శుక్రవారం సీఎస్ ఎస్‌కే జోషికి నివేదిక సమర్పించిన అనంతరం సచివాలయం సీబ్లాక్ నుంచి బయటకు వస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఉద్యోగ సంఘాల నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న జోన్లలో పేర్కొన్న పలు జిల్లాలను మార్చాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ తీర్మానించింది. కీలకమైన జిల్లా స్థాయి పోస్టుల్లో ప్రస్తుతమున్న 80 శాతం లోకల్ కోటాను 85 శాతానికి పెంచాలని.. ఓపెన్ కోటాను 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని కోరింది. ఇటీవల సీఎం కేసీఆర్ సమక్షంలో నిర్ణయించిన జోన్ల అంశంపై జేఏసీ శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమై చర్చించింది.
తాము ఐదు లేదా ఆరు జోన్లు అడిగితే.. ముఖ్యమంత్రి ఏడు జోన్ల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని, ఇది తెలంగాణలోని అన్ని ప్రాంతాల నిరుద్యోగులకు మేలు చేస్తుందని జేఏసీ అభిప్రాయపడింది. దీనిపై సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేసింది. అలాగే మరికొన్ని స్వల్ప మార్పులు చేయాలని జేఏసీ తీర్మానించింది. చార్మినార్ జోన్‌లో ఉండేలా ప్రతిపాదించిన రంగారెడ్డి జిల్లాను జోగులాంబ జోన్‌లో కలపాలని, యాదాద్రి జోన్‌లో ప్రతిపాదించిన జనగామ జిల్లాను భద్రాద్రి జోన్‌లో, జోగులాంబ జోన్‌లో ప్రతిపాదించిన వికారాబాద్‌ను చార్మినార్ జోన్‌లో కలపాలని అందులో పేర్కొంది. ఇక భద్రాద్రి జోన్‌గా పెట్టిన పేరును భద్రాద్రి–కాకతీయ జోన్‌గా మార్చాలని తీర్మానించింది.
నాలుగు కేడర్లే ఉండాలి..
జిల్లా స్థాయి నుంచి విభాగాధిపతి కార్యాలయానికి/సచివాలయానికి పరస్పర బదిలీలు ఉండాలని ఉద్యోగ సంఘాల జేఏసీ తీర్మానించింది. అందులో అన్ని జోన్లకు సమాన భాగస్వామ్యం ఉండాలని పేర్కొంది. రాష్ట్రంలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్, స్టేట్ వంటి నాలుగు రకాల కేడర్ పోస్టులే ఉండాలని కోరింది. తెలంగాణ యువతకు వీలైనంత ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించాలని, విభాగాధిపతి/సెక్రటేరియట్ పోస్టులు మినహా స్టేట్ కేడర్ పోస్టులను మల్టీ జోనల్ పోస్టులుగా మార్చాలని సూచించింది.
ఈ మేరకు రూపొందించిన నివేదికను శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి అందజేసింది. అలాగే శాఖల వారీగా, కేటగిరీల వారీగా పోస్టులకు సంబంధించిన సమగ్ర వివరాలను వేరుగా అందజేస్తామని పేర్కొంది. సమావేశంలో టీజీవో చైర్మన్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, జోనల్ కమిటీల సమన్వయకర్త దేవీప్రసాద్, టీఈజేఏసీ చైర్మన్ కె.రవీందర్‌రెడ్డి, సెక్రెటరీ జనరల్ వి.మమత, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
10 జోన్లు ఏర్పాటు చేయాలి: సరోత్తంరెడ్డి
కొత్తగా 31 జిల్లాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. పాత పది జిల్లాలను పది జోన్లుగా ఏర్పాటు చేయాలని పీఆర్టీయూ అధ్యక్షుడు పి.సరోత్తంరెడ్డి కోరారు. ఈ మేరకు మార్పులు తెచ్చేలా చర్యలు చేపట్టాలని శుక్రవారం జోనల్ కమిటీల సమన్వయకర్త దేవీప్రసాద్‌ను కలసి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment