
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్ని శాఖలు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎస్.కె.జోషి అధికారులను ఆదేశించారు. గోల్కొండ కోటలో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు.
సీఎం కేసీఆర్ ఆగస్టు 15న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఉన్న అమర జవానుల స్మారక స్తూపం వద్ద నివాళులర్పించిన తర్వాత గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారని సీఎస్ చెప్పారు. తెలంగాణ వైభవాన్ని చాటిచెప్పే విధంగా వివిధ కళారూపాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమ నిర్వహణపై హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఎండీ దానకిషోర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా, ఇతర అధికారులతో చర్చించారు.