
మఠంపల్లి (హుజూర్‌నగర్): ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని, మోదీని చూస్తే కేసీఆర్, ఆయన కుమారుడు కె. తారక రామారావులకు లాగులు తడుస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రత్యేక హెలికాçప్టర్‌లో మట్టపల్లికి వచ్చిన ఆయన మొదట శ్రీలక్ష్మీనర్సింహ స్వామి దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం స్థానిక ఎన్‌సీఎల్ అతిథిగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోదీతో కుమ్మక్కైన కేసీఆర్.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదని అన్నారు.
మట్టపల్లి క్షేత్రాన్ని రానున్న ప్రజాకూటమి ప్రభుత్వంలో మరో యాదాద్రిలా చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేయడంతోపాటు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రేషన్ దుకాణంలో 9 రకాల సరుకులను అందజేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్రం విడిపోయే సమయంలో విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీలను నాలుగేళ్లలోనే సాధిస్తామన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందజేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజా కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబు ఏ విధంగా అడ్డుపడ్డారో కేసీఆర్, కేటీఆర్‌లు తెలపాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట ప్రజాకూటమి నాయకులు బండ్ల గణేశ్, అనిల్‌కుమార్, కిరణ్మయి, హరిబాబు, చంద్రశేఖర్, మంజీనాయక్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment