ఓ పండు కన్నతల్లిని కాపాడింది... కన్న బిడ్డను రక్షించింది. ఒక బిడ్డగా ఒక తల్లిగా ఎదురైన అనుభవాలు... ఆమె జీవితాన్ని కొత్త మలుపు తిప్పాయి. కంప్యూటర్స్ నుంచి పంటపొలానికి దారి మళ్లించాయి. పంట పొలం నుంచి పరిశ్రమ దిశగా నడిపించాయి.
‘ఎన్‌ఆర్‌ఐలు ఇండియాలో వెయ్యి రూపాయలు చాలా సులువుగా ఖర్చు చేయగలుగుతారు. తిరిగి తాము పనిచేసే దేశాల్లో అంత డబ్బును సులువుగా సంపాదించుకోవచ్చనే ధీమా అది. అదే ఎన్‌ఆర్‌ఐలు ఇండియాలో వెయ్యి రూపాయలు సంపాదించడం చాలా కష్టం’ అన్నారు చికోటి కీర్తి. జీవితం నేర్పించిన పాఠాలనుంచి ఆమె తెలుసుకున్న జ్ఞానం అది. ‘నా జీవితమే నన్ను నడిపించింది.
హైదరాబాద్‌లో కంప్యూటర్ సెంటర్ నిర్వహించి, పెళ్లితో నైజీరియా వెళ్లాను. ముగ్గురు పిల్లల తల్లిగా ఇండియాకి వచ్చి నా సవాళ్లకు జవాబుల కోసం అన్వేషణ మొదలు పెట్టాను. సంజీవనిలాంటి పరిష్కారం దొరికింది. తొగరు పండు నన్ను పారిశ్రామికవేత్తగా మార్చింది’ అని క్లుప్తంగా వివరించారు కీర్తి. విజయవంతమైన కీర్తి ప్రయోగాల జీవితం ఇలా సాగింది.
బాబు తక్కువ బరువుతో పుట్టాడు
‘‘నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. బీఎస్సీ కంప్యూటర్స్ చేసి లిబర్టీ సెంటర్‌లో కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించాను. నాన్న నైజీరియాలో మెకానికల్ ఇంజనీర్, అమ్మ మా కోసం గాంధీ హాస్పిటల్‌లో గవర్నమెంట్ ఉద్యోగం మానేసింది. మూడు నెలలకోసారి ఎవరో ఒకరు ఇండియా– నైజీరియాల మధ్య ప్రయాణించేవాళ్లం. పెళ్లి కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్న ఇక్కడి అబ్బాయితో కుదరడం యాదృచ్ఛికమే. నా పిల్లలు ఇండియాలోనే పుట్టాలనే ఆకాంక్ష కొద్దీ మూడు డెలివరీలకూ ఇండియాలోనే ప్లాన్ చేసుకున్నాను.
రెండవసారి గర్భిణిగా ఉన్న సమయంలో సరిగ్గా ఏడవ నెలలో అమ్మ ఆరోగ్యం మా కుటుంబాన్ని కుదిపేసింది. అక్కడ (నైజీరియా) మలేరియా సర్వసాధారణం. అమ్మకు మలేరియా మెదడుకు సోకడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. అక్కడ అన్నిరకాల వైద్యం అందించిన తర్వాత ఇండియాకి తీసుకువచ్చి డాక్టర్ సూచనతో నోని ఫ్రూట్ (తొగరు పండు) జ్యూస్ పట్టించాం. ఆమె రికవరీ స్పీడ్ మాకే ఆశ్చర్యం కలిగింది. నా డెలివరీ టైముకు పూర్తిగా కోలుకుని అంతా తనే చూసుకుంది.
నాకది మిరకిల్. అయితే ఆ మిరకిల్ నా తదుపరి జీవితానికి ఒక సంకేతమని ఆ తర్వాత తెలిసింది. నాకు బాబు డౌన్ సిండ్రోమ్‌తో పుట్టాడు. బరువు ఒకటిరన్నర కిలోలు. మేము ఏ మాత్రం ఊహించని పరిణామం అది. నాలుగు నెలలు నిండినా బరువు గ్రాము కూడా పెరగ లేదు. డాక్టర్‌లు ఏ భరోసా ఇవ్వలేకపోయారు. అప్పుడు అమ్మ తనను కాపాడిన నోని జ్యూస్ బాబు ఆరోగ్యాన్ని కూడా బాగు చేస్తుందేమో చూద్దామన్నది. దేవుడి మీద భారం వేసి పట్టించాం. నెల రోజుల్లో ఏడు వందల గ్రాములు పెరిగాడు. అప్పటి నుంచి నోని మీద రీసెర్చ్ మొదలు పెట్టాను.
కంపెనీ మాట మార్చింది
మార్కెట్‌లో ఉన్న నోని ఫ్రూట్ జ్యూస్ కంపెనీలను సంప్రదించాను. ఇదీ అదీ అనే తేడా లేకుండా అందుబాటులో ఉన్న సమాచారాన్నంతటినీ సేకరించి అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. అదే సమయంలో అమ్మ ఆరోగ్య దృష్ట్యా నాన్న బయటి దేశాల్లో ఉండడానికి ఇష్టపడక ఉద్యోగం మానేసి ఇండియాకి వచ్చేశారు. ఆయన తనకంటూ వ్యాపకం కోసం వ్యవసాయం చేయాలనుకున్నారు. అలా పదెకరాల పొలం కొని తొగరు చెట్లను పెంచాం. ఓ కంపెనీ ఇచ్చిన భరోసాతో పంటను యాభై ఎకరాలకు విస్తరించాం.
అయితే పంట పెద్ద మొత్తంలో వచ్చే సమయానికి కంపెనీ మాకిచ్చే ధర తగ్గించింది. ఖర్చులు కూడా రానంత తక్కువ ధరకు అమ్మడంకంటే ఈ పండ్లతో మనమే పరిశ్రమ స్థాపిద్దామనే ఆలోచన వచ్చింది. అప్పటి వరకు మా కుటుంబ అవసరాలకు తగినట్లు తయారు చేస్తున్న జ్యూస్, లోషన్, షాంపూ, హెయిర్ ఆయిల్ వంటి మొత్తం పాతిక రకాల ఉత్పత్తులను పెద్ద మొత్తంలో తయారు చేసి ‘చెక్ బయో ఆర్గానిక్స్’ పేరుతో మార్కెట్‌లోకి వచ్చాం. మా పొలంలో పండించి తయారు చేయడం వల్ల క్వాలిటీ విషయంలో మోసపోవడం, రాజీ పడడం రెండూ ఉండవు.
మా అమ్మను, నా బిడ్డను కాపాడిన ఈ పండులోని ఔషధగుణాలను ప్రపంచానికి తెలియచేయాలనే సంకల్పంతో సంజీవని వంటి ఈ పండును ఎన్ని రకాలుగా అందించవచ్చనే పరిశోధనలు చేస్తున్నాను. ప్రభుత్వ అనుమతుల ప్రకారం సర్టిఫికేట్‌లతోపాటు నాచురల్ హెల్త్ సైన్స్ అసోసియేషన్ అవార్డు, ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ పురస్కారం అందుకున్నాను’’ అని తాను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన వైనాన్ని వివరించారామె. ‘పరిశ్రమ స్థాపించిన ప్రతి మహిళ వెనుక ఒక కథ ఉంటుంది. అందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ’ అన్నారు కీర్తి.
సంజీవని పండుతో పరిశోధన
తొగరు చెట్లు చలిని తట్టుకోలేవు. పాశ్చాత్య దేశాల్లో ఈ పండు మీద పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఈ పంట అక్కడ పండదు. కాబట్టి ఎన్నో ఔషధగుణాలున్న సంజీవని వంటి ఈ పండుకు ప్రచారం కూడా పెద్దగా లభించలేదు. ఈ పండు నేరుగా మన దేహంలోని కణాల మీద పనిచేస్తుంది. అనేక రోగాలను నయం చేస్తుంది. కణాల శక్తిని పెంచి, దేహాన్ని వ్యర్థరహితం, విషరహితం చేస్తుంది. క్యాన్సర్ పేషెంట్‌లకు కూడా మంచి గుణాన్నిస్తుంది. అనారోగ్యాలు వచ్చిన తర్వాత స్వస్థత కోసం వాడడమే కాదు. మామూలు వాళ్లు కూడా రోజుకు 30 మిల్లీలీటర్ల రసం తాగితే సమగ్రమైన ఆరోగ్యం చేకూరుతుంది. రసాయన రహితంగా తయారు చేస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ వచ్చింది. ఆయుష్ అనుమతి కోసం అప్లయ్ చేశాను.
– చికోటి కీర్తి
ఫౌండర్, చెక్ బయో ఆర్గానిక్స్
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment