
హుజూర్‌నగర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం కొనసాగుతోందన్న విషయం ఇప్పటికే అనేక విషయాల్లో తేటతెల్లమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు పాసయ్యేందుకు కీలక పాత్ర పోషించిన లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌కు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వకుండా.. సీఎం కేసీఆర్ బీజేపీ అభ్యర్థికి మద్దతు పలికారని గుర్తుచేశారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికలు, పెద్దనోట్ల రద్దు, లోపాలతో జీఎస్‌టీ బిల్లును బీజేపీ తీసుకొస్తే ఆ బిల్లుకు కూడా కేసీఆర్ మద్దతు పలికారన్నారు. తెలంగాణ బిల్లులో రాష్ట్రానికి రావాల్సిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజీపేట రైల్వే కోచ్, గిరిజన వర్సిటీ ఏర్పాటు నేటి వరకు నోచుకోనప్పటికీ నోరు మెదపడంలేదన్నారు. కేసీఆర్ మద్దతుతో రాష్ట్రపతి అయిన కోవిందు గత సంప్రదాయాలకు భిన్నం గా ఈ దఫా ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వకుండా నిరాకరించారని పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీలు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని కోరారు.