కేసీఆర్ వల్లే వ్యవసాయ సంక్షోభం: ఉత్తమ్
హైదరాబాద్ : దివంగత ప్రధాని ఇందిరగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఆహారధాన్యాలు దిగుమతి చేసుకునేవారమని.. ఈరోజు ఎగుమతి చేసే స్థాయికి వచ్చామని, ఇదంతా ఇందిర గాంధీ ఘనతేనని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలో ఉందని, దీనికి కారణం మోదీ, కేసీఆర్లే కారణమన్నారు. మధ్యప్రదేశ్లో రైతులను కాల్చి చంపిన ఘనత బీజేపీదేనని మండిపడ్డారు. మిర్చీ రైతులకు బేడీలు వేయించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు.
రైతులకు న్యాయసాయం అందిస్తున్నామని, వారంలో రూ.లక్ష చొప్పున సాయం చేస్తామన్నారు. బంగారు తెలంగాణలో రైతులకు ఆత్మహత్యలే శరణ్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజుకీ నాలుగో విడత రుణమాఫీ అందలేదని అన్నారు. వడ్డీ ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్ అసెంబ్లీలో హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని మరచిపోయారని గుర్తు చేశారు. ఎలక్షన్ ఏడాదిలో ఎకరానికి నాలుగు వేల రూపాయలు ఇస్తామనడం ఎలక్షన్ జిమ్మిక్కు మాత్రమేనని స్పష్టం చేశారు. 2019లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, వెంటనే రైతు రాజ్యం ఏర్పాటు చేస్తామని తెలిపారు.