Minister Ajmer Chandulal
-
పాఠశాల స్థాయిలోనే కంప్యూటర్ విద్య
ఎస్టీ సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్ సాక్షి, హైదరాబాద్: గిరిజనులకు పాఠశాల స్థాయిలోనే కంప్యూటర్ విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్టీ సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆదేశించారు. ఎస్టీ విద్యాసంస్థల బలోపేతంతో పాటు, అదనపు సౌకర్యాల కల్పనకు రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. విద్యాసంవత్సరం మొదలయ్యే నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు, ఇతర సదుపాయాలను కల్పించనున్నట్లు తెలియజేశారు. మంగళవారం సచివాలయంలో గిరిజన ఉప ప్రణాళిక అమలు తీరును మంత్రి సమీక్షించారు. సబ్‌ప్లాన్ లక్ష్యాలను సాధించేందుకు ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి అన్ని విభాగాలను సమీక్షిస్తామన్నారు. ఇందుకు తగినట్లుగా ఫలితాలను సాధించలేకపోతే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గిరిజన సబ్‌ప్లాన్‌లో వ్యక్తిగత ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల పేర్లను తమ శాఖ వెబ్సైట్లో ఉంచాలని, ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. గిరిజన తండాలకు రోడ్ల కల్పనకు పంచాయతీరాజ్‌శాఖ ద్వారా రూ.230 కోట్లు, గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రూ.145 కోట్లు ఖర్చుచేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామలక్ష్మణ్, ఎస్టీ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్, కమిషనర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. -
మేడారంలో భక్తులకు శాశ్వత సౌకర్యాలు
- మంత్రి చందూలాల్ హైదరాబాద్ రెండేళ్లకొకసారి వచ్చే జాతర సమయంలోనే కాకుండా ఏడాది పొడుగునా మేడారాన్ని సందర్శించే భక్తులకు శాశ్వత ప్రాతిపదికన సౌకర్యాలను సమకూర్చనున్నట్లు గిరిజనసంక్షేమ, పర్యాటకశాఖల మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. గిరిజన పర్యాటకంలో భాగంగా మేడారంతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతంలోని కాకతీయుల కాలం నాటి సుందరమైన చెరువులు, రమణీయ ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే ప్రతి జిల్లాలో పర్యాటక అభివృద్ధి సమన్వయ మండలిని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మేడారం జాతరకు అంతర్జాతీయ గుర్తింపు లభించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. సమ్మక్క,సారలమ్మలకు సీఎం కేసీఆర్ తరఫున మొక్కులు చెల్లించిన మంత్రి చందూలాల్ ఆదివారం సీఎంకు ఆయన నివాసంలో అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. జాతరను నిర్వహించిన తీరును, భక్తులకు కల్పించిన సౌకర్యాలను గురించి మంత్రిని సీఎం అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఏర్పాడ్డక తొలిసారిగా జరిగిన మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించినందుకు మంత్రి చందూలాల్‌ను సీఎం కేసీఆర్ అభినందించారు. శాతావాహన,కాకతీయుల చారిత్రక, వారసత్వ సంపద కట్టడాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి పర్యాటకకేంద్రాలుగా అభివృద్ధిచేయాలని తనను సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలియజేశారు. రెండేళ్ల తర్వాత వచ్చే మేడారం జాతరను జాతీయపండుగగా జరుపుకుంటామన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాలను పర్యాటకప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులు మంజూరుచేస్తామని సీఎం హామీనిచ్చారని మంత్రి చందూలాల్ తెలిపారు. -
త్వరలో ‘నిర్మల్’ సబ్బులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కార్యక్రమాలు విస్తరించి, పటిష్టం చేసేందుకు ఆయా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అయితే ఉమ్మడి జీసీసీ విభజనలో జాప్యం జరుగుతుండటంతో ఈ ప్రతిపాదనలు అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలు, ఇక్కడి అటవీ ఫలసాయాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదని, అందుకే జీసీసీని బలోపేతం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు కొత్త డివిజన్లు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఒకటి మహబూబ్‌నగర్ జిల్లా మన్ననూర్ లేదా నల్లగొండలో, రెండోది మెదక్ జిల్లా నరసాపూర్‌లో ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా పరిగి, మెదక్ జిల్లా నరసాపూర్, నల్లగొండ జిల్లా చందంపేట, మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లో 4 కొత్త సొసైటీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. గమ్‌కరాయ (తప్సిజిగురు), నక్స్‌వోమికా, మొహ్వా, పొంగుమా, వేప, చింతపండు తదితర అటవీ ఉత్పత్తుల కోసం అడవుల్లో మొక్కల పెంపకం వంటి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. 8 కొత్త ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు..! రాష్ర్టంలోని గిరిజన ప్రాంతాల్లో సేకరించిన అటవీ ఉత్పత్తుల నుంచి ఆయా వస్తువుల తయారీ, శుద్ధి చేసే కేంద్రాలు లేవు. ఇందుకోసం 8 తయారీ, శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. వరంగల్ జిల్లా ములుగులో జిగురు శుద్ధి యూనిట్, వరంగల్ జిల్లా ఏటూరునాగారంలో పసుపు పొడి కేంద్రం, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో సబ్బుల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అలాగే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో సోయా ప్రాసెసింగ్ యూనిట్, నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో తేనె శుద్ధి కేంద్రం, మహబూబ్‌నగర్ జిల్లా కొండనాగులలో షాంపూ తయారీ కేంద్రం, మహబూబ్‌నగర్ జిల్లా కొండనాగులలో చింతపండు ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పాలని భావిస్తోంది. గిరిజన సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు నాణ్యమైన ఉత్పత్తులు పంపిణీ చేసేందుకు వీలుగాహైదరాబాద్‌లో వివిధ ఉత్పత్తుల నిలువకు కోల్డ్‌స్టోరేజీ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను గతంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ విడుదల చేశారు. -
తెలంగాణ జీసీసీ తొలి యాక్షన్‌ప్లాన్
రూ. 150 కోట్లతో ప్లాన్ సిద్ధం చేసిన మంత్రి చందూలాల్ హైదరాబాద్: తెలంగాణ గిరిజన సహకార సంస్థ(జీసీసీ) 2015-16కు సంబంధించి రూ.150 కోట్ల ప్రతిపాదనలతో తొలి కార్యాచరణ ప్రణాళికను గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ విడుదల చేశారు. రాష్ర్టంలోని 4 ఐటీడీఏల పరిధిలోని 18 సొసైటీ కార్యాలయాల ద్వారా ఆయా కార్యకలాపాలను నిర్వహించనున్నారు. ఉట్నూరు ఐటీడీఏ పరిధిలోని 6 సొసైటీల ద్వా రా రూ.48 కోట్లు, ఎటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని 4 సొసైటీల ద్వారా రూ.45 కోట్లు, భద్రాచలం ఐ టీడీఏ పరిధిలోని 6 సొసైటీల ద్వారా రూ. 44 కోట్లు, మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని 2 సొసైటీల ద్వారా రూ. 12 కోట్ల మేర కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రతిపాదనలిచ్చారు. -
ఓట్లేయనోళ్లకు పనులెట్లా చేయాలె..
కన్నాయిగూడెం ప్రజలతో మంత్రి చందూలాల్ ములుగు: మాకు ఓట్లు వేయనోళ్లకు మేము ఎట్లా పని చేసి పెట్టాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ వరంగల్ జిల్లా ములుగు మండలం కన్నాయిగూడెం ప్రజల ను ప్రశ్నించారు. కన్నాయిగూడెంలో మంగళవారం బీటీ రోడ్డు ప్రారంభోత్సవానికి మంత్రి వచ్చారు. నియోజకవర్గంలోని అన్నిరోడ్లు పూర్తయ్యాక ఈ పనులు ప్రారంభిస్తామని అన్నారు. పంచాయతీ, పీఏసీఎస్, ఎంపీటీసీ ఎన్నికల్లో గ్రామస్తులు సహకరించలేదని గుర్తు చేశారు. తర్వాత తేరుకున్న మంత్రి గ్రామపెద్దలను పిలిపించుకొని తన ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు. చివరికి ఆయన రోడ్డు పనులను ప్రారంభించారు. -
ప్రక్షాళన .. గిరిజనశాఖ లక్ష్యం
‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి అజ్మీరా చందూలాల్ సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసి, ప్రణాళికాబద్ధంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని ఆ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ వెల్లడించారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నామన్నారు. మంత్రి చందూలాల్ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వెల్లడించారు. హాస్టళ్లను రీమోడల్ చేసి విద్యార్థులకు 1 ప్లస్ 1 బెడ్లు, ఆర్ఓ వాటర్ప్లాంట్లు, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో(2015-16)ఏ నెలలో ఏయే పనులను పూర్తిచేయాలి అన్నదానిపై దృష్టిసారించినట్లు చెప్పారు. స్కూళ్లు, హాస్టళ్లు ప్రారంభమయ్యేలోగా విద్యార్థులకు బట్టలు,పుస్తకాలు, ఇతర సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కొందరు అధికారుల్లో నిర్లిప్తత, సరైన దృక్పథంతో పనిచేయకపోవడం వల్ల గత ఏడాది రూ.150 కోట్ల మేర స్కాలర్షిప్ నిధులు మురిగిపోయాయని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఇకముందు అలా జరగనివ్వమన్నారు. హాస్టళ్లలోని విద్యార్థినులకు కాస్మోటిక్చార్జీలను రూ.75 నుంచి రూ.200లకు, అబ్బాయిలకు రూ. 50 నుంచి రూ.150కు పెంచాలనే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించినట్లు చెప్పారు. గిరిజన ఇంజనీర్లను కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతాం... ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ పూర్తిచేసిన గిరిజన విద్యార్థులకు హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్‌లో ప్రత్యేక శిక్షణను అందించి వారు కాంట్రాక్టర్లుగా ఎదిగేలా కృషి చేయనున్నట్లు మంత్రి చందూలాల్ తెలిపారు. జిల్లాల్లో ఉన్న 3,4 యూత్ హాస్టళ్లను బడిమానేసిన, చదువుకు దూరమైన గిరిజన బాల,బాలికలకు శిక్షణనిచ్చే కేంద్రాలుగా రూపొందించాలనే యోచిస్తున్నామన్నారు.పది, ఇంటర్ చదివిన పిల్లలకు ఆయా వృత్తుల్లో శిక్షణ, ఇతరత్రా నైఫుణ్యాల పెంపుదలలో శిక్షణనిస్తామన్నారు. దీనిని ఈ జూన్ నుంచి ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. వచ్చే ఏడాది వంద శాతం సాధించేలా ప్రణాళికలు... గిరిజన గురుకులాల విద్యార్థులు ఇంటర్లో 84.37 శాతం ఫలితాలను సాధించారని, వచ్చే ఏడాది వందశాతం ఫలితాలను సాధించేలా ప్రత్యేక చర్యలను చేపడతామన్నారు. అరకొరగా టీచర్లున్నా, అంతగా సదుపాయాలు లేకపోయినా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా సంబంధిత అధికారులు, సిబ్బంది కృషిచేశారని అభినందించారు. ఇంటర్లో ఫెయిలైన విద్యార్థులు అడ్వాన్స్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులయ్యేలా, అన్నిజిల్లాల్లో ప్రత్యేకశిక్షణను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇతర శాఖల్లో పనిచేస్తున్న తమ శాఖ అధికారుల డిప్యుటేషన్లను రద్దుచేసినట్లు మంత్రి వెల్లడించారు.సీఆర్టీ కింద 2 వేల మంది టీచర్లు నెలకు రూ.5 వేల వేతనంతో పనిచేస్తున్నారని, వీరి సర్వీసులను క్రమబద్దీకరించాలనే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపిం చినట్లు మంత్రి చందూలాల్ తెలియజేశారు. -
అద్భుతం.. కృష్ణాతీరం
పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి కృష్ణానదిలో 3గంటల బోటు ప్రయాణం కొల్లాపూర్: నల్లమల కొండల మధ్య కృష్ణానదిపై బోటుప్రయాణం అద్భుతంగా.. ఆహ్లాదకరంగా ఉందని పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. శనివారం ఆయన కొల్లాపూర్‌లోని పలు ఆధ్యాత్మిక ఆలయాలు, కృష్ణానదీ తీరప్రాంతాన్ని జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్‌తో కలిసి సందర్శించారు. ముందుగా జటప్రోల్ మదనగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించి రాతిశిల్పాలను పరిశీలించారు. అనంతరం కొల్లాపూర్‌లోని మాదవస్వామి దేవాలయాన్ని సందర్శించి ఆలయవిశిష్టత తెలుసుకున్నారు. అక్కడినుంచి నేరుగా సోమశిలకు చేరుకుని లలితాంబికా సోమేశ్వరాలయంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు. సమీపంలోని కృష్ణానదీ తీరప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం కొల్లాపూర్‌లోని సురభిరాజుల బంగ్లాను తిలకించారు. బంగ్లాలో రాజులు వాడిన వస్తువులు, వారు వేటాడిని జంతుచర్మాలతో రూపొందించిన బొమ్మలు, అద్భుతమైన చిత్రకళా సంపదను చూసి ముగ్ధులయ్యారు. బంగ్లాలోని రాణిమహాల్, చంద్రమహాల్, మంత్రమహాల్, షాదీమహల్‌ను వీక్షించారు. సోమశిల సోమేశ్వరాలయం, కృష్ణాతీరప్రాంతం, జటప్రోల్ మద నగోపాలస్వామి ఆలయం, ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టును పర్యాటకప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యాటక మంత్రికి వివరించారు. బంగ్లా సందర్శన అనంతరం మంత్రులు సింగోటంలోని శ్రీవారి సముద్రం చెరువును తిలకించారు. ఉల్లాసంగా పడవ ప్రయాణం.. సోమశిల నుంచి శ్రీశైలం వరకూ పర్యాటక బోట్లను ఏర్పాటుచేయాలని పర్యాటక శాఖ బావిస్తున్న నేపథ్యంలో తీరప్రాంతం అందాలను మంత్రులు తిలకించారు. శ్రీశైలం నుంచి తెప్పించిన పర్యాటక బోటులో మూడుగంటల పాటు ప్రయాణించారు. సోమశిల నుంచి 15కి.మీ దూరంలో ఉన్న అంకాలమ్మ కోట, చీమలతిప్ప దీవి వరకు బోటులో ప్రయాణించి వెనక్కివిచ్చేశారు. నదీ ప్రయాణంలో కోతిగుండు నుంచి ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు చేరే బ్యాక్‌వాటర్‌ను తిలకించారు. అమరగిరి గ్రామ అందాలను కృష్ణాతీరం వెంట ఉన్న మత్స్యకారుల ఆవాసాలను, రాతికొండలను చూస్తూ ఉత్సాహంగా బోటుప్రయాణం సాగించారు. పాపికొండలను తలపించే రీతిలో నదీప్రవాహం ఉందని మంత్రులు అన్నారు. బోటు ప్రయాణం సాగినంతసేపూ మంత్రులు ఉత్సాహంగా గడిపారు. -
చరిత్రను వెలికి తీయాలి
మంత్రి అజ్మీరా చందూలాల్ కేయూ క్యాంపస్ : సమైకాంధ్ర పాలనలో మరుగునపడిన తెలంగాణ చరిత్రను వెలికి తీయాల్సిన అవసరం ఉందనిమంత్రి ఆజ్మీరాచందులాల్ కోరారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ హిస్టరీ, అండ్ టూరిజం మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో 35వ సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సులో ఆయన మాట్లాడారు. బంగారు తెలంగాణ సాధించుకునే దిశగా సీఎం కేసీఆర్ అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపట్టుతున్నారన్నారు. చరిత్ర పరిశోధించి అనేక రకాలచరిత్ర సంస్కృతులను కాపాడుకోవాలన్నారు. మహబూబాబాద్ ఎంపీ ఆజ్మీర సీతారంనాయక్ మాట్లాడుతూ సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌ను కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించటం అభినందనీయమన్నారు. జిల్లాలో 61 టూరిజం ప్లేస్లున్నాయన్నారు. ఈ ప్రాంతంలో ఓ మూజియంను కూడా ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఐసీహెచ్ఆర్ చైర్మన్ ప్రొఫెసర్ సుదర్శన్‌రావు, కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవి రంగారావు, సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ అయాబ్అలీఖాన్, జనరల్ ప్రసిడెంట్ ఆర్ మిశ్రా, ప్రొఫెసర్ వి కిషన్‌రావు, లోకల్ సెక్రటరీ కేయూ హిస్టరీ విభాగం అధిపతి డాక్టర్ పి.సదానందం మాట్లాడారు. హిస్టరీ కాంగ్రెస్ ప్రొసీడింగ్స్ సీడీలను ఆవిష్కరించారు. తుంకూరు యూనివర్సిటీమాజీ వీసీ ప్రొఫెసర్ అనంతరామయ్య, మద్రాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జగదీశం, చంద్రబాబు, గౌతమ్, కేరళ యూనివర్సిటీ ప్రొఫెసర్శోభనం, మదురై యూనివర్సిటీ ప్రొఫెసర్ డేనియల్, డాక్టర్ అబ్బాస్ కేయూ హిస్టరీ విభాగం ప్రొఫెసర్టి దయాకర్‌రావు, ప్రొఫెసర్ టి విజయబాబు,ప్రొఫెసర్ శ్రీనాధ్,డాక్టర్ టిమనోహర్ ,పరిశోధకులు వివిధ చోట్లనుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు.