైనాన్స్’లో స్ట్రాటజీ గ్రూప్‌లో చేరింది. ఉద్యోగజీవితంలో విలువైన అనుభవాలను సొంతం చేసుకుంది. ఈ అనుభవాలు ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన విజయాలకు బలమైన పునాదిగా నిలిచాయి.
మన దేశానికి తిరిగివచ్చిన గౌరి కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇక అప్పటినుంచి ‘కిర్లోస్కర్ గ్రూప్’లో వ్యూహాత్మక విధానాలపై దృష్టి పెట్టింది. బోర్డ్ మెంబర్‌గా సమీక్ష సమావేశాల్లో చురుగ్గా పాల్గొనడం ఒక కోణం అయితే ఎనర్జీ సెక్టర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలను అన్వేషించడం మరో కోణం.
‘ఆర్క్ ఫిన్ క్యాప్’కు సంబంధించి టీమ్ ఏర్పాటు, బిజినెస్ ΄్లానింగ్‌లో కీలకంగా వ్యవహరించింది.
పుణెలో కంపెనీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రధాన బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వహించింది. ఇంటర్నేషనల్ ్రపాపర్టీ కన్సల్టెంట్స్‌తో కలిసి పనిచేసింది. హెచ్‌ఆర్, బ్రాండింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్‌లో తనదైన ముద్ర వేసింది. పర్యావరణ కోణంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్)పై ప్రత్యేక దృష్టి పెట్టింది.
గౌరీ నాయకత్వంలో కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ గణనీయమైన వృద్ధిని సాధించింది. ‘ఇది కుదరదు’ అనుకునే చోట ప్రత్యామ్నాయాలు అన్వేషించి విజయం సాధించే నైపుణ్యం గౌరీలోఉంది.
‘మేము ఇంజిన్ మాన్యుఫాక్చరింగ్‌లోకి వచ్చినప్పుడు గ్లోబల్ కంపెనీలతో టై అప్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఉంటే టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ ద్వారా ఇంజిన్‌లను స్థానికంగానే తయారు చేసుకునే పరిస్థితి ఉండేది. ఇలాంటి అవకాశం లేకపోవడంతో సొంతంగా మాన్యుఫాక్చరింగ్ మొదలుపెట్టాం. సొంతంగా ఏదైనా చేయడం మొదలుపెట్టినప్పుడు మనదైన ఇంటెలెక్చువల్ ్రపాపర్టీ వృద్ధి చెందుతుంది’ అంటుంది గౌరీ.
గౌరీ కంపెనీ బీ2బీ, బీ2సి, ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే మూడు ప్రధానమైన బిజినెస్ సెగ్మెంట్‌లపై దృష్టి పెట్టింది. బీ2బీ బిజినెస్ ఇంటర్నల్ కంబాషన్ ఇంజిన్స్‌పై, బీ2సి బిజినెస్ వాటర్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్, వ్యవసాయ సంబంధిత వ్యాపారాలపై దృష్టి పెడుతుంది. ఇక ‘అర్క’ గ్రూప్ అనేది ఫైనాన్షియల్ సర్వీసెస్ సెగ్మెంట్.
స్థూలంగా చెప్పాలంటే...
ఉన్నత విద్యాలయాల్లో చదువుకున్న చదువు, ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలు, వ్యూహాత్మక దృక్పథం వ్యాపార ప్రపంచంలో గౌరీని ఉన్నత స్థానంలో నిలిపాయి. మూలాలకు తిరిగి రావడం అనేది గణనీయమైన వ్యాపార విజయానికి ఎలా దారితీస్తుందో చెప్పడానికి గౌరీ కిర్లోస్కర్ పేరును ప్రముఖంగా ప్రస్తావించవచ్చు.
ఉత్సాహ బలం
వ్యాపార ప్రపంచానికి అవతలి విషయానికి వస్తే... గౌరీ కిర్లోస్కర్‌కు యోగా చేయడం, స్క్వాష్, డైవింగ్ అంటే ఇష్టం. ప్రకృతి ప్రేమికురాలైన గౌరీకి తన కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్లడం అంటే ఇష్టం. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్‌ల గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియాపై కూడా ఆసక్తి ప్రదర్శిస్తుంది. ఒక పుస్తకం చదివినప్పుడో, ఉపన్యాసం విన్నప్పుడో తనకు నచ్చిన వాక్యాన్ని, మాటను నోట్ చేసుకోవడం గౌరీకి ఇష్టం. ‘ఏ పని చేసినా ఉత్సాహంతో చేయాలి. ఉత్సాహమే అనంతమైన శక్తి’ అంటుంది గౌరీ కిర్లోస్కర్.
Comments
Please login to add a commentAdd a comment