- మంత్రి చందూలాల్
హైదరాబాద్
రెండేళ్లకొకసారి వచ్చే జాతర సమయంలోనే కాకుండా ఏడాది పొడుగునా మేడారాన్ని సందర్శించే భక్తులకు శాశ్వత ప్రాతిపదికన సౌకర్యాలను సమకూర్చనున్నట్లు గిరిజనసంక్షేమ, పర్యాటకశాఖల మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. గిరిజన పర్యాటకంలో భాగంగా మేడారంతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతంలోని కాకతీయుల కాలం నాటి సుందరమైన చెరువులు, రమణీయ ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే ప్రతి జిల్లాలో పర్యాటక అభివృద్ధి సమన్వయ మండలిని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మేడారం జాతరకు అంతర్జాతీయ గుర్తింపు లభించేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
సమ్మక్క,సారలమ్మలకు సీఎం కేసీఆర్ తరఫున మొక్కులు చెల్లించిన మంత్రి చందూలాల్ ఆదివారం సీఎంకు ఆయన నివాసంలో అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. జాతరను నిర్వహించిన తీరును, భక్తులకు కల్పించిన సౌకర్యాలను గురించి మంత్రిని సీఎం అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఏర్పాడ్డక తొలిసారిగా జరిగిన మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించినందుకు మంత్రి చందూలాల్‌ను సీఎం కేసీఆర్ అభినందించారు.
శాతావాహన,కాకతీయుల చారిత్రక, వారసత్వ సంపద కట్టడాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి పర్యాటకకేంద్రాలుగా అభివృద్ధిచేయాలని తనను సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలియజేశారు. రెండేళ్ల తర్వాత వచ్చే మేడారం జాతరను జాతీయపండుగగా జరుపుకుంటామన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాలను పర్యాటకప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులు మంజూరుచేస్తామని సీఎం హామీనిచ్చారని మంత్రి చందూలాల్ తెలిపారు.